జిల్లాల పునర్విభజన వార్తలు పూర్తి నిరాధారం…
రాయచోటి అన్నమయ్య జిల్లాను రద్దు చేస్తున్నారన్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు..
వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి.
జిల్లాల పునర్విభజన మళ్లీ జరుగుతుందన్న వార్తలు సామాజిక మాధ్యమాలలో చేస్తున్న ప్రచారం పూర్తి నిరాధారణమైనవని, వాటిని ఎవరు నమ్మవద్దని వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు,ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. కొంతమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగానూ, ప్రాంతాలకు వ్యతిరేకంగానూ మాధ్యమాలు, పత్రికలు సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. జిల్లాల పునర్విభజన ప్రచారంలో ఒక్క శాతం కూడా నిజం కాదన్నారు. రాయచోటిలో జిల్లా కేంద్రం వుండకూడదని కొంతమంది దురుధ్యేశ్యంతో విష ప్రచారం చేస్తున్నారన్నారు. ఊపిరి ఉన్నంత వరకు రాయచోటి జిల్లా కేంద్రంగానే ఉంటుందని, రాయచోటి నుంచి ఒక్క అడుగు కూడా దాటిపోకుండా చేస్తామన్నారు. ఈ రోజు(శుక్రవారం) జరిగే క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై కనీసం చర్చ కానీ, అజెండా కానీ లేదన్నారు. కేవలం ఊహాజనితంగా రాసిన వార్తలుగా అవి ఉన్నాయన్నారు. వంద, రెండు వందల సంవత్సరాలకు రాని జిల్లా కేంద్ర అవకాశాన్ని సీఎం జగన్ మనకు కల్పించారన్నారు. ప్రజల దీవెనలు, ముఖ్యమంత్రి ఆశీస్సులతో రాయచోటి జిల్లా కేంద్రం యధావిధిగా కొనసాగుతుందని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చెప్పారు.