దోపిడీలు చేసేది జగన్‌..కేసులు చంద్రబాబుపైన
టీడీపీ నేతలకు పోలీసులు నోటీసులు అందజేత
కాకినాడ, నవంబర్‌ 3: రాష్ట్రంలో ఉన్న మద్యం, ఇసుక ఇతర పకృతి వనరులను సీఎం వైయస్‌ జగన్‌ యదేచ్చగా దోపిడీ చేస్తుండగా మాజీ సీఎం చంద్రబాబు మాత్రం తప్పుడు కేసులను ఎదురుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో ఉందని మాజీ హోంమంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. సీఎం జగన్‌ ప్రభుత్వం టీడీపీ నేతలను వేధింపులు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని వారిని పలు రకాలుగా ఇబ్బందులు గురిచేస్తున్నట్లు రాజప్ప చెప్పారు. 2021వ సంవత్సరం అక్టోబర్‌ 6వ తేదీన కాకినాడ సీ పోర్టులోకి అక్రమంగా ప్రవేశించి అక్కడ జరుగుతున్న ఎగుమతి దిగుమతులకు ఆటంకం కల్పించారనే ఫిర్యాదుపై టీడీపీ నేతలు నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నవీన్‌ కుమార్‌, వనమాడి వెంకటేశ్వరరావు, ఎస్వివిఎస్‌ఎన్‌ వర్మ, కొమ్మారెడ్డి పట్టాభిరాం, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, యనమల కృష్ణుడు, మోకా ఆనంద సాగర్‌, తుమ్మల రమేష్లపై పోర్ట్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు.
శుక్రవారం కాకినాడ పోర్టు పోలీస్‌ స్టేషన్లో పోలీసులతో 41ఎ నోటీసులు అందుకునే నిమిత్తం రాజప్పతో పాటు మాజీ ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి, జ్యోతుల నవీన్‌ కుమార్లతో పాటు టీడీపీ నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా 41ఎ నోటీసులు అందుకున్న అనంతరం పోర్టు పోలీస్‌ స్టేషన్‌ బయట విలేకరులతో నిమ్మకాయల చినరాజప్ప, వనమాడి వెంకటేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డిలు ప్రసంగించారు.
ఈ సందర్భంగా రాజప్ప మాట్లాడుతూ తాము టీడీపీ తరఫున కాకినాడ సీ పోర్టులో మాదకద్రవ్యాలకు సంబంధించి సరఫరా జరుగుతోందని ఆ పోర్టులోకి తనిఖీల నిమిత్తం వెళ్లేందుకు అనుమతి తీసుకున్నామన్నారు. అప్పుడు పెట్టని కేసులు తర్వాత తమపై బలవంతంగా నమోదు చేసినట్లు చెప్పారు. రెండేళ్ల పాటు కాలయాపన చేసి గత నెలలో నోటీసులు తీసుకోవాలంటూ పోలీసులు వేధింపులు గురి చేశారని రాజప్ప చెప్పారు. తామంతా చంద్రబాబు అక్రమ అరెస్టుకు సంబంధించి విషయంలో చాలా హడావుడిగా ఉన్నామని తామే వచ్చి నోటీసులు తీసుకుంటామని పోలీసులకు బదులు ఇచ్చామని అందువల్ల వాటిని తీసు తీసుకునేందుకు పోర్టు పోలీస్‌ స్టేషన్కు వచ్చినట్లు చెప్పారు. తనతో పాటుగా హాజరైన నాయకులు అందరిపై 10 నుంచి 35 పైగా అక్రమ కేసులు ఉన్నాయని న్యాయం కోసం వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సీఎం జగన్‌ తమ పార్టీకి చెందిన అధినేత చంద్రబాబుతో పాటుగా రాష్ట్రంలో ఉన్న టీడీపీ నాయకులపై కావాలనే పోలీసుల చేత అక్రమ కేసులు నమోదు చేయిస్తునట్లు చెప్పారు. త్వరలోనే జగన్‌ దుర్మార్గ పాలన నుండి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలుగుతుందన్నారు. తాము తీసుకున్న నోటీసులను న్యాయ పరంగా ఎదుర్కొంటామని రాజప్ప చెప్పారు. సీఎం జగన్‌ బెయిల్పై 10 ఏళ్ల నుండి ఉంటున్న విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లగా దాన్ని సుప్రీంకోర్టు వివరాలు ఏమిటంటూ అడగడాన్ని శుభపరిణాముగా రాజప్ప అభివర్ణించారు.
ఈ కార్యక్రమంలో పోర్టు పోలీస్‌ స్టేషన్‌ సిఐ విఎల్వీకే సుమంత్‌, వన్‌ టౌన్‌ సిఐ వి సురేష్‌ బాబు, పోర్ట్‌ ఎస్సైలు షేక్‌ జబ్బీర్‌, జీ రాజేశ్వరరావు టీడీపీ నాయకులు మల్లిపూడి వీరు, ఎండి తాజుద్దీన్‌, తుమ్మల సునీత, ఒమ్మి బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *