నెల్లూరు, డిసెంబర్ 13:ఒకప్పుడు నెల్లూరు రాజకీయాలను శాసించింది ఆనం కుటుంబం. జిల్లాలో కనీసం రెండు స్థానాలకు ఆనం కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తుండేది. నెల్లూరు సిటీ పరిధిలో కార్పొరేటర్లు, ఇతర నామినేటెడ్ పోస్టుల్లో.. వారు సూచించినవారికే అవకాశాలు దక్కేవి. ఇతర జిల్లా పోస్టుల్లో కూడా వారి శిష్యగణమే ఉండేది. ఇదంతా గతం. ఇప్పుడు ఆనం పెత్తనం జిల్లా రాజకీయాల్లో కనుమరుగైపోతోంది. రామనారాయణ రెడ్డి ప్రస్తుతం వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆయన పార్టీ మారడంతో అక్కడ ఆయన మాట చెల్లుబాటు కావడంలేదు. ప్రస్తుతం నెల్లూరు సిటీలోని తన ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు రామనారాయణ రెడ్డి. అధికార పార్టీ వైసీపీకి అనూహ్యంగా దూరమైన ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీకి దగ్గరయ్యారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుని కలిశారు, నెల్లూరు జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం యాత్ర సందర్భంగా హడావిడి చేశారు. కానీ ఆ తర్వాత అంతా సైలెన్స్. ఇంతకీ ఆనం ఈసారి ఎక్కడ పోటీ చేస్తారు, ఏ నియోజకవర్గానికి వెళ్తారు, అసలు పోటీ చేస్తారా, వారసులకు అవకాశం ఇస్తారా.. అనేది తేలడంలేదు. ప్రస్తుతం ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. అది ఆయనకు కొత్త నియోజకవర్గం. తొలిసారి 2019లో పోటీ చేసి గెలుపొందారు. వాస్తవానికి అక్కడికి వెళ్లడం ఆయనకు పూర్తిగా ఇష్టంలేదు. కానీ వైసీపీలో ఆ స్థానం మాత్రమే ఖాళీగా ఉండటంతో అక్కడకు వెళ్లి గెలిచారు రామనారాయణ రెడ్డి. ఆ తర్వాత కొన్నాళ్లు అక్కడే ఉన్నా.. మంత్రి పదవి దక్కకపోవడం, తనకు ఆశించిన ప్రయారిటీ ఇవ్వకపోవడంతో ఆయన జగన్ కు దూరం జరిగారు. స్వపక్షంలోనే ఉండి, విపక్షంలా మాట్లాడటం మొదలు పెట్టారు. దీంతో ఆయనపై వేటు పడిరది. వెంకటగిరిలో ఆయన్ను కాదని, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి పార్టీ పెత్తనం ఇచ్చారు. దీంతో ఆనం వెంకటగిరిని ఖాళీ చేసి నెల్లూరుకు వచ్చారు. అనువైన నియోజకవర్గం కోసం ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ఆనం టీడీపీలో చేరి నెల్లూరు సిటీ లేదా, రూరల్ నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ అనూహ్యంగా నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా టీడీపీలో చేరడంతో ఆ స్థానం ఆనంకు దొరకలేదు. ఇక నెల్లూరు సిటీనుంచి ఎలాగూ పొంగూరు నారాయణ ఉన్నారు. అందుకే తన పాత నియోజకవర్గం ఆత్మకూరుకు వెళ్లాలనుకున్నారు ఆనం. అయితే ఇప్పుడు అక్కడ కూడా చిక్కొచ్చిపడినట్టుంది. ఆయన కొన్నాళ్లుగా ఆత్మకూరు వైపే చూడటంలేదు. నారా లోకేష్ పాదయాత్ర ఆత్మకూరు నియోజవర్గంలో ఉన్నప్పుడు ఆనం మార్కు హడావిడి చేశారు. కానీ ఇప్పుడు పూర్తిగా నియోజకవర్గానికి దూరమయ్యారు. ఇక్కడ ఆనం పోటీ చేస్తాడనే వార్తలు వినిపించడంతో టీడీపీలో మిగతా నేతలు ఆ సీటుపై ఆశలు వదిలేసుకున్నారు. కానీ ఆనం కూడా అక్కడికి రాకపోవడం, కనీసం స్థానికంగా సమావేశాలు ఏర్పాటు చేయకపోవడంతో ఆ సీటుపై అనేక అనుమానాలు మొదలయ్యాయి. అసలింతకీ ఆనం ఇల్లు దాటి ఎందుకు బయటకు రావడంలేదు, సడన్ గా ఆయన రాజకీయ కార్యకలాపాలు ఎందుకు ఆపేశారు అనేది తేలాల్సి ఉంది.