గుంటూరు, సెప్టెంబర్‌ 27: రాజకీయంగా ఎలా ముందుకెళ్లాలో తెలియక తెలుగుదేశం పార్టీ సతమతమవుతోంది.చంద్రబాబు చూస్తే జైల్లో ఉన్నారు. ఎన్నికలు చూస్తే సవిూపిస్తున్నాయి. అటు కేంద్ర పెద్దల నుంచి సానుకూలత రావడం లేదు. అటు రాష్ట్ర బిజెపి సైతం ఒక ప్రకటన ఇచ్చి ఊరుకుంది. పోనీ బిజెపితో తెగ తెంపులు చేసుకుందామంటే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో అన్న భయం. దీంతో కక్కలేక మింగలేక తెలుగుదేశం పార్టీ శ్రేణులు సతమతమవుతున్నాయి. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో సైతం బిజెపి అగ్ర నేతలు స్పందించకపోవడం ఏమిటని టిడిపి శ్రేణులు మండిపడుతున్నాయి. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ దేశంలో స్ట్రాంగ్‌ గా ఉంది. పేరుకే ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం కానీ భాగస్వామ్య పక్షాల కంటే బిజెపికే అధిక ప్రాధాన్యం దక్కుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు ఎన్డీఏలో భాగస్వామ్యమైన పెద్ద పార్టీ అంటూ ఒకటి లేదు.ఎన్డీఏలో బిజెపి తప్పించి మరో స్ట్రాంగ్‌ పక్షం కనిపించడం లేదు.అందుకే ఎటువంటి భయం లేకుండా.. మిత్రపక్షాల నుంచి ఇబ్బందులు లేకుండా బిజెపి పాలన సాగించగలుగుతోంది. వాజపేయి హయాంలో ఎన్డీఏ కన్వీనర్‌ హోదాలో చంద్రబాబు చక్రం తిప్పిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం నాటి పరిస్థితులను టిడిపి శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. నాడు వాజపేయి ప్రభుత్వానికి సుస్థిరత కల్పించడంలో చంద్రబాబు క్రియాశీలక పాత్ర పోషించారని.. నాడు చంద్రబాబు ఆదుకోకుంటే బిజెపి అనేది ఒకటి ఉంటుందా? అని టిడిపి శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. అందుకే తక్షణం బిజెపి పెద్దలు కలుగజేసుకుని చంద్రబాబును రిలీజ్‌ చేయించాలని కోరుతున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో బిజెపి బలీయమైన శక్తిగా మారింది. మోడీ శక్తిని అంచనా వేయడంలో ఫెయిల్‌ అయిన చంద్రబాబు గత ఎన్నికల్లో.. బిజెపికి ఎదురుగా నిలిచారు. మూల్యం చెల్లించుకున్నారు. ఇప్పటి పరిస్థితి కూడా అదే కారణం. అందుకే చంద్రబాబుతో పాటు టిడిపి శ్రేణులు సైతం బిజెపి విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచన చేస్తున్నాయి. ఎదురుగా ఇండియా కూటమి కనిపిస్తున్నా. బిజెపి పెద్దలనుంచి ఆదరణ లేకున్నా.. రాజకీయ నిర్ణయం తీసుకోలేకపోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే అడుగు వేయడానికి కూడా సాహసించడం లేదు. అంతలా బిజెపిని చూసి తెలుగుదేశం పార్టీ భయపడుతోందా.!?

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *