విజయవాడ, డిసెంబర్‌ 9: బిజెపి ఏపీపై ఫోకస్‌ పెట్టిందా? పొత్తులపై కీలక నిర్ణయం తీసుకుందా? ముందుగా ఓ కీలక నాయకుడిని పంపించిందా? సదరు నాయకుడు ఒక నివేదికను బిజెపి పెద్దలకు అందించారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జాతీయ స్థాయిలో చక్రం తిప్పే ఓ నాయకుడు రహస్యంగా విజయవాడ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. పొత్తులపై ఓ నలుగురు సీనియర్‌ అధికారుల అభిప్రాయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పొత్తులతో ముందుకు వెళితే ప్రయోజనమా? లేకుంటే ఒంటరి పోరే శ్రేయస్కరమా? అని సదరు నేత విస్తృత చర్చలు జరిపినట్లు సమాచారం. ఎక్కువమంది అభిప్రాయాన్ని క్రోడీకరించి బిజెపి పెద్దలకు నివేదించినట్లు తెలుస్తోంది.2014 మాదిరిగా టిడిపి జనసేన బిజెపి కలిసి వెళ్లాలి అన్నది పవన్‌ కళ్యాణ్‌ భావన. చంద్రబాబు సైతం పొత్తు కోసం మొన్నటి వరకు ఆరాటపడ్డారు. కానీ గతం మాదిరిగా ఇప్పుడు అంత ఆత్రం చూపించడం లేదు. పవన్‌ కళ్యాణ్‌ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బిజెపి కూడా తమతో వస్తుందని తేల్చి చెబుతున్నారు. అటు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పొత్తుపై ఎటువంటి సానుకూల ప్రకటనలు చేయకపోయినా.. వైసీపీ సర్కార్‌ పై దూకుడుగా ఉన్నారు. జనసేన విషయంలో సానుకూలంగా మాట్లాడుతున్నారు. అదే సమయంలో టిడిపి పై ఎటువంటివ్యతిరేక వ్యాఖ్యలు చేయడం లేదు.పొత్తులపై ఊగిసలాట జరుగుతున్న ఈ సమయంలో జాతీయస్థాయిలో పలుకుబడి ఉన్న ఓ నాయకుడు ఏపీలో పర్యటించి వివరాలు సేకరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో కర్ణాటకలో సైతం బిజెపి వ్యవహారాల్లో సదరు నాయకుడు చక్రం తిప్పిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి నేత ఏపీలోనే నలుగురు బిజెపి సీనియర్లను కలిసి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే అందులో మెజారిటీ నాయకులు చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడమే మంచిదన్న నిర్ణయం వెల్లడిరచినట్లు తెలుస్తోంది.జగన్‌ అధికారం దూరం చేస్తేనే మేలన్న స్థిరమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం.అయితే గతంలో చంద్రబాబు వ్యవహార శైలి సైతం ఈ సందర్భంగా కొందరు నేతలు గుర్తు చేసినట్లు తెలుస్తోంది. గతంలో రెండు సార్లు బిజెపితో పొత్తు పెట్టుకుని చంద్రబాబు చివరి నిమిషంలో దెబ్బేశారు. మరోసారి అదే పరిస్థితి తలెత్తే అవకాశం ఉందా? అని ఆరా తీసినట్లు తెలుస్తోంది. అయితే జగన్‌ రూపంలో బలమైన ప్రత్యర్థి ఉండడంతో చంద్రబాబు మునుపటిలా బిజెపి విషయంలో వ్యవహరించలేరని సదరు నాయకులు చెప్పినట్లు సమాచారం. టిడిపి, జనసేనతో కలిసి వెళితేనే సీట్లు, ఓట్లు పెరుగుతాయని.. ముఖ్యంగా ఎంపీ స్థానాలను గెలుచుకోవచ్చని బిజెపి నాయకులు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నివేదికను బిజెపి అగ్ర నేతలకు సదరు కీలక నేత చేరవేసినట్లు సమాచారం. మరి హై కమాండ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *