విజయవాడ, నవంబర్‌ 27:ఏపీ లో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒక వైపు ఆ ఎన్నికల హడావుడిలో బిజీగా ఉన్నప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లు కూడా వేగంగా చేస్తున్నది. ఆ సార్వత్రిక ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చిలోనే సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు ఆరంభించేసింది. ఇక ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి క్షేత్ర స్థాయి కార్యాచరణను ఎన్నికల సంఘం ఇప్పటికే దాదాపుగా పూర్తి చేసేసింది. ఈవీఎంలను జిల్లాలకు తరలిచినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఎన్నికల షెడ్యూల్‌ ఫిబ్రవరి 2న విడుదలయ్యే అవకాశాలున్నాయి. అలాగే ఏపీలో మార్చి మొదటి వారంలోనే ఎన్నికలు జరుగుతాయని ఆ వర్గాలు చెబుతున్నాయి. మార్చి 6న ఏపీలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఏపీలో ఓటర్ల జాబితాను సవరించి ముసాయిదాను ప్రకటించడం కూడా పూర్తయిపోయింది. ఈ ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించి డిసెంబర్‌ నాటికల్లా వాటిని పరిష్కరించే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం ఉంది. అసలు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయని గతంలో విస్తృతంగా ప్రచారం అయ్యింది. అప్పట్లోనే కేంద్ర ఎన్నికల సంఘం అందుకు అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేసిందని అప్పట్లో రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరిగింది. అసలు ఏడాదిన్నర కిందటి నుంచే ఏపీలోని జగన్‌ సర్కార్‌ ముందస్తు ఎన్నికల ముచ్చటను తెరవిూదకు తెచ్చింది. ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల స్వయంగా ఈ విషయాన్ని అప్పట్లో ప్రకటించారు. అయితే తరువాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ ముచ్చట మరుగున పడిరది. వాస్తవానికి జగన్‌ కూడా రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం, ప్రభుత్వం ఫ్లాగ్‌ షిప్‌ గా భావిస్తున్న సంక్షేమ పథకాలకు కూడా నిధులు సమకూరు అవకాశం లేని పరిస్థితులు నెలకొనడంతో ఫథకాలు నిలిపివేసి ఇప్పటికే ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను మరింత పెంచుకునే కంటే.. అవి కొనసాగుతుండగానే ముందస్తుకు వెళ్లి లబ్ధి పొందాలని జగన్‌ భావించినట్లు అప్పట్లో పరిశీలకులు విశ్లేషించారు. ప్రభుత్వ అడుగులు కూడా ముందస్తు దిశగానే పడుతున్నాయని అప్పట్లో రాజకీయ వర్గాలలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ముందస్తుకు కేంద్రం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాకపోవడంతో ముందస్తు మాట వెనుకకు వెళ్లి పోయింది. ఈ నేపథ్యంలోనే మూడు నెలల కిందట జగన్‌ స్వయంగా వచ్చే ఏడాది మార్చిలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ప్రకటించి, అందుకు సన్నద్ధం కావాల్సిందిగా పార్టీ నేతలు, శ్రేణులకు పిలుపు ఇచ్చారు. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు మార్చి మొదటి వారంలోనే ఏపీ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ఏర్పాటు చేస్తున్నది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లలో భాగంగానే ఏపీలో ఎన్నికల ఏర్పాటుకు కూడా వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల దిశగా ఇప్పటికే ఈసీ వేగంగా అడుగులేస్తోంది. ముందు జమిలి ఎన్నికల నిర్వహణకు వీలుగా ఏర్పాట్లు చేసుకున్న ఈసీ.. అనంతరం కేంద్రం మందుకు రాకపోవడంతో అసెంబ్లీ గడువు ముగిశాక ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆగస్టులో ప్రారంభించిన ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఇప్పటికే కొత్త ఓటర్ల నమోదు పూర్తి చేసిన ఎన్నికల సంఘం.. తాజాగా ముసాయిదా ఓటర్ల జాబితాను వెల్లడిరచింది. డిసెంబర్‌ నెలలో వాటిలో అభ్యంతరాల్ని డిసెంబర్‌ వరకూ స్వీకరించి అనంతరం వాటిని పరిష్కరించనుంది. ఆ తర్వాత జనవరి మొదటివారంలోనే తుది ఓటర్ల జాబితాను ప్రచురించబోతోంది.దీని ఆధారంగా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సిద్దమవుతోంది. ఇదే క్రమంలో వచ్చే ఏడాది మార్చిలో ఏపీ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉందని ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్‌ విూనా తాజాగా సంకేతం ఇచ్చారు. ఈ లెక్కన మార్చిలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వస్తే ఏప్రిల్‌ లోనే ఎన్నికలు ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కూడా కేవలం షెడ్యూల్‌ ప్రకటించిన నెల రోజుల్లోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో ఏపీలోనూ షెడ్యూల్‌ ప్రకటన తర్వాత నెల రోజుల వ్యవధిలోనే ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు ఈసీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *