విజయవాడ, అక్టోబరు 25: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు అటూ ఇటూగా ఆర్నెళ్లు టైం ఉంది. ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టడానికి ఏ రాజకీయ పార్టీకైనా ఇదే సరైన సమయం. అధికార పక్షం సంగతేమో కానీ ప్రతిపక్షాలు మాత్రం ఇంకా కన్ఫ్యూజన్‌లోనే ఉన్నాయి. చివరి నిముషంలో తిమ్మిని బమ్మిని చేయగల చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారు. ఆయన ఎప్పుడు బయటకు వస్తారో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. వారసుడు లోకేష్ ఎక్కువ కాలం ఢల్లీి లోనే ఉంటున్నారు. చంద్రబాబు సతీమణి రంగంలోకి దిగినా జనం నుంచి అనుకున్నంత సింపతీ రావడం లేదు. రాబోయే ఎన్నికల కంటే చంద్రబాబును జైల్లో ఉండటమే తెదేపాను ఎక్కువ భయపెడుతోంది. ఆ పార్టీ పార్టీ పుణ్యకాలమంతా కోర్టుల చుట్టూ తిరగడంలోనే గడిచిపోతోంది. అధినేత ఊచలు లెక్కపెడుతుండటంతో పార్టీకి దిశా నిర్దేశం కరవైంది. లైట్లు ఆర్పేసి, సంకెళ్లు వేసుకుని, విజిల్స్ వేసి… బాగా పబ్లిసిటీ చేస్తున్నా… పార్టీకి అనుకున్నంత మైలేజీ రావడం లేదు. తెలుగుదేశంలో పొత్తు పెట్టుకుంటున్నామని జనసేన అధినేత బాహాటంగా ప్రకటించి చాలా కాలమైనా, ఇంకా తేలాల్సిన లెక్కలు చాలానే ఉన్నాయి.. పవన్ కళ్యాణ్ యాభై సీట్లు కోరుకుంటున్నారు. తెలుగుదేశం 25 దగ్గర ఆపేయొచ్చు. పవన్ తనకు బలం కావాలి అనుకుంటోంది సైకిల్ పార్టీ. అంతే తప్ప తన బలాన్ని జనసేనకు పంచాలని అనుకోవడం లేదు. పొత్తులో సీట్లు కోల్పోయే రెండు పార్టీల్లోని నాయకుల అసంతృప్తి సెగలు… ఉభయ పార్టీల విజయావకాశాల విూద ప్రభావం చూపిస్తాయి. జనసేనతో పొత్తుకు సై అన్న బీజేపీ తెలంగాణ ఎన్నికల వరకూ వేచి చూస్తుంది. ఆ ఫలితాల విూద కమలం ‘ఆంధ్ర’ రాజకీయం ఆధారపడి ఉంటుంది. జనసేన, తెలుగుదేశం ఉమ్మడి కార్యాచరణ, మ్యానిఫెస్టో లాంటి అంశాల గురించి ఇప్పటి వరకూ ఎలాంటి ముందడుగూ లేదు. రాజమండ్రిలో సోమవారం జరిగిన సంయుక్త సమావేశంలో తేలిందేవిూ లేదు. మరోవైపు వై నాట్ 175 అంటూ వైకాపా కార్యాచరణను సిద్ధం చేసుకుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులతో ఈ నెల 25 నుంచి బస్సు యాత్రను ప్రారంభిస్తోంది. గత ఎన్నికల్లో తాము ఇచ్చిన హావిూల్లో తొంభై తొమ్యిది శాతం అమలు చేశామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులంతా వైకాపాతోనే ఉంటారని ఆయనే కాకుండా, పార్టీ నేతలంతా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. వైకాపా నేతలు గెలుపు గురించి ఆలోచించడం మానేసి, రాబోయే మెజార్టీ విూదే లెక్కలు వేసుకుంటున్నారు. అంత స్థాయిలో ఉంది వాళ్ల ఆత్మవిశ్వాసం. ఐదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికలను కాన్ఫిడెంట్‌గా ఎదుర్కొంటుంటే.. ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాల విషయంలో ఇంకా కన్ఫ్యూజన్‌లోనే ఉన్నాయి. ఇదీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ వైచిత్రి. ఎవర్ని నిలబెట్టాలి, ఎవర్ని పడగొట్టాలి అనే విషయంలో మాత్రం ఓటర్ మాత్రం చాలా క్లారిటీగానే ఉన్నాడు. ఆర్నెళ్లు ఆగితే ఆ విషయంలో మనకూ క్లారిటీ వస్తుంది