విజయవాడ, అక్టోబరు 25: వైసీపీలో తీవ్ర నైరాశ్యం అలుముకుంది. భవిష్యత్తు బెంగ పట్టుకుంది. రేపు ఏమవుతుందోనన్న భయం వెంటాడుతోంది. గత నాలుగున్నర ఏళ్లుగా వ్యవహరించిన తీరు.. ఆర్థిక ఇబ్బందులు వెరసి సగటు వైసీపీ అభిమాని తెగ భయపడుతున్నాడు.తమ అధినేత తమను పావులుగా చేసి ఏ విధంగా ఆడుకున్నది కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుండడంతో.. ఏం చేయాలో వారికి పాలు పోవడం లేదు.
మాచర్లలో వైసీపీ కార్యకర్త ఒకరు రోడ్డు విూదే తన బైకును తగులు పెట్టాడు. వైసీపీ నేతలు తనతో చేయించుకున్న పనులను చెప్పి కన్నీరు మున్నీరయ్యాడు. ఆర్థికంగా నష్టపోయిన తీరు, అటు ప్రత్యర్థులకు టార్గెట్‌ అవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. అయితే ఇది ఒక మాచర్ల యువకుడిదే కాదు. రాష్ట్రవ్యాప్తంగా వైసిపి కార్యకర్తలది ఇదే పరిస్థితి. పార్టీ ఆవిర్భావం నుంచి అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని.. గట్టిగానే కృషి చేస్తే పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక తమకు తిరుగు లేదని భావించిన వారు రెచ్చిపోయారు. ప్రజలతో పాటు ప్రత్యర్థులపై సైతం విరుచుకుపడ్డారు. కానీ దాని ద్వారా వారికి ప్రత్యేకంగా వచ్చే ప్రయోజనం ఏదీ లేకుండా పోయింది.అధినేత జగన్‌ రాజకీయాన్ని ఓ వ్యాపార కోణంలో చూశారు. ఆ వ్యాపారంలో పార్టీ శ్రేణులు పావులుగా మారారు. పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోసిన పార్టీ కార్యకర్తను సైడ్‌ చేశారు. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థను అడ్డం పెట్టుకుని.. నేరుగా తానే రాజకీయ లబ్ధి పొందాలని జగన్‌ చూశారు. ఇది తెలియని పార్టీ శ్రేణులు ఇష్టారాజ్యంగా వ్యవహరించాయి. పోనీ ఆర్థికంగా బలోపేతం అయ్యారంటే అదీ లేదు. ఏవేవో ఊహించుకొని భ్రమపడ్డారు. కనీసం తాము నిర్మించిన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు వంటి నిర్మాణాలకు సైతం బిల్లులు చెల్లించలేదు. ఇటు గోడ దెబ్బ, అటు చెంప దెబ్బ అన్నట్టు పరిస్థితి మారింది.అయితే ఇది మంత్రులు, ఎమ్మెల్యేల స్థాయి వరకు వచ్చింది. ప్రభుత్వంలో ఉన్న ఆ నలుగురు తప్ప.. మిగతావారు లబ్ధి పొందింది అంతంత మాత్రమే. ల్యాండ్‌, శాండ్‌, వైన్‌.. ఇలా అన్నింటా పెత్తనం కొద్దిమందికే దక్కింది. దీనికి తోడు రాష్ట్రంలో ప్రతీకార రాజకీయాలు.. మంత్రులను కంటివిూద కునుకు లేకుండా చేస్తున్నాయి. చంద్రబాబు నుంచి కిందిస్థాయి నేతల వరకు కేసుల నమోదు చూస్తున్న వైసీపీ మంత్రులు, కీలక నేతలు.. రేపు అధికారం మారితే పరిస్థితి ఏ స్థాయిలో ఉంటుందోనని భయపడుతున్నారు. సీఎం జగన్‌ తన ప్రతీకార రాజకీయాల కోసం తమను బలి పశువు చేశారన్న కామెంట్‌ వైసీపీలో బలంగా వినిపిస్తోంది. ప్రజలు అంతులేని మెజారిటీ ఇస్తే.. ఇప్పుడు ఈ పరిస్థితికి ముమ్మాటికీ సీఎం జగనే కారణమని మెజారిటీ వైసిపి నేతల అభిప్రాయం. ఇక దిగువ స్థాయి నేతల గురించి చెప్పనక్కర్లేదు. ఎటువంటి ఆర్థిక స్వాంతన దక్కకపోవడం, ప్రత్యర్థులకు టార్గెట్‌ అయ్యే అవకాశం ఉండడంతో వారు తెగ భయపడిపోతున్నారు. అధినేత తీరుతోనే.. తమకు ఈ పరిస్థితి వచ్చిందని ఆవేదన చెందుతున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *