కడప, ఫిబ్రవరి 6:అన్నమయ్య జిల్లాలో రెడ్ శాండిల్ స్మగ్లర్స్ రెచ్చిపోయారు. విధుల్లో ఉన్న కానిస్టుబుల్‌ను హత్య చేసి పరార్ అయ్యారు. ఇది జిల్లాలోనే కాదు పోలీసు శాఖలోనే కలకలం రేపుతోంది. అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలం చీనెపల్లె వద్ద ఈ దుర్ఘటన జరిగింది. అక్రమంగా రెడ్ శాండిల్ స్మగ్లింగ్ అవుతున్నట్టు పోలీసులకు సోమవారం రాత్రి సమాచారం వచ్చింది. ఇన్‌ఫర్మేషన్ కన్ఫామ్ చేసుకున్న పోలీసులు సండుపల్లి బోర్డర్‌లో కాపు కాశారు. గొల్లపల్లి చెరువు వద్దకు వాహనం రానే వచ్చింది. దాన్ని ఆపేందుకు కానిస్టేబుల్ గణేష్ వెళ్లాడు. కానిస్టేబుల్ చూసి ఆపాల్సిన స్మగ్లర్లు తప్పించుకునేందుకు యత్నించారు. అతన్ని బలంగా వాహనంతో ఢీ కొట్టి పరార్ అయ్యారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌ను పీలేరు ఆసుపత్రికి తరలించారు. ఈ మార్గ మధ్యలోనే గణేష్ కనుమూశాడు. ఈ దుర్ఘటన అనంతరం పోలీసులు ఆ ఏరియాను జల్లెడ పట్టారు. అణువణువూ గాలించారు. చివరకు వాహనంతోపాటు ఇద్దరి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు.