విజయనగరం, నవంబర్‌ 1,:పాడేరు ఐటిడిఎలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నట్లు తెలిసింది. నిబంధనలను గాలికొదిలేసి అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనలు బేఖాతరు చేయడం, ఇ ప్రొక్యూర్‌మెంటుకు బదులుగా సాధారణ టెండర్లు పిలవడం, సమయాన్ని భారీగా కుదించడంద్వారా అస్మదీయులకే అవకాశం ఇవ్వడం వంటి చర్యల ద్వారా కోట్లాది రూపాయల అక్రమాలు జరిగినట్లు తెలిసింది. 84.76 కోట్ల రూపాయలతో చేపట్టిన పసుపు ప్రాజెక్టులో చోటుచేసుకున్న అక్రమాలను ఆంధ్రప్రదేశ్‌ షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ కోపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ట్రైకార్‌) కూడా నిర్ధారించినట్లు తెలిసింది.అక్రమాలపై విచారణ నిర్వహించిన ట్రైకార్‌ బృందం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి నెలలు గడుస్తున్నా నామమాత్రపు చర్యలు కూడా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
పసుపు ప్రాజెక్టులో బకాయిల కోసం ఒక కాంట్రాక్టర్‌ హైకోర్టును ఆశ్రయించడంతో అక్రమాల డొంక కదిలింది. హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ఆర్థిక శాఖ ఆ కాంట్రాక్టర్‌కు 4.19 కోట్ల రూపాయలు చెల్లించింది. ఈ నేపథ్యంలో అసలు ప్రాజెక్టులో ఏం జరుగుతోందో పరిశీలించాలని ట్రైకార్‌ను ఆదేశించింది. ప్రాధమిక పరిశీలనలో అవకతవకలు చోటుచేసుకున్నట్లు ట్రైకార్‌ పేర్కొంది. ఆర్థికశాఖ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయికి వెళ్లి ట్రైకార్‌ బృందం చేసిన పరిశీలనలో అవకతవకలు వాస్తవమ ని నిర్ధారణ అయినట్లు తెలిసింది. అక్రమాలు ఎలా జరిగియి? వాటికి బాధ్యులెవరు అన్న అంశాలను వివరిస్తూ ట్రైకార్‌ అధికారులు మార్చి నెలలోనే సుదీర్ఘ నివేదికను ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిసింది.ప్రభుత్వ నిబంధనల ప్రకారం లక్ష రూపాయలు దాటిన ప్రతి పనిని ఇ `ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారానే చేయాలి. ఐటిడిఎ అధికారులు ఈ నిబంధనను ఏమాత్రం ఖాతరు చేయలేదు. 4.19 కోట్లరూపాయల విలువైన సీడ్‌ కొనుగోలు ప్రక్రియను ఇ` ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా కాకుండా బాక్స్‌ టెండర్ల ద్వారా నిర్వహించినట్లు ట్రైకార్‌ పరిశీలనలో తేలింది. పాడేరు ఐటిడిఎలో ఇ`ప్రొక్యూర్‌మెంట్‌ విధానం లేదంటూ తాము చేసిన పనిని సమర్ధించుకోవడానికి అధికారులు ప్రయత్నించారని, అయితే అది సరికాదని ట్రైకార్‌ పేర్కొన్నట్లు సమాచారం. మరికొన్ని ఇతర అంశాల్లో ఇ`ప్రొక్యూర్‌మెంట్‌ విధానాన్ని అమలు చేసిన విషయాన్ని కూడా ప్రస్తావించినట్లు తెలిసింది. దీనికి సంబంధించి పాడేరు, ఐటిడిఎకు సంబంధించి ఆరుగురు అధికారులను బాధ్యులుగా గుర్తించినట్లు తెలిసింది. 25 మినీ బాయిలర్లు, 25 మినీ పాలీషర్లు కొనుగోళ్లకు సంబంధించి ఇ`ప్రొక్యూర్‌మెంట్‌ విధానంలో నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో గడువును కుదించారు. నిబంధనల ప్రకారం కనీసం 14 రోజులు గడువు ఇవ్వాల్సి ఉండగా, కేవలం వారం రోజులు మాత్రమే ఇచ్చారు. పోటీని తగ్గించడానికే ఈ పనిచేశారని ట్రైకార్‌ నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ చర్య ద్వారా తమకు కావాల్సిన వారికే టెండర్‌ దక్కేలా చూశారన్న ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం 5శాతం ఎక్సెస్‌కే అనుమతి ఇవ్వాల్సిఉండగా, 21.3శాతం అదనపు రేటును ఖరారు చేసినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన అగ్రిమెంటు బాండ్‌ అందుబాటులో లేదని సమాచారం. ఇ` ప్రొక్యూర్‌మెంట్‌లో ఖరారుచేసిన ధరలను ప్రామాణికంగా తీసుకుని మార్కెఫెడ్‌ నుంచి 1705 బాయిలర్లు, 840 పాలిషర్ల కొనుగోళ్లకు సిద్దపడ్డారు. ఒక్కో బాయిలర్‌ను రూ.64,990, పాలిషర్‌ను రూ.74,499 చొప్పున కొనుగోలు చేయడానికి ప్రతిపాదించారు. 2020లో సీతంపేట ఐటిడిఎ అధికారులు ఒక్కో బాయిలర్‌ను రూ.29,500, పాలిషర్‌ను రూ.32,500కు కొనుగోలు చేశారు. ఇదే విషయాన్ని ట్రైకార్‌ అధికారులు నివేదికలో ప్రస్తావించినట్లు తెలిసింది. ఈ కొనుగోళ్ల ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడంతో తక్షణమే రద్దు చేసుకోవాలని ట్రైకార్‌ సూచించినట్లు తెలిసింది. దీనివల్ల రూ.7 కోట్ల నుంచి రూ.9 కోట్ల మేర పాడేరు ఐటిడిఎకు మిగిలే అవకాశం ఉందని పేర్కొన్నట్లు తెలిసింది. ఈ సూచనపై కూడా అధికార యంత్రాంగం ఇంతవరకు స్పందించలేదు.గిరిజనులకు జీవనోపాధి కల్పించేందుకు స్పెషల్‌ సెంట్రల్‌ అసిస్టెన్స్‌ టు ట్రైబల్‌ సబ్‌ స్కీమ్‌ కింద పాడేరు ప్రాంతంలో 2019`20లో పసుపు ప్రాజెక్టును పాడేరు ఐటిడిఎ చేపట్టింది. ఐదు వేల మంది గిరిజన రైతులతో ఐదు వేల ఎకరాల్లో సాగు చేయాలనే లక్ష్యంతో దీనికి శ్రీకారం చుట్టారు. మూడేళ్ల పాటు అమలు చేసే ఈ ప్రాజెక్టుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.84.76 కోట్లు ఖర్చు చేస్తాయి. సీడ్‌ కొనుగోలుతోపాటు డ్రిప్‌ ఇరిగేషన్‌, ఆయిల్‌ ఇంజన్లు, మినీ బాయిలర్స్‌, మినీ పోలీషర్స్‌, ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌, ప్రాజెక్టు మేనేజ్‌ తదితర కాంపోనెంట్స్‌ అందజేయాలని నిర్ణయించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *