మొరార్జీ దేశాయి భారత స్వాతంత్య్ర సమర యోధునిగా, జనతా పార్టీ నాయకునిగా, భారత మాజీ ప్రధానిగా సేవలు అందించాడు. మొరార్జీ దేశాయ్ బొంబాయి రాజ్యంలో (ప్రస్తుతం గుజరాత్) బ్లస్టర్ జిల్లాకు చెందిన భడేలీ గ్రామంలో 1896 ఫిబ్రవరి 29 న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.అతని తండ్రి ఉపాధ్యాయుడు. అతను1977 మార్చి 24 నుండి 1979 జూలై 26 వరకు భారత దేశానికి 4వ ప్రధానిగా తన సేవలనందించాడు. అతను దేశంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పరచాడు. అతను భారతదేశం, పాకిస్తాన్ దేశాల అత్యున్నత పౌర పురస్కారాలైన భారత రత్న, నిషానే పాకిస్తాన్ లను పొందిన ఏకైక భారతీయుడు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ప్రభుత్వంలో అనేక కీలక పదవులను చేపట్టాడు. వాటిలో: బొంబాయి రాష్ట్ర ముఖ్యమంత్రి, భారత హోం మంత్రి, ఆర్థిక మంత్రి పదవులతొ పాటు భారతదేశ 2వ ఉపప్రధాని పదవిని కూడా చేపట్టాడు. అంతర్జాతీయంగా దేశాయ్ తన శాంతి ఉద్యమం ద్వారా కీర్తి సంపాదించాడు. అతను దక్షిణ ఆసియాలో ప్రత్యర్థి దేశాలైన పాకిస్తాన్, భారతదేశం మధ్య శాంతిని ప్రారంభించడానికి అనేక ప్రయత్నాలు చేసాడు. 1974 మే 18న రాజస్థాన్లోని పోఖ్రాన్ లో జరిగిన మొదటి అణుపరీక్ష తరువాత అతను చైనా, పాకిస్తాన్ లతో స్నేహపూర్వక సంబంధాలను పునరుద్ధరించడానికి సహాయం చేసాడు. 1971లో జరిగిన భారత్`పాకిస్తాన్ ల మధ్య జరిగిన యుద్ధం వంటి అంశాలలో సాయుధ పోరాటం నివారించడానికి కృషి చేసాడు. మరోవైపు భారతదేశపు నిఘావ్యవస్థ (రా)ను దెబ్బతీసి పాకిస్తాన్లో భారత నిఘా లేకుండా చేసిన వ్యక్తిగా అతనిపై పలు విమర్శలు ఉన్నాయి.మొరార్జీ దేశాయ్ జనతాపార్టీకి 1980 సార్వత్రిక ఎన్నికలలో సీనియర్ రాజకీయ నాయకుడిగా ప్రచారం చేశాడు, కాని ఎన్నికలో పోటీ చేయలేదు. పదవీ విరమణ తరువాత అతను ముంబైలో నివసించి తన 99వ యేట 1995 ఏప్రిల్ 10 న మరణించాడు. అత్యధిక కాలం జీవించిన భారత ప్రధానిగా గుర్తింపు పొందాడు.