ఏపీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం
రాష్ట్రంలో కులగణనకు ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ ఆమోదం
కర్నూలులో నేషనల్‌ లా వర్సిటీకి మరో 100 ఎకరాల భూ కేటాయింపు
ఫెర్రో అల్లాయిస్‌ పరిశ్రమలకు విద్యుత్‌పై రాయితీ వచ్చేందుకు ఆమోదం
అమరావతి: సీఎం జగన్‌ అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ శాఖలు సమర్పించిన 38 ప్రతిపాదనలపై కేబినెట్‌ చర్చించింది. అనంతరం పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 6,790 ఉన్నత పాఠశాలల్లో నైపుణ్యాభివృద్ధి కోసం కేంద్రాల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. కర్నూలులో నేషనల్‌ లా వర్సిటీకి మరో 100 ఎకరాల భూ కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. పరిశ్రమలకు కొత్త భూ కేటాయింపు విధానం, కర్నూలు జిల్లాలో 800 మెగావాట్ల పవన విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

రాష్ట్రంలో కుల గణన, సామాజిక, ఆర్థిక అంశాల గణన చేపట్టేందుకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. పోలవరం నిర్వాసితుల ఇళ్ల పట్టాలు, స్థలాల రిజిస్ట్రేషన్‌కు స్టాంప్‌డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు, యూజర్‌ ఛార్జీల మినహాయింపునకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఫెర్రో అల్లాయిస్‌ పరిశ్రమలకు విద్యుత్‌పై రాయితీ వచ్చేందుకు ఆమోదం తెలిపింది. పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో పరిశ్రమల ఏర్పాటు నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. నంద్యాల, కడప జిల్లాల్లో ఎక్రెన్‌ ఎనర్జీకి 902 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు 5,400 ఎకరాల భూమి కేటాయింపునకు నిర్ణయం తీసుకుంది. పిడుగురాళ్ల మున్సిపాలిటీకి చెందిన ఎకరం భూమి తనఖాపై కేబినెట్‌లో చర్చ జరిగింది. మున్సిపాలిటీలో రూ.8కోట్ల రుణ సేకరణకు అనుమతించాలని కేబినెట్‌కు పురపాలక శాఖ ప్రతిపాదించింది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *