నిత్యం వేధించే భర్తతో తాను కాపురం చేయలేను
తల్లిదండ్రులకు మొర పెట్టుకున్న కూతురు
మేళతాళాల నడుమ ఊరేగింపుగా పుట్టింటికి తీసుకొచ్చిన తండ్రి
రాంచి అక్టోబర్‌ 18: అత్తవారింట్లో తాను ఉండలేనని, భర్త వేధింపులు భరించలేకపోతున్నానని ఓ కుమార్తె తన తల్లిదండ్రులకు చెప్పింది. నిత్యం వేధించే భర్తతో తాను కాపురం చేయలేనని మొర పెట్టుకుంది. కానీ తల్లిదండ్రులు ఆమెకు నచ్చజెప్పారు. కాపురం అన్న తర్వాత చిన్నచిన్న గొడవలు ఉంటాయని, కొన్నాళ్లు సర్దుకుపోతే సమస్యలు అవే తీరిపోతాయని సముదాయించారు. కానీ అదే అలుసుగా తీసుకున్న భర్త తన తీరు మార్చుకోక పోగా ఆమెను ఇంకా ఎక్కువగా వేధించడం మొదలుపెట్టాడు. కుమార్తె ద్వారా విషయం తెలుసుకున్న ఆ తండ్రి మనసు విరిగిపోయింది.వేధించే భర్తతో కాపురం చేయించడం కంటే తన కుమార్తెకు విడాకులు ఇప్పించడమే మేలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన బిడ్డ మెట్టినింటికి బంధుమిత్రులతో వెళ్లాడు. ఆమెను మేళతాళాల నడుమ బాణసంచా కాల్చుతూ ఊరేగింపుగా పుట్టింటికి తీసుకొచ్చాడు. జార్ఖండ్‌ రాష్ట్రంలోని రాంచీ నగరంలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. ఈ నెల 15న జరిగిన ఈ ఊరేగింపునకు సంబంధించిన వీడియోను ఆ తండ్రి సోషల్‌ విూడియాలో పోస్టు చేయడంతో వైరల్‌ అయ్యింది.వివరాల్లోకి వెళ్తే.. రాంచి సిటీకి చెందిన నివసించే ప్రేమ్‌ గుప్తా అనే వ్యక్తి 2022 ఏప్రిల్‌లో తన కుమార్తె సాక్షి గుప్తాను సచిన్‌ కుమార్‌ అనే వ్యక్తికి ఇచ్చి ఘనంగా వివాహం జరిపించాడు. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకే సచిన్‌ నుంచి తన కుమార్తెకు వేధింపులు షూరూ అయ్యాయి. అంతేగాక సచిన్‌కు అంతకు ముందే మరో వివాహం అయినట్లు తెలిసింది. అయినప్పటికీ తల్లిదండ్రుల సూచనతో సాక్షి గుప్తా అతడితో కాపురం చేస్తున్నది. కానీ, వేధింపులు ఎక్కువ అయ్యేసరికి సచిన్‌తో కలసి ఉండటం సాధ్యం కాదని నిర్ణయించుకుంది. అదే విషయం తల్లిదండ్రులకు చెప్పింది.సాక్షి గుప్తా నిర్ణయాన్ని ఆమె తండ్రి, ఆమె కుటుంబ సభ్యులు స్వాగతించారు. ఆమెను ఇంటికి తీసుకొచ్చేందుకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. మేళతాళాల నడుమ టపాసులు కాలుస్తూ ఆమెను పుట్టింటికి తీసుకొచ్చారు. కుమార్తెలు ఎంతో విలువైన వారని, అత్తింట్లో వారికి ఇబ్బందులు ఎదురైతే పుట్టింటి వారు అండగా ఉండాలని, గౌరవంగా చూసుకోవాలని ప్రేమ్‌ గుప్తా సూచించారు. మరోవైపు సచిన్‌తో విడాకుల కోసం న్యాయస్థానంలో కేసు వేశారు.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *