పాట్నా, డిసెంబర్‌ 19: ప్రశాంత్‌ కిషోర్‌! భారత రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నికల వ్యూహకర్తగా రాజకీయ పార్టీలను అధికారాన్ని అందించిన వ్యక్తి. 2011లో నరేంద్ర మోదీకి మద్దతుగా మొదలైనా ప్రస్థానం… పుష్కర కాలంలో ఆయనకు సెలబ్రిటీ స్థాయిని అందించింది. పీకే అని పిలుచుకునే ప్రశాంత్‌ కిషోర్‌ సొంత రాష్ట్రం బిహార్‌. ఆయన మద్దతుతో 2014 నాటికి మోదీ జాతీయ స్థాయి నేతగా ఎదిగారు. పీకే తన ఐప్యాక్‌ అనే టీం ద్వారా సర్వేలు నిర్వహిస్తారు. ప్రజలకు ఏం కావాలో పార్టీలకు చెబుతుంటారు. గెలవడానికి వ్యూహాలు పన్నుతుంటారు. పార్టీల విజయావకాశాలను మెరుగుపరుస్తారు.భాజపాతో పాటు జేడీ(యు), ఆప్‌, డీఎంకే, టీఎంసీ వంటి పార్టీలకు కూడా వ్యూహకర్తగా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ ఘన విజయం తర్వాత ప్రశాంత్‌ కిషోర్‌ దేశం దృష్టిని ఆకర్షించారు. నాటి నుంచి పార్టీలన్నీ ఆయనను ఆశ్రయించడం ప్రారంభించాయి. గత మూడు నాలుగేళ్లలో జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అంచనాలన్నీ నిజమయ్యాయి. తదనంతర కాలంలో ఆయన కాంగ్రెస్‌తో దోస్తీ కట్టారు. ఆ పార్టీకి కొన్ని సూచనలు చేశారు. రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ఆయన వ్యూహంలో ఓ భాగమే. కానీ 2024లో కేంద్రంలో మళ్లీ భాజపాదే అధికారం అని ఆయనే తేల్చి చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో వైకాపా విజయానికి కృషి చేసిన, పీకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పని చేస్తున్నారని విూడియా కోడై కూస్తోంది. పార్టీలు ఫిరాయించడం ఆయనకు కొత్త కాదు. సైద్ధాంతిక విలువలు పార్టీలకే లేనప్పుడు, ‘వ్యూహాలు’ అమ్ముకునే ఐప్యాక్‌ లాంటి నుంచి ఎక్కువేవిూ ఆశించక్కర్లేదు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశాన్ని ప్రశాంత్‌ కిషోర్‌ గెలుపు తీరాలకు చేర్చగలరా అనేదే అసలు ప్రశ్న. రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం.. ఆయన జనం మూడ్‌ను చెప్పగలరు. వాళ్లను ఎలా బుట్టలో వేసుకోగలరో చెప్పగలరు. ఓ పార్టీ విూద ప్రజల్లో వ్యతిరేకత ఉంటే దానిని మాత్రం అనుకూలంగా మార్చలేరు. స్థూలంగా చెప్పాలంటే పీకే జనాభిప్రాయాన్ని శాసించలేరు. ఆయనకు ఆ శక్తే ఉంటే మొన్న జరిగిన ఎన్నికల్లో… కాంగ్రెస్‌ మూడు రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయి ఉండేది కాదు. తెలుగుదేశం పార్టీ కూడా ఆయన విూద గుడ్డిగా ఆధారపడకుండా… జనం విూద ఆధారపడటం మంచిదని ఆ పార్టీ శ్రేయోభిలాషులు సూచిస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *