విజయవాడ, నవంబర్‌ 27: చంద్రబాబు పొలిటికల్‌ యాక్షన్‌ లోకి దిగనున్నారా? పవన్‌ కళ్యాణ్‌ తో కలిసి సంచలనం సృష్టించనున్నారా? పొత్తు తర్వాత ఇరు పార్టీల అధినేతలు తొలిసారిగా బహిరంగ సభలో పాల్గొనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. చంద్రబాబు అరెస్టుతో దాదాపు మూడు నెలలు పాటు రాజకీయ కార్యకలాపాలకు దూరమయ్యారు. ఇటీవలే ఆయనకు రెగ్యులర్‌ బెయిల్‌ లభించింది. కానీ ఈ నెల 28 వరకు కోర్టు షరతులు ఉన్నాయి. అటు తర్వాత ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టాలని చంద్రబాబు చూస్తున్నారు. అయితే ఈ ఎంట్రీ గ్రాండ్‌ గా ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. సంచలన వేదిక కావాలని భావిస్తున్నట్లు సమాచారం.తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు ప్రకటించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్టు తర్వాత నేరుగా జైలుకెళ్ళి పరామర్శించి వచ్చిన తర్వాత పవన్‌ పొత్తు ప్రకటన చేశారు. తక్షణం ఉమ్మడి కార్యాచరణ ప్రారంభమవుతుందని ప్రకటించారు. రెండు పార్టీల మధ్య సమన్వయం, ఉమ్మడి మేనిఫెస్టో తదితర నిర్ణయాలతో దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు బెయిల్‌ పై బయటకు వచ్చిన తర్వాత పవన్‌ నేరుగా కలిశారు. కీలక చర్చలు జరిపారు.పలు అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. ఇప్పుడు రెగ్యులర్‌ బెయిల్‌ లభించడంతో పవన్‌ కళ్యాణ్‌ తో కలిసి చంద్రబాబు రాజకీయ వ్యూహాలకు సిద్ధపడుతున్నారు. డిసెంబర్‌ మొదటి వారంలో భువనేశ్వరి సంఫీుభావ యాత్రలు ప్రారంభం కానున్నాయి. అదే సమయంలో జనసేన ని పవన్‌ తో కలిసి భారీ బహిరంగ సభలకు చంద్రబాబు ప్లాన్‌ చేస్తున్నారు. దాదాపు ఓ మూడు సభలు నిర్వహించి.. ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. మేనిఫెస్టో పై విస్తృత ప్రచారానికి రెండు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. సూపర్‌ టెన్‌ పథకాలతో ప్రజల ముందుకు వెళ్లాలని డిసైడ్‌ అయ్యాయి. దాదాపు పది లక్షల మందితో బహిరంగ సభ నిర్వహించి సత్తా చాటాలని భావిస్తున్నాయి. ఇందుకు సంబంధించి యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించే పనిలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పవన్‌ సినిమాలో షూటింగులను పూర్తి చేసి పూర్తిస్థాయి రాజకీయాలపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.ఇప్పటికే తన అరెస్టుతో ప్రజల్లో ఒక రకమైన సానుభూతి కనిపిస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. టిడిపి శ్రేణులు సైతం ఇదే భావనతో ఉన్నాయి. దానిని రాజకీయంగా మలుచుకోవాలంటే.. పవన్‌ కళ్యాణ్‌ తో పాటు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తే ఉభయ తారకంగా ఉంటుందని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రెండు పార్టీల పొత్తు ప్రకటన తర్వాత ఇరువురు అధినేతలు భేటీకే పరిమితమయ్యారు. స్కిల్‌ కేసులో జగన్‌ ప్రభుత్వం తెలుగుదేశం అధినేత చంద్రబాబును అక్రమ అరెస్టు కారణంగా ఆయన మూడు నెలల నుండి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఆయనకు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు కావడంతో ఈ నెలాఖరు నుండి మళ్ళీ ప్రజల మధ్యకు రానున్నారు. మరోవైపు చంద్రబాబు అరెస్టుతో తాత్కాలికంగా ఆగిన యువగళం పాదయాత్రను నారా లోకేష్‌ మొదలు పెట్టనున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా ఈసారి ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరించనున్నారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కూడా ఒకవైపు వారాహీ యాత్ర చేపడుతూనే మరోవైపు చంద్రబాబుతో కలిసి బహిరంగ సభలలో వేదిక పంచుకోనున్నారు.మూడు నెలల తర్వాత మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టాలని భావిస్తున్న చంద్రబాబు.. ఈ ఎంట్రీ గ్రాండ్‌ గా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *