అన్ని స్కాములకు సూత్రదారులు, పాత్రదారులు తండ్రీ కొడుకులే

– అడ్డంగా బుక్కైన చంద్రబాబు, లోకేశ్‌…తవ్వేకొద్దీ బయటపడుతున్న ఆధారాలు
– బాబు స్కాములపై ప్రజలకు అర్ధమయ్యేలా అసెంబ్లీలో చర్చించాం
ః ఎమ్మెల్యే శ్రీ గడికోట శ్రీకాంత్‌రెడ్డి స్పష్టీకరణ

– అధికారంలోకి రావాలి..అందినకాడికి దోచుకోవాలన్నదే టీడీపీ ఉద్దేశం
– పచ్చమీడియా చేస్తున్నది జర్నలిజమా..? చంద్రబాబు ఇజమా..?
– తన భర్త క్రూరత్వాన్ని, స్వార్ధ రాజకీయాల్ని భువనేశ్వరి గుర్తుకు తెచ్చుకోవాలి
– వైయస్‌ఆర్‌సీపీ నేతలెవరూ ఆమెను అవమానించలేదు.
– నిజానిజాలేంటో ఆమె చంద్రబాబునే నిలదీయాలి.
ః ఎమ్మెల్యే శ్రీ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి

తాడేపల్లి వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాయచోటి ఎమ్మెల్యే శ్రీ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటేః

తవ్వేకొద్దీ తండ్రీకొడుకుల అవినీతిః
గత ఐదేళ్ల టీడీపీ పరిపాలనలో ఎలాంటి అవినీతి జరిగిందనేది ప్రజలందరికీ తెలుసు. గ్రామీణస్థాయిలో నీరు, చెట్టు పనుల దగ్గర్నుంచీ పేదలకిచ్చే మరుగుదొడ్ల వరకు నిధుల దోపిడీ విధానం ఎలా జరిగిందనేది కూడా అందరికీ తెలిసిందే. మరి, ఈ అవినీతిలో చంద్రబాబు, లోకేశ్‌ పాత్ర ఎంత ఉందనే విషయంతో పాటు పైస్థాయికి వచ్చేసరికి అమరావతి రాజధాని పేరిట ఆ తండ్రీకొడుకులు, నారాయణ వంటి టీడీపీ పెద్దలు చేసినటువంటి అవినీతి భాగోతం తవ్వేకొద్దీ బయటకొస్తుంది. వీటన్నింటినీ చూస్తే రాష్ట్రప్రజలే కాకుండా దేశం మొత్తం కూడా నివ్వెరబోయే పరిస్థితి ఉంది. ముఖ్యంగా యువతను అడ్డంపెట్టుకుని స్కిల్‌డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో రూ.371 కోట్లు షెల్‌ కంపెనీలకు విడుదల చేసిన చంద్రబాబు తిరిగి వాటిని తన ఖాతాలోకి ఎలా జమచేసుకున్నాడనే వాస్తవాల్ని మనం ఇప్పటిదాకా పత్రికల్లో చదివాం కానీ.. అసలు ఇందులో నిజాల్ని పూర్తిగా అందరికీ కళ్లకు కట్టినవిధంగా అసెంబ్లీ సమావేశాల్లో అర్ధవంతమైన చర్చ జరిగింది.

టీడీపీ సభ్యుల తీరు జుగుప్సాకరంః
అసెంబ్లీ సమావేశాలు ఐదురోజుల పాటు జరిగితే.. మొదటి రెండ్రోజుల్లో టీడీపీ సభ్యుల జుగుప్సాకరమైన తీరును చూసి ప్రజలు అసహ్యించుకున్నారు. తమ అవినీతి బండారం మొత్తం బయటపడు తుందని, తమ అధినేత చంద్రబాబు అరెస్టుపై చర్చలో పాల్గొంటే తప్పకుండా అభాసుపాలవుతామనే భయంతో సమావేశాల మొదటి రోజు నుంచే గందరగోళం చేయడం చూశాం. స్పీకర్‌ పోడియం చుట్టుముట్టారు. ఆయన ఎదుటనున్న కంప్యూటర్‌లను, ఇతర వస్తువుల్ని లాగిపడేశారు. ఇంకా ఆయనపై పేపర్లు చించి మొఖాన విసిరేసిన పరిస్థితిని ప్రజలంతా చూశారు. మీసాలు తిప్పడం, తొడలు కొట్టడం, విజిల్స్‌ వేసి అరాచకం చేసిన దృశ్యాలనూ ప్రజలంతా చూశా రు.

అవినీతిపై చర్చ జరిగితే దొరికి పోతామనే పలాయనం:
ప్రొసీజర్‌ ప్రకారం శాసనసభా సమావేశాల్లో క్వచ్ఛన్‌అవర్‌ జరగాల్సి ఉంది. అందులో టీడీపీ సభ్యుల ప్రశ్నలు కూడా ఉన్నాయి. వాటిపై సమాధానం చెప్పేందుకు అధికారపక్షం తరఫున సభ్యులు సిద్ధంగా ఉన్నామంటూ టీడీపీ సభ్యులకు చెప్పాం. అయితే, వాళ్లు మాత్రం క్వచ్ఛన్‌ అవర్‌ను సజావుగా సాగనివ్వకుండా.. చంద్రబాబు అరెస్టుపై చర్చించాల్సిందేనని వాయిదా తీర్మానంపై పట్టుబట్టారు. దానిపై బీఏసీ మీటింగ్‌లో పెట్టి చర్చించి నిర్ణయం తీసుకుంటామని .. ఖచ్చితంగా ఆ అంశాన్ని చర్చించేందుకు సిద్ధమని మేం ప్రకటించాం. ఆమేరకు మా నాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా రెండోరోజు సమావేశంలో టీడీపీ సభ్యుల వాయిదా తీర్మానంపై చర్చకు గ్రీన్‌సిగ్నల్‌ చెప్పారు. బీఏసీ సమావేశానికీ రావాలని పర్సనల్‌గా కూడా టీడీపీ సభ్యుల్ని ఆహ్వానించాం. కానీ, వాళ్ల ఉద్దేశం మాత్రం సమావేశంలో చర్చ జరపడమో.. ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పడమో కాదు. అవినీతిపై చర్చ పెడితే తాము ఇరుక్కుంటామని తెలిసి బీఏసీ సమావేశానికి కూడా వారు హాజరుకాలేదు.

వాయిదాతీర్మానంపై వికృతచేష్టలుః
మొదటిరోజు గొడవ చేశారు. బీఏసీ సమావేశానికి హాజరుకాలేదు. పోనీ, మీరు పట్టుబట్టిన వాయిదా తీర్మానంపై చర్చించేందుకు మేం సిద్ధమని చెబుతున్నా.. టీడీపీ సభ్యులు మాత్రం వికృతంగా ప్రవర్తించారు. మార్షల్స్‌పై దాడులు చేశారు. స్పీకర్‌ గారిని అవమానించారు. బాలకృష్ణ విజిల్‌ ఊదుతూ మీసాలు తిప్పి తొడలు కొట్టడాన్ని అందరూ చూశారు. అసలెందుకు, వారు అంతగా గోల చేస్తున్నారని ప్రశ్నిస్తే మాత్రం సమాధానముండదు. స్కిల్‌డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో రూ.371 కోట్లు చంద్రబాబు ఏవిధంగా ప్రజాధనం దోపిడీకి పాల్పడ్డాడనేది.. సీమెన్స్‌ కంపెనీకి తెలియకుండానే దాని పేరును వాడుకుని ఒప్పందాలు చేసుకోవడం, డిజీటెక్‌ ద్వారా షెల్‌ కంపెనీలకు రూ.241 కోట్లు తన ఖాతాలో జమచేసుకోవడంపై బయట జరుగుతున్న ప్రచారాన్ని మేము ఆధారాలతో సహా నిరూపించేందుకు సిద్ధమని చర్చ పెట్టాం. అయినా టీడీపీ సభ్యుల అల్లరి, వికృతచేష్టలు మాత్రం ఆపలేదు. శృతిమించి ప్రవర్తించిన ముగ్గుర్ని మాత్రమే సస్పెండ్‌ చేశాం. మిగతా వాళ్లైనా చర్చలో ఉండాలి కదా..? కానీ, తమ అవినీతి ఎక్కడ బయటపడుతుందోనని.. చర్చ జరగకుండా ఎలాగైనా అడ్డుకోవాలనే ప్రయత్నం చేశారు గానీ వారి వ్యూహం ఫలించలేదు. మొత్తానికి సమావేశం నుంచి బయటకెళ్లారు. ఈ పరిణామాల్ని ప్రజలు గమనించాలని కోరుతున్నాను.

బాబు నిప్పు అంటారే గానీ చర్చించరుః
ఐదురోజుల్లో సభలో స్కిల్‌స్కాం, ఫైబర్‌గ్రిడ్, ఇన్నర్‌రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ స్కాంలపై సుదీర్ఘంగా రెండు మూడు గంటల పాటు చర్చ జరిగినా టీడీపీ మాత్రం పాల్గొనలేదు. తమ వాదనను వినిపించే అవకాశం వచ్చినా పలాయనం చిత్తగించారు. మూడోరోజు నుంచి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నామంటూ వెళ్లిపోయిన టీడీపీ తమ పార్టీ కార్యాలయంలో మాక్‌ అసెంబ్లీ అని పెట్టుకుని పనికిరాని పీపీటీలిచ్చుకున్నారు. అదే అసెంబ్లీలో ఉంటే, వాళ్లడిగే ప్రశ్నలకు వెంటనే సమాధానాలొస్తాయని భయపడి.. బయటకెళ్లే తమను ప్రశ్నించని విధంగా అబద్ధాలు చెప్పుకున్నారు. ఎంతసేపూ.. మీ చంద్రబాబు నిప్పు అని చెబుతారే తప్ప.. ఆ నిప్పులాంటి నిజాల్ని నిరూపించే చర్చకు రావాలని కోరితే మాత్రం తోకముడిచి పారిపోయే పరిస్థితి వారిది.

ప్రజల సమస్యలు పట్టని టీడీపీః
ఐదురోజుల అసెంబ్లీ సమావేశాల్లో 25 గంటల 10 నిముషాల సేపు అర్ధవంతమైన చర్చలు, తీర్మానాలు జరిగాయి. క్వచ్ఛన్‌అవర్‌లో 50 ప్రశ్నలకు, స్టార్‌ క్వచ్ఛన్‌లు 22కి ప్రభుత్వం తరఫున మేం సమాధానం ఇచ్చాం. 18 బిల్లుల్ని ఆమోదించాం. దాదాపు 47 మంది సభ్యులు మాట్లాడారు. ఆరు షార్ట్‌ డిస్కషన్స్‌ నడిపాం. మూడు అంశాలపై తీర్మానాలు కూడా చేశాం. ఇవ్వన్నీ బీఏసీ సమావేశంలో పెట్టి ప్రజలకు సంబంధించిన అంశాలపై చర్చించాకనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటిపై చర్చించేందుకు టీడీపీ సభ్యులు బీఏసీకి హాజరుకాలేదు. వారిలో కేవలం ముగ్గుర్ని మాత్రమే సస్పెండ్‌ చేస్తే.. మిగతా వారు హాజరుకాకుండా ఎందుకు బాయ్‌కాట్‌ చేయాల్సి వచ్చిందో సమాధానమివ్వాలని డిమాండ్‌ చేస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్‌ స్కీమ్, ఏపీ స్పెషల్‌ సెక్యూరిటీ గ్రూప్‌ బిల్లుతో పాటు పేదలకిచ్చే అసైన్డ్‌భూముల సవరణ బిల్లు, ప్రయివేటు యూనివర్శిటీ సవరణ బిల్లు, కాంట్రాక్టు ఎంప్లాయీస్‌ సర్వీస్‌ రెగ్యులేషన్‌ బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించాం. ఫైబర్‌గ్రిడ్‌ స్కామ్‌పై షార్ట్‌ డిస్కషన్‌ జరిగింది. అదేవిధంగా కేంద్రం ఆమోదించిన 33 శాతం మహిళా రిజర్వేషన్‌ బిల్‌ను ప్రస్తావిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ప్రభుత్వం అమలు చేస్తున్న 50 శాతం రిజర్వేషన్‌ను సుదీర్ఘంగా చర్చించి వివరించాం. ప్రజలకు ఉపయోగపడే బిల్లులపై కూడా చర్చించేందుకు టీడీపీ ముందుకురాలేదంటే.. ఆ పార్టీ సిద్ధాంతం, లక్ష్యం మనం అర్ధం చేసుకోవాలి. అధికారంలోకి రావాలి..అందినకాడికి దోచుకోవాలన్నదే ఆ పార్టీ ఉద్దేశంగా ప్రజలు అర్ధంచేసుకోవాలని మనవి చేస్తున్నాను.

పచ్చమీడియా కుట్రలుః
అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఐదేళ్లుపాటు ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్, నారాయణ, అచ్చెన్నాయుడు మరికొందరు పెద్దలు ఏవిధంగా దోచేశారో.. అని ఆధారాలతో సహా మేం అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టాం. అయితే, చంద్రబాబు హయాంలో జరిగిన ప్రజాధనం దోపిడీని, కుంభకోణాల చరిత్ర ప్రజల్లోకి వెళ్లకూడదనే ఉద్దేశంతో పచ్చమీడియా పత్రికలు, ఛానెళ్లు ఎంత కుట్ర చేశాయనేది అందరూ చూశారు. ఈనాడు, ఈటీవీ, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ5 చేసేది జర్నలిజమా..? చంద్రబాబు ఇజమా..? ఒకపక్కన శాసన సభలో వాస్తవాలపై చర్చ జరుగుతుంటే.. ఆ మీడియా మాత్రం అబద్ధాల్ని అల్లేసి ప్రజల్ని తప్పుదారిపట్టించడం చాలా బాధాకరం. ఇలాంటి జర్నలిజాన్ని పూర్తిగా ఖండించాల్సిందే.

బాబు క్రూరత్వాన్ని భువనేశ్వరి గారే ఆలోచించాలిః
ఇటీవల చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గారు పబ్లిక్‌మీటింగ్‌లో మాట్లాడుతూ.. తనను వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు అవమానించారని అన్నారు. ఈ సందర్భంలో ఆమె తన భర్త క్రూరత్వాన్ని.. ఆయన స్వార్ధ రాజకీయాల్ని గుర్తుకుతెచ్చుకుని ఆలోచన చేయాలని మనవి చేస్తున్నాను. నిండు అసెంబ్లీలో ఆనాడు చంద్రబాబు వైయస్‌ వివేకానందరెడ్డి గారి హత్యపై మాట్లాడుతూ జగన్‌గారి తల్లిని, చెల్లిని పదేపదే నోటికొచ్చినట్లు మాట్లాడాడు. అప్పుడు జగన్‌ గారు కూడా స్పందించి తనకున్న రెండు కళ్లల్లో ఒక కన్నును ఎలా పొడుచుకుంటానని.. కనుక పదేపదే వివేకా హత్యను రాజకీయం చేయొద్దని స్పష్టంగా చెప్పినా చంద్రబాబు వినలేదు. అంతేగానీ, వైయస్‌ఆర్‌సీపీ నేతలెవరూ భువనేశ్వరి గారిని గురించి అసభ్యకరంగా అవమానించలేదు. దీనిపై నిజనిజాల్ని స్వయంగా చంద్రబాబునే అడిగి తెలుసుకోవాలని భువనేశ్వరి గారికి విన్నవించుకుంటున్నాను.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *