విజయవాడ, ఆగస్టు 30: సమస్య ఏదైనా తాము పరిష్కారం చూపుతామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదేపదే చెబుతోంది. గత జూన్‌లో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు క్షేత్ర స్థాయిలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టారు.పౌర ఫిర్యాదుల్ని స్వీకరించడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు అధికారంలోకి రాగానే ప్రకటించారు. ఈ క్రమంలో ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించడానికి ముఖ్యమంత్రే స్వయంగా ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో, ఉండవల్లి నివాసం వద్ద పలు సందర్భాల్లో సీఎం చంద్రబాబు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైతం వాడుతున్నామని కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఐఏఎస్‌లు ముఖ్యమంత్రిని మభ్య పెట్టారు. క్షేత్ర స్థాయిలో మాత్రం కనీసం ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసే అవకాశం కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేకపోయారు.ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం నివాసంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించే బాధ్యతను మంత్రి నారా లోకేష్ తీసుకున్నారు. ఈ క్రమంలో వాట్సప్‌లో వచ్చిన అభ్యర్థనలకు కూడా లోకేష్ మొదట్లో స్పందించారు. ఓ దశలో ఆయన ఫోన్ స్తంభించేలా ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో వాట్సప్ ఫిర్యాదులు పంపొద్దని ప్రత్యేకంగా అభ్యర్థించాల్సి వచ్చింది.మొదట్లో మంగళగిరి నియోజక వర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం లోకేష్ నిర్వహించిన కార్యక్రమానికి క్రమేణా ఆదరణ పెరిగి రాష్ట్రం నలుమూలల నుంచి జనం తమ బాధలు చెప్పుకోడానికి ఉండవల్లి రావడం మొదలైంది. సమస్య ఏదైనా లోకేష్‌కు చెప్పుకుంటే పరిష్కారం లభిస్తుందని ప్రచారం జరిగింది. దీంతో అన్ని ప్రాంతాల ప్రజలు ఉండవల్లి రావడం మొదలైంది. దీంతో నిత్యం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు పార్టీ కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరించే ఏర్పాటు చేశారు.ఇదే పద్ధతిని జనసేన, బీజేపీలు కూడా అమలు చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ప్రకారం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ప్రారంభించారు. జన్మభూమి కార్యక్రమాలతో పాటు పాలనలో సంస్కరణల్లో భాగంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కోసం అధికారులు నిర్ణీత సమయంలో ఫిర్యాదులు స్వీకరించి, నిర్ణీత వ్యవధిలో పరిష్కరించేలా సిటిజన్ చార్టర్లను అమలు చేశారు.2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంస్కరణల్ని మరింత పక్కాగా అమలు చేశారు. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆన్‌లైన్‌లో ఫిర్యాదుల్ని స్వీకరించపరిష్కరించే యంత్రాంగాలు ఏర్పాటు చేశారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1902 టోల్ ఫ్రీ ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే ఏర్పాటు చేశారు. వీటి పని తీరు అంతంత మాత్రంగానే ఉండేది. కాల్ సెంటర్ల నిర్వహణ, ప్రభుత్వ విభాగాల స్పందన నాసిరకంగాఉండేది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత 1902 కాల్ సెంటర్ రద్దు చేశారు.కొత్త ఏజెన్సీతో సేవలు ప్రారంభించాలని నిర్ణయించినా అదింకా కార్యరూపం దాల్చలేదు. సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చినా అది పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసే అవకాశం లేకపోవడంతో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు రకరకాల సమస్యలతో ప్రజలు ఉండవల్లి వరకు రావాల్సి వస్తోంది.