విజయవాడ, డిసెంబర్‌ 12: టిడిపి, జనసేన, బిజెపి మధ్య పొత్తు ఖరారు అయ్యిందా? మూడు పార్టీలు కలిసి నడవనున్నాయా? అందుకు సరైన వేదిక దొరికిందా? ఆ వేదిక నుంచే స్పష్టత ఇవ్వనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఆ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ముఖ్యంగా సీఎం జగన్‌ టార్గెట్‌ గా ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. ఇప్పటికే టిడిపి,జనసేన మధ్య పొత్తు కుదిరింది. బిజెపి వైఖరి పై త్వరలో స్పష్టత రానుంది.అమరావతి ఉద్యమానికి నాలుగేళ్లు పూర్తి కానుంది. ఈ సందర్భంగా అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈనెల 17న భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు అమరావతికి మద్దతుగా నిలిచిన అన్ని పార్టీలకు ఆహ్వానం అందించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్‌ తో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా హాజరుకానున్నారు. అమరావతి ఉద్యమ కార్యాచరణను రూపొందించనున్నారు. ఎన్నికల ముంగిట జగన్‌ మూడు రాజధానుల అంశాన్ని గట్టిగానే తిప్పి కొట్టాలని భావిస్తున్నారు. తద్వారా పొత్తు సంకేతాలను పంపించమన్నారని ప్రచారం జరుగుతోంది.ఈ సభకు, సభా ప్రాంగణానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 2014లో చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన మైదానంలోనే ఇప్పుడు సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ప్రాంగణంలో 2014లో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు అదే మైదానంలో సభ ఏర్పాటు చేయడం విశేషం. త్వరలో ఎన్నికలు జరగనున్న వేల సీఎం జగన్‌ విశాఖ నుంచి పాలనకు సిద్ధపడుతున్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలు ఐక్యత ప్రదర్శిస్తున్నాయి. పొత్తు ప్రకటన తర్వాత చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ బహిరంగ సభలో కలవడం ఇదే మొదటిసారి. దీనికి తోడు పురందేశ్వరి హాజరుకానుండడం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రాజకీయంగాను ఆసక్తి పెరుగుతోంది.కాంగ్రెస్‌ తో పాటు వామపక్ష నాయకులు సైతం ఈ సభకు హాజరు కానున్నారు. జాతీయస్థాయిలో విరుద్ధ భావాలు ఉన్న పార్టీలు ఒకే వేదిక పైకి వస్తుండడం విశేషం. అయితే అమరావతి రాజధాని లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న ఈ సభ దానికే పరిమితమవుతుందని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. అయితే టిడిపి, జనసేన, బిజెపి నాయకులు హాజరు కానుండటంతో హై టెన్షన్‌ నెలకొంది. ఆ మూడు పార్టీల కలయిక తప్పనిసరిగా జరుగుతోందని అధికార పక్షం అనుమానం వ్యక్తం చేస్తోంది. మొత్తానికి అయితే ఈ నెల 17న కొత్త రాజకీయ సవిూకరణలకు తెర తీసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *