విజయవాడ, డిసెంబర్‌ 12:ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాతో సీఎం జగన్‌ నేరుగా రంగంలోకి దిగి నియోజకవర్గ, జిల్లా ముఖ్య నేతలతో చర్చలు జరుపుతున్నారు. అయితే.. ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ ఇస్తారన్న ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణ ఆమె వెంట నడుస్తారన్న చర్చ కూడా సాగుతోంది.పార్టీ, పదవికి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. దీనిపై వైసీపీ అధినేత, సీఎం జగన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న అంశం ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన జగన్‌ కీలక నేతలతో చర్చలు ప్రారంభించారు. ఇప్పటికే సీఎం క్యాంపు కార్యాలయానికి వైసీపీ కీలక నేతలు అయోధ్య రామిరెడ్డి, గంజి చిరంజీవి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, దొంతిరెడ్డి వేమారెడ్డి చేరకున్నారు. ఆర్కే రాజీనామా గురించి ఈ నేతలతో సీఎం వైఎస్‌ జగన్‌ చర్చిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీ నేతకు మంగళగిరి టికెట్‌ ఇవ్వాలన్నది జగన్‌ ఆలోచనగా తెలుస్తోంది.తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించిన షర్మిల.. త్వరలో ఏపీ పాలిటిక్స్‌ లో యాక్టీవ్‌ అవుతారన్న ప్రచారం కొంతకాలంగా సాగుతోంది. ఇదే జరిగితే.. షర్మిలతో ఆళ్ల రామకృష్ణారెడ్డి కలిసి నడుస్తారన్న టాక్‌ ఏపీ పొలిటికల్‌ సర్కిల్స్‌ లో జోరుగా వినిపిస్తోంది. షర్మిలతో ఆళ్ల రామకృష్ణారెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.షర్మిల పార్టీకి పెడతారన్న ప్రచారం సాగుతున్న సమయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి వచ్చి షర్మిలతో భేటీ కావడం అప్పట్లో సంచలనంగా మారింది. వైఎస్‌ జగన్‌ దూతగా ఆళ్ల వచ్చారని కొందరు వ్యాఖ్యానిస్తే.. షర్మిలకు మద్దతు తెలపడానికే ఆయన పార్టీకి, పదవికి రాజీనామా చేశారని ఆ సమయంలో మరికొందరు విశ్లేషించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *