ఒంగోలు, నవంబర్‌ 27:రానున్న ఎన్నికలలో ఏపీలో అధికార పార్టీ వైసీపీ ఓటమి ఖరారైపోయిందని రాజకీయ వర్గాలు, సర్వేలూ బల్లగుద్ది మరీ చెబుతున్నాయి. వైసీపీ ఓటమి తథ్యమన్న విషయం ఏపీలో ప్రజలకే కాదు.. వైసీపీ నేతలకు, పెద్దలకు కూడా అర్దమైపోయింది. సర్వేల ఫలితాలు, వైసీపీ అంతర్గత సర్వేలు, రహస్యంగా తెప్పించుకున్న ఇంటెలిజెన్స్‌ సర్వే, ప్రజలలో కనిపిస్తున్న అసంతృప్తితో తన ఓటమిని నిర్ధారించుకున్న వైపీసీ పెద్దలు ఇప్పుడు మాయ చేసి, కుట్రలు పన్నైనా గెలవాలని చూస్తోంది. అందుకోసం అవకాశాలను వెతుక్కుంటోంది. ఏపీలో పెద్ద ఎత్తున దోంగ ఓట్ల నమోదు, అసలు ఓట్ల తొలగింపు అంశంలో పెద్ద ఎత్తున గోల్‌ మాల్‌ జరిగిందని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు. దొంగ నోట్ల నమోదు, అసలు ఓట్ల నమోదు వ్యవహారంలో ఎన్నికల కమిషన్‌ ఏపీలో ఇద్దరు అధికారులను సస్పెండ్‌ కూడా చేసింది. అదలా ఉండగా, ఏపీలో అధికార వైసీపీ మరో కుట్రకు తెరలేపింది. అదే ఎన్నికల విధులలో తమకు అనుకూలంగా ఉండే అధికారుల నియామకం.నిజానికి ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీచర్లే కీలక బాధ్యతలు నిర్వహిస్తారన్న సంగతి విదితమే. అయితే ఈసారి ఏపీలో టీచర్లను ఎన్నికల విధుల నుండి తప్పించాలని వైసీపీ సర్కార్‌ ప్లాన్‌ చేసింది. ఇందు కోసం ప్రత్యేకంగా ఓ జీవోను కూడా తీసుకొచ్చింది. 2022 నవంబరు 29న విద్యా హక్కు చట్టంలోని నిబంధనలకు సవరణలు చేసి.. టీచర్లకు బోధన, విద్యా సంబంధిత అంశాలు మినహా ఎలాంటి బోధనేతర పనులు అప్పగించకూడదని జీవో తెచ్చింది. అలాగే ఎన్నికల నిర్వహణలో పాలు పంచుకునే ఉద్యోగుల వివరాలను చెప్పాలని ఈసీ కోరగా.. వైసీపీ ప్రభుత్వం టీచర్ల మినహా.. ఇతర రంగాల ఉద్యోగులు, తాను నియమించుకున్న సచివాలయ ఉద్యోగులను కూడా ఎన్నికల ప్రక్రియలో పాలు పంచుకునేలా ప్రయత్నాలు చేసింది. దీంతో ఈసీ మరోసారి ప్రత్యేక ఉత్తర్వులను జారీచేసింది. ఉపాధ్యాయులను పీవోలుగా, ఏపీవోలుగా, ఇతర పోలింగ్‌ అధికారులుగా విధులు అప్పగించేందుకు జాబితా సిద్ధం చేయాలని ఆదేశించింది. ఈ మేరకు విద్యాశాఖాధికారులు ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ సర్కార్‌ టీచర్లను ఎన్నికల విధుల నుండి తప్పించేలా మరో కుట్రకి తెరతీసినట్లు కనిపిస్తున్నది. ఇందుకోసం ఏకంగా టీచర్లను బలి చేసేలా ఛార్జ్‌ మెమోలను జారీ చేస్తున్నది. ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వంద మందికిపైగా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో వంద మందికిపైగా ఈ మెమోలు అందజేసినట్లు తెలుస్తుండగా.. నేడో రేపో నెల్లూరు జిల్లాలో కూడా భారీ ఎత్తున టీచర్లకు ఛార్జ్‌ మెమోలు ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఉద్యోగ సంఘాలలో ఉంటూ ప్రభుత్వంపై నిరసన గళాన్ని వినిపిస్తున్న టీచర్లను ఏరి కోరి కుంటి సాకులతో వారికి ఛార్జ్‌ మెమోలు జారీచేస్తున్నట్లు తెలుస్తున్నది. లెసన్‌ ప్లాన్‌ సరిగా లేదని, బైజూస్‌ కంటెంట్‌ సరిగా అప్‌ లోడ్‌ చేయడం లేదని, నోట్‌ బుక్స్‌ సరిగా కరెక్షన్‌ చేయడం లేదని ఇలా వివిధ కారణాలను చూపుతూ మెమోలు జారీ చేస్తున్నారు. కనీసం షోకాజ్‌ నోటీలు కూడా ఇవ్వకుండానే ఏకంగా ఛార్జ్‌ మెమోలు జారీ చేస్తూ మేజర్‌ పనిస్మెంట్‌ ఉత్తర్వులు జారీ చేస్తున్నారని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్‌ మెమోలు జారీ అయితే వాళ్లపై నెగటివ్‌ మార్క్‌ పడుతుంది. అలాగే ఒక్కసారి ఛార్జ్‌ మెమో జారీ అయితే పోలింగ్‌ అధికారులుగా విధులు అప్పగించేందుకు సిద్దమవుతున్న జాబితాలో వారికి చోటు దక్కదు. ఇందు కోసమే ప్రభుత్వం ఇలా అడ్డదారిన మెమోలు జారీచేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.అయితే ఈ మెమోలకు వ్యతిరేకంగా నిరసనలకు ఉద్యమిస్తామని, ఎన్నికల విధులకు వెళ్లకుండా అసలు ఎలా ఆపుతారో చూస్తామంటూ ఉపాధ్యాయ సంఘాల నేతలు సవాల్‌ విసురుతున్నారు. ఈ వ్యవహారం ఎక్కడ వరకు వెళ్తుందో.. ఎలాంటి మలుపులు తిరుగుతుందో నన్న ఆసక్తి ఏపీ వ్యాప్తంగా వ్యక్తమౌతోంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *