ఒంగోలు, డిసెంబర్‌ 13:వచ్చే ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసులరెడ్డికి వైసీపీ టికెట్‌ ఇస్తుందా ఇవ్వదా..? ఇటీవల జరిగిన వరుస పరిణామాల నేపథ్యంలో ఆయనకు ఈసారి టికెట్‌ దక్కక పోవచ్చనే విషయం తేలిపోయింది. ఆ పార్టీలోని నేతలే ఈ ప్రచారం మొదలు పెట్టారు. మంత్రి పదవి పోయిన తర్వాత బాలినేని వ్యాఖ్యలు, ఆయన్ను సీఎంఓ కార్యాలయానికి పిలిపించి బుజ్జగించడం, ఆ తర్వాత మళ్లీ కొన్నిరోజులకు బాలినేని నోరుజారడం.. ఇవన్నీ మామూలుగా మారిపోయాయి. కానీ ఈసారి పరిస్థితిలో మార్పు వచ్చింది. బాలినేని తాజాగా నోరుజారారు. మంత్రిగా ఉన్నప్పుడు తాను కలెక్షన్లు చేపట్టేవాడినని తనే ఒప్పుకున్నారు. తెలంగాణ ఎన్నికలపై బెట్టింగ్‌ కాశానని కూడా చెప్పారు. జగన్‌ గెలవాలని తమకు ఉందని, కానీ తమపై అలాంటి ప్రేమ జగన్‌ కు ఉందో లేదో తెలియదన్నారు. దీంతో మరోసారి ఆయనకు సీఎంఓ కార్యాలయం నుంచి పిలుపొచ్చింది. కానీ ఈసారి అక్కడికి పిలిపించుకోలేదు, ఫోన్‌ లోనే కాస్త గట్టిగా క్లాస్‌ పీకారని తెలుస్తోంది. దీంతో ఆదివారం ప్రెస్‌ విూట్‌ పెట్టిన బాలినేని.. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. మరోసారి జగనే సీఎం అవుతారని చెప్పారు. గతంలో బాలినేని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడల్లా ఆయన్ను తాడేపల్లికి పిలిపించేవారు. కానీ ఈసారి ఫోన్‌ వచ్చింది కానీ, పిలుపు రాలేదు. అంటే బాలినేనికి అంత సీన్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని అధిష్టానం ఫిక్స్‌ అయింది. అదే సమయంలో ఆ ఫ్రస్టేషన్‌ అంతా తర్వాతి రోజు ప్రెస్‌ విూట్‌ లో చూపించారు బాలినేని. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. గతంలో ఎప్పుడూ ఇంత ఘాటుగా ఆయన స్పందించలేదు. ఇప్పుడు అవసరం లేకపోయినా స్పందించేసరికి ఆయనకు ఏ స్థాయిలో డోస్‌ పడిరదో అర్థమవుతోంది. బాలినేని ఎప్పుడూ పెద్దగా వార్తల్లోకెక్కేవారు కాదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వ్యవహారంలో మార్పు వచ్చిందని అంటున్నారు. రెండోసారి ఆయనకు మంత్రి పదవి దక్కకపోవడంతో బాలినేని అలిగారు. ఆయన అలకకు అదే ప్రధాన కారణం. ప్రకాశం జిల్లానుంచి ఆదిమూలపు సురేష్‌ కి రెండోసారి అవకాశం ఇవ్వడంతో ఆయన మరింత ఇదైపోయారు. అప్పటినుంచి ఆయన అలగడం, అధిష్టానం బుజ్జగించడం సహజమైపోయింది. ఆ తర్వాత తరచూ ఆయన వార్తల్లోకెక్కుతున్నారు. వైవీ సుబ్బారెడ్డికి సీఎం జగన్‌ ప్రాధాన్యత ఇవ్వడం కూడా బాలినేనికి ఇష్టం లేదు. ఆయన ఒంగోలులో తన వ్యతిరేక వర్గాన్ని చేరదీస్తున్నారనేది బాలినేని ప్రధాన ఆరోపణ. కానీ జగన్‌ వైవీకి ప్రాధాన్యత తగ్గించలేదు. టీటీడీ చైర్మన్‌ గా తప్పుకున్నాక వైవీకి ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించారు. దీంతో బాలినేని మరింత నొచ్చుకున్నారు. ఇటీవల ప్రకాశం జిల్లాలో కబ్జాలు, అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో బాలినేని అనుచరులు టార్గెట్‌ అయ్యారు. అధికార పార్టీలో ఉండి కూడా తన అనుచరులను రక్షించుకోలేకపోయానని ఆయన బాధపడ్డారు. అక్కడినుంచి మరో ఎపిసోడ్‌ మొదలైంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూనే తన కొడుకు రాజకీయ భవిష్యత్‌ కోసం బాలినేని ప్రణాళికలు రచించారు. కానీ పార్టీలో కింది స్థాయి నాయకత్వం ఆయనకు సహకరించడంలేదు. పైగా జిల్లా మొత్తం బాలినేని పెత్తనం కోరుకుంటున్నారు. గతంలో ఇన్‌ చార్జ్‌ పదవి ఇచ్చినా వద్దని, ఇప్పుడు జిల్లా కావాలంటే ఎలా అని అధిష్టానం ప్రశ్నిస్తోంది. ఈ దశలో బెట్టింగ్‌ వ్యాఖ్యలు మరింత కలకలం రేపాయి. దీంతో బాలినేని మరోసారి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆయన వివరణ ఇచ్చుకున్నా కూడా అధిష్టానం మాత్రం కాస్త కఠినంగానే ఉండే అవకాశముంది. వచ్చే ఎన్నికల్లో బాలినేని కుటుంబానికి వైసీపీ నుంచి టికెట్‌ దక్కే అవకాశాలు లేవని ఆ పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *