హైదరాబాద్ అక్టోబర్ 28: తెలుగు రాష్ట్రాలలో చలి పంజా విసురుతుంది . గత కొద్ది రోజులుగా పగలు, రాత్రిపూట ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోతున్నాయి . హైదరాబాదులోనూ సాధారణం కంటే తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే నెలలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉండటంతో.., చలి ముప్పును తప్పించుకోవడానికి ముందు జాగ్రత్తలు అవసరమని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ లిల్లీ మేరి అన్నారు. తేమ ఎక్కువగా ఉండే వాతావరణంలో బ్యాక్టీరియా, వైరస్లు స్వేర విహారం చేస్తాయని, శరీరంలోని అనేక అవయవాలపై దుష్ప్రభావాన్ని చూపిస్తాయని, చలి తీవ్రత పెరిగినప్పుడు శ్వాసనాళాలు కుచించు పోతాయని, గాలి పీల్చుకోవడం కష్టమవుతుందని లిల్లీ మేరి తెలిపారు.ముఖ్యంగా జలుబు, గొంతు నొప్పి, సైనసైటిస్, నిమోనియా, ఆస్తమా, సిఓపిడి తదితర శ్వాసకోశ వ్యాధులు తీవ్రమవుతాయని, సాధారణంగా కనిపించే ఫ్లూ జ్వరాలు కూడా ఈ వాతావరణంలో విజృంభిస్తాయని, రాష్ట్రంలో ఇప్పటికే శ్వాస సమస్యలతో హాస్పిటల్ కి వెళ్ళే వారి సంఖ్య పెరిగిందని, చలికాలంలో వాతావరణంలో తేమ తగ్గిపోతుందని లిల్లీ మేరి అన్నారు. ఫలితంగా శరీరం నుంచి నీరు ఆవిరవుతుందని, ఒంట్లో నీటి శాతం తగ్గడంతో చర్మం పొడిబారి పోతుందని, కాళ్లలో పగుళ్లు బట్టి దురదలొస్తాయని, ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ లిల్లీ మేరి తెలిపారు.
మధుమేహుల్లో ఇన్ఫెక్షన్ ఎక్కువ:
చలి తీవ్రతకు మధుమేహుల్లో వైరల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. ముఖ్యంగా శ్వాస కోశ ఇన్ఫెక్షన్లు విజృంభిస్తాయి. మహిళల్లో మూత్రనాళ్ల ఇన్ఫెక్షన్లు వేధిస్తుంటాయి. చలి ఎక్కువగా ఉంటే మన శరీరంలో ఉష్ణోగ్రతను సమస్థితిలో ఉంచడానికి జీవక్రియలో మార్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలో ఆకలి ఎక్కువవుతుంది. ఒక వైపు చలి కారణంగా వ్యాయామని తగ్గించడం… మరోవైపు ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారు. ఇన్సులిన్ ఇంజక్షన్లు తీసుకునే వారి రక్తం లోని చక్కెర స్థాయిలో తరచూ హెచ్చుతగ్గులు ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తించి నియంత్రణలో ఉంచుకోవాలి. చలి తగ్గిన సమయంలో అయినా వ్యాయామం చేస్తే మంచిది అని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ లిల్లీ మేరి తెలిపారు.
గుండెకు ముప్పు:
చలి తీవ్రతకు గుండెలోని రక్తనాళాలు కూడా కుచించుకుపోతాయి. గుండెకు రక్త సరఫరా సరిగా జరగదు. దీంతో గుండె రక్తనాళాల్లో అప్పటికే పూడికలు ఉంటే ఆ పూడికలపై రక్తం గడ్డకట్టి గుండెపోటుకు దారి తీసే ప్రమాదం ఉందని లిల్లీ మేరి అన్నారు. చలిని తట్టుకునేందుకు కొందరు ధూమపానము, మద్యపానము మోతాదుకు మించి తీసుకుంటుంటారని, దీనివల్ల గుండె స్పందనలో లయ తప్పుతుందని, అత్యంత వేగంగా కొట్టుకుంటుందని, ఈ పరిస్థితులలో చాలామంది తెలియకుండానే నిద్రలోనే చనిపోతూ ఉంటారని, చలికాలంలో కొలెస్ట్రాల్ స్థాయి కూడా పెరుగుతుందని, అందుకే ధూమపానము మానేయాలని, మద్యపానాన్ని మోతాదుకు మించి తీసుకోవద్దని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ లిల్లీ మేరి తెలిపారు.
ఎవరిలో ప్రమాదం?
ఐదేళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, అవయవ మార్పిడి శాస్త్ర చికిత్స పొందిన వారు, మధుమేహులు, క్యాన్సర్, గుండె జబ్బు, ఆస్తమా, సీఓపిడి వంటి దీర్ఘకాల సమస్యలతో బాధపడుతున్న వారు అని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ లిల్లీ మేరి తెలిపారు.
ముందస్తు జాగ్రత్తలు:
చలి తీవ్రంగా ఉన్న సమయంలో నడక మంచిది కాదు. చలి సమయంలో బయటకు వెళ్తే శరీరం అంతటిని కప్పి ఉంచేలా దళసరి వస్త్రాలు ధరించాలి. చెవి, ముక్కు, నోటి నుంచి గాలి లోనికి వెళ్లకుండా అచ్చాదన వాడాలి. చర్మం పొడిబారకుండా తేమని పెంచే లేపనాలు, కొబ్బరినూనె, ఆలివ్ నూనె వంటి వాటిని చర్మానికి పట్టించాలి. చలి తీవ్రంగా ఉన్నప్పుడు చేతులు పట్టు తప్పుతాయి. అందువల్ల రాత్రిళ్ళు వాహనాలు నడపకపోవడమే మంచిది అని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ లిల్లీ మేరి పేర్కొన్నారు.