తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో గవర్నర్ వర్సెస్ సీఎంగా పోరు జరుగుతోంది. ఇటీవల పంజాబ్ గవర్నర్ భన్వరీ లాల్ పురోహిత్ వ్యవహార శైలిపై, అక్కడి ఆప్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గవర్నర్ పురోహిత పలు కీలక బిల్లులకు ఆమోదం తెలపడం లేదని సీఎం భగవంత్ మాన్ సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్లు నిప్పుతో చెలగాలమాడుతున్నారని మండిపడిరది. ఈ కేసు విచారణ సందర్భంగా తమిళనాడు వ్యవహారం కూడా సుప్రీం ముందుకు వచ్చింది.అయితే అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసి వారం రోజుల తర్వాత తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి 10 బిల్లులను తిప్పిపంపడం మరోసారి వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో గవర్నర్ రవికి, సీఎం స్టాలిన్ అతని పార్టీ డీఎంకేకి పొసగడం లేదు. చాలా సందర్భాల్లో డీఎంకే పార్టీ కార్యకర్తలు గవర్నర్‌కి వ్యతిరేకంగా పలు ప్రాంతాల్లో పోస్టర్లను అంటించారు.గవర్నర్ రవి బిల్లులను వాపస్ చేసిన కొన్ని గంటకే తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ఎం. అప్పావు శనివారం ప్రత్యేక సమావేశానికి పిలుపునిచ్చారు. అయితే ఈ బిల్లులను మరోసారి గవర్నర్‌కి డీఎంకే ప్రభుత్వం తిప్పిపంపాలని భావిస్తున్నట్లు సమచారం. ఇది జరిగితే గవర్నర్ తప్పనిసరిగా సంతకం చేయాల్సి వస్తుంది. బీజేపీ నియమించిన గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే ఈ బిల్లల క్లియరెన్స్ లో జాప్యం చేస్తున్నాడని అధికార డీఎంకే పార్టీ ఆరోపిస్తోంది. ఇది ఎన్నికైన ప్రభుత్వాన్ని అణగదొక్కడం అని చెబుతోంది.బిల్లులను తిప్పి పంపండం ద్వారా ఉద్దేశపూర్వకంగానే ప్రజల అభిష్టాన్ని గవర్నర్ దెబ్బతీస్తాయని డీఎంకే ఆరోపిస్తోంది. యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్లను నియమించే గవర్నర్ అధికారాన్ని డీఎంకే ప్రశ్నిస్తోంది. గవర్నర్ రవి గతంలో నీట్ పరీక్ష మినహాయింపు బిల్లును వాపస్ చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఈ బిల్లును ఆమోదించిన తర్వాత మాత్రమే దానిని భారత రాష్ట్రపతికి పంపారు. ఆన్ లైన్ గేమింగ్ నిషేధం కోరుతూ వచ్చిన బిల్లుపై కూడా ఇదే వైఖరి అవలంభించారు.ప్రతిపక్ష పార్టీలకు చెందిన రాష్ట్ర ప్రభుత్వాలను తమ పాలనా విధులను నిర్వర్తించనీయకుండా అడ్డుపడుతున్న గవర్నర్ల తీరును రాజ్యాంగపరంగా ఎదుర్కొనేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసి రావడం బిజెపి పాలనలో భారత ఫెడరల్ వ్యవస్థకు పట్టిన దుర్గతిగా భావించవచ్చు. తమ రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులను ఏళ్లతరబడి ఆమోదించకుండా నిలిపివేసిన గవర్నర్ల వైఖరిపై పంజాబ్, కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు సుప్రీం కోర్టులో పిటిషిషన్లు దాఖలు చేశాయి. బిల్లులపై నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని గవర్నర్‌ను ఆదేశించలేమన్న కేరళ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ బుధవారం ఆ రాష్ట్ర ప్రభుత్వం మరో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేసింది.గవర్నర్ పరిశీలనకు పంపిన వాటిలో మూడు బిల్లులు ఇప్పటికే రెండేళ్లు పూర్తి కాగా మరో మూడు బిల్లులపై ఏడాదికి పైగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన 12 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ రవి ఆమోదం తెలపకుండా అడ్డుకున్నారు. పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ఏడు బిల్లుల్ని పెండిరగ్‌లో పెట్టారు.రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలి. ద్రవ్య బిల్లులు మినహా మిగతావాటిని నిలుపుదల (విత్‌హోల్డ్) చేయడం, లేదా రాష్ట్రపతికి పంపడం చేయవచ్చు. నిలుపుదల చేస్తే ఏవైనా సెక్షన్లను సవరించడం గురించి లేదా బిల్లు మొత్తాన్ని పున:పరిశీలించాలంటూ వీలైనంత త్వరగా శాసనసభకు పంపాలి. శాసన సభ అదే బిల్లును తిరిగి ఆమోదించి పంపితే గవర్నర్ తప్పక ఆమోదముద్ర వేయాలని ఈ ఆర్టికల్ స్పష్టంగా పేర్కొంది. అంటే ప్రజల చేత ఎన్నికైన శాసనసభ చేసిన బిల్లులను చట్ట రూపం దాల్చకుండా చేసే హక్కు, అధికారం గవర్నర్‌కు లేవని రాజ్యాంగం తేల్చి చెప్పింది. తెలంగాణ గవర్నర్‌పై ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు, ఆర్టికల్ 200ని ప్రస్తావించింది. ‘సాధ్యమైనంత త్వరగా’ అనేది రాజ్యాంగపరంగా చాలా ముఖ్యమైనదనీ, రాజ్యాంగబద్ధంగా ఉన్నవారు ఆ విషయాన్ని మరచిపోకూడదని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే. బిల్లులపై నిర్ణయం తీసుకోవడంలో గవర్నర్ ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయడం వల్ల శాసనసభకు, ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధంగా వ్యవహరించే గవర్నర్లకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 రక్షణకు అర్హత లేదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. పంజాబ్, కేరళ, తమిళనాడు ప్రభుత్వాల కేసు విచారణ సందర్భంగా గవర్నర్లు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు కారంటూ భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్య ఎంతో అర్ధవంతమైనది.. శాసన, పరిపాలన, న్యాయ వ్యవస్థల మధ్య అధికార పరిధులను రాజ్యాంగమే స్పష్టంగా నిర్దేశించింది. వాటి మధ్యగల లక్ష్మణ రేఖను ఉల్లంఘిస్తే సరి చేయవలసిన విద్యుక్త ధర్మం న్యాయ వ్యవస్థపైనే ఉంది. ఆ ధర్మాన్ని సర్వోన్నత న్యాయస్థానం నిర్వర్తిస్తుందని విశ్వసిద్దాం.