వినాయకుడి వాహనం. అయితేనేం.. ఇంట్లో అది చేసే అల్లరికి దాన్ని చూస్తేనే.. అంతెత్తున లేస్తారు. తిట్ల దండకం మొదలుపెడతారు. ఇక పిల్లి దాన్ని చూసిందంటే చాలు.. దాని అంతుచూసే దాకా వదలదు. మనుషులను ముప్పుతిప్పలు పెడుతున్నా.. ‘మూషిక’ మహారాజులను ప్రేమించే వారు , పూజించే వాళ్లు ఉన్నారు. ఇంతకీ ఏంటీ ఎలుక గోల అంటారా? ఈ రోజు ప్రపంచ ఎలుకల దినోత్సవం…
ప్రపంచంలో ప్రతిరోజు ఏదో ఓ మూల.. ఓ దినోత్సవం జరుగుతూనే ఉంటుంది. కానీ అందులో కొన్ని మాత్రమే ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకుంటాయి. ఈ ‘వరల్డ్ ర్యాట్ డే’ ఇప్పుడిప్పుడే ఆదరణ పొందుతోంది.
జంతుప్రేమికులతో పాటు, ఎలుకలను అల్లారుముద్దుగా పెంచుకునే వాళ్లు ర్యాట్ డే (ఏప్రిల్ 4)ను ఆనందంగా జరుపుకుంటున్నారు. ఎలుకల్లో అందంగా కనిపించే పప్పీ ర్యాట్స్కు ఎంతోమంది అభిమానులున్నారు. మనదేశంలో కాదు కానీ విదేశాల్లో వాటిని పెట్స్గా పెంచుకునే వాళ్ల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది.
మూషిక పూజలు
రాజస్థాన్లోని దెష్నాక్లో ఉన్న కర్ణీమాత ఆలయంలో ఎలుకలను ప్రత్యేకంగా పూజిస్తారు. వాటికి ఇక్కడ మొక్కులు తీర్చడం విశేషం. ఈ గుడిలో ఎటు చూసినా వేలాది ఎలుకలు కనిపిస్తాయి. ఈ గుడికి వచ్చే భక్తులు వాటిని అమ్మవారి పిల్లలుగా భావించి ఎంతో భక్తితో పూజిస్తారు.
ర్యాట్ డే ఇలా చేసుకుంటారు:
ర్యాట్ లవర్స్.. తమ తమ పెంపుడు ఎలుకలను అందంగా ముస్తాబు చేస్తారు. వాటిని ఉంచే బోనులను కూడా అలంకరిస్తారు. ఎలుకలకు ఇష్టమైన ఆహారాన్ని ప్రిపేర్ చేస్తారు. ఇక ఎలుక ప్రేమికులంతా ఓ చోట కలుస్తారు. తమ ఎలుకలు చేసే అల్లరి గురించి ముచ్చటించుకుంటారు. కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. సోషల్ వెబ్సైట్లో ర్యాట్ డే సెలబ్రేషన్స్ ఫొటోలను, అనుభూతులను తమ మిత్రులతో పంచుకుంటారు.
పద ప్రయోగం:.ఎలుక తోక తెచ్చి ఎన్నినాళ్లు ఉతికినా.. నలుపు నలుపే కానీ.. తెలుపు కాదు. సామెతలు: పిల్లికి ఎలుక సాక్ష్యమట
పిల్లి గుడ్డిదైతే.. ఎలుక ఎక్కిరించిదట.
రక్షక ర్యాట్స్: వినాయకుడే కాదు.. తన వాహనమైన ఎలుక కూడా కాంబోడియా ప్రజల విఘ్నాలను తొలగిస్తుంది. కాంబోడియా నుంచి టాంజానియా వరకు అనేక చోట్ల మందుపాతర్లు ఉన్నాయి. కంబోడియన్ మైన్ యాక్షన్ సెంటర్ మందుపాతర్లను కనిపెట్టే పనిని మూషిక రాజుకు అప్పగించింది. ఈ రాక్షస ఎలుకలు(గెయింట్ ర్యాట్స్) వాసన చూసి మందుపాతర్లను కనిపెట్టడంలో దిట్ట. వీటికి తెలివి కూడా ఎక్కువే..
టాంజానియాలోని అపొపొ అనే ఒక ఎన్జీవో సంస్థ వీటికి ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. శిక్షణ తీసుకున్న ఎలుకల్ని మందుపాతర్లు ఉన్న ప్రదేశంలో విడిచి పెడతారు. ఆర్మర్ ధరించిన బాంబ్ స్క్వాడ్ దళాలు ఎలుకలకు పెద్ద తాడును బిగించి, వాటిని పట్టుకుని మందుపాతర్లను కనిపెట్టడానికి రంగంలోకి దిగుతాయి. ఎలుకలు మందుపాతరలు ఉన్న ప్రదేశాన్ని కనిపెట్టగానే కంబోడియన్ మైన్ యాక్షన్ సెంటర్ రంగంలోకి దిగి వాటిని నాశనం చేస్తుంది.