రాంచీ, ఫిబ్రవరి 5:ఉత్కంఠ భరితంగా సాగిన జార్ఖండ్ అసెంబ్లీ బలపరీక్షలో సీఎం చంపై సోరెన్ నెగ్గారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి తెరపడిరది. అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు మద్దతుగా 47 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. వ్యతిరేకంగా 29 మంది ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు ఓటేశారు. హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో కొత్తగా సీఎంగా ప్రమాణం చేసిన చంపై సోరెన్ ఇవాళ బలపరీక్ష నిరూపించుకున్నారు. కాగా.. భూ కుంభకోణం కేసులో ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్న హేమంత్ సోరెన్ రాజీనామా చేయడంతో 81 మంది సభ్యుల అసెంబ్లీలో చంపై సోరెన్ మెజారిటీని నిరూపించుకోవాల్సి వచ్చింది. ఫ్లోర్ టెస్ట్ నేపథ్యంలో హేమంత్ సోరెన్‌ను ఈడీ అసెంబ్లీకి తీసుకొచ్చింది. బలపరీక్షకు ముందు అసెంబ్లీలో మాట్లాడిన చంపై సోరెన్ ప్రజల మద్దతుతో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. చంపై సోరెన్.. హేమంత్ సోరెన్ 2.0 అంటూ అభివర్ణించారు.కాగా.. హైదరాబాద్ నుంచి నిన్న రాత్రి రాంచీ చేరుకున్న కూటమి ఎమ్మెల్యేలతో సీఎం చంపై సోరెన్ ఈ ఉదయం అసెంబ్లీకి చేరుకున్నారు. ఎమ్మెల్యేలకు బీజేపీ గాలెం వేస్తుందన్న ఊహగానాల మధ్య.. జేఎంఎం`ఆర్జేడీ`కాంగ్రెస్ కూటమి తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్ రిసార్ట్‌కు పంపింది. అనంతరం ఆదివారం రాత్రి రాంచీకి చేరుకుని అసెంబ్లీకి హాజరయ్యారు.అసెంబ్లీలో హేమంత్ సోరెన్ మాట్లాడుతూ.. జనవరి 31 నాటి పరిణామాలను బ్లాక్ డేగా అభివర్ణించారు. జనవరి 31న ఒక ముఖ్యమంత్రిని అరెస్టు చేయడాన్ని దేశం తొలిసారిగా చూసిందని, ఈ కుట్రలో రాజ్‌భవన్ హస్తం ఉందని ఆరోపించారు. తన అరెస్టుకు సంబంధించిన స్క్రిప్ట్‌ను చాలా ప్లాన్‌గా రచించారని అన్నారు. భూ కుంభకోణంలో తన ప్రమేయం ఉందని రుజువు చేస్తే ఆ రోజు రాజకీయాల నుంచి తప్పుకుంటానని హేమంత్ సోరెన్ చెప్పారు. గిరిజనులపై కుట్ర పన్నారని, గిరిజన సీఎం అయిదేళ్లు పూర్తికాకుండానే దించాలనుకున్నారని మాజీ సీఎం ఆరోపించారు. 8.3 ఎకరాల భూమి తనదేనని రుజువు చేసే సాక్ష్యాలను ఎవరైనా సమర్పిస్తే రాజకీయ పదవి నుంచి వైదొలగేందుకు సిద్ధమని హేమంత్ సోరెన్ తెలిపారు. 2000ల నుంచి జార్ఖండ్‌ను ఎవరు పాలిస్తున్నారో తమకు తెలుసని.. ఇంతకు ముందు ఎలాంటి కుంభకోణాలు జరగలేదని వారు చెప్పారని గుర్తుచేశారు