తిరుపతి: నగరంలో సీజనల్ వ్యాధులు, విష జ్వరాలు ప్రబలకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఇంజినీరింగ్, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. నగరంలో సీజనల్ వ్యాధులు, విష జ్వరాలు ప్రబలకుండా చేపడుతున్న చర్యలపై ఇంజినీరింగ్, ఆరోగ్య శాఖ, మలేరియా విభాగం అధికారులు, సిబ్బందితో మంగళవారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో కమిషనర్ సవిూక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు నగరంలోని 50 వార్డుల్లో సిబ్బందికి పాగింగ్ యంత్రాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. అందరూ ప్రతి రోజూ ఆయా వార్డుల్లో పాగింగ్ చేయాలన్నారు. అలాగే నగరంలో ఎక్కడా డ్రైనేజీ కాలువలు చెత్త లేకుండా, మురుగునీరు నిలవకుండా శుభ్రం చేయాలన్నారు. సీజనల్ వ్యాధులు, డెంగ్యూ , మలేరియా, చికెన్ గున్యా వంటి విష జ్వరాలు ప్రబలకుండా అన్ని చర్యలు చేపట్టామని, మరింత పటిష్టంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఒక ప్రణాళిక రూపొందించి అన్ని వార్డుల్లో మాలాతిన్, అబెట్, పైరేతిన్ వంటివి పాగింగ్, స్ప్రేయింగ్ చేయాలన్నారు. నీళ్ళు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేయాలని తద్వారా దోమల లార్వా పునరుత్పత్తి కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇండ్లలో కూడా దోమలు ఉత్పత్తి కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా యంత్రాలు రిపేర్ అయితే వెంటనే మరమ్మతులు చేపించుకోవాలని అన్నారు. అన్ని వార్డుల్లో జరుగుతున్న పనులను ఆరోగ్య శాఖ , ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షణ చేసి రోగాల నివారణకు, పరిశుభ్రతకు అన్ని చర్యలు మరింత పటిష్టంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళిశ్వర్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, మునిసిపల్ ఇంజినీర్లు చంద్రశేఖర్, వెంకట్రామి రెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్వేష్ రెడ్డి, మలేరియా ఆఫీసర్ రూపకుమార్, శానిటరీ సూపర్ వైజర్లు చెంచయ్య, సుమతి, డి.ఈ.లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఆరోగ్య శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.