ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమే..
జమ్మూకశ్మీర్ అంశంలో రాష్ట్రపతి ప్రకటనపై జోక్యం చేసుకోలేము
సుప్రీం కోర్టు కీలక తీర్పు
న్యూ డిల్లీ డిసెంబర్ 11: జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు అంశంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. జమ్మూకశ్మీర్ అంశంలో రాష్ట్రపతి ప్రకటనపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఆర్టికల్ 370 రద్దుపై కేంద్రం వాదనలను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఆర్టికల్ 370 అనేది తాత్కాలిక నిబంధన మాత్రమే అని, శాశ్వతం కాదని స్పష్టం చేసింది.ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సోమవారం తమ నిర్ణయాన్ని ప్రకటించింది. రాజ్యాంగబద్ధంగానే ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం జరిగిందని తెలిపింది. రాజ్యాంగంలోని అన్ని అంశాలూ కశ్మీర్‌కు వర్తిస్తాయని, మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో జమ్మూకశ్మీర్ సమానమే అని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ఆర్టికల్ 370 రద్దు వెనుక ఎటువంటి దురుద్దేశం కనిపించడం లేదని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ మేరకు కేంద్రం నిర్ణయానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది.జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ని 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అనంతరం జమ్మూ` కశ్మీర్ ను రెండు కేంద్రపాలిత (జమ్మూ`కశ్మీర్, లడఖ్) ప్రాంతాలుగా ప్రకటించింది.