కాకినాడ, అక్టోబరు 18: జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ వన్ మేన్ షో నడుస్తోందా? డవ్మిూ కమిటీలను వేసి పార్టీని బలహీన పరిచే కుట్ర చేస్తున్నారా? జనసేన పార్టీని బలోపేతం కాకుండా ఉండేందుకు నాదెండ్ల కుట్రలు చేస్తున్నారా? జనసేనాని పవన్ కల్యాణ్… నాదెండ్ల మనోహర్ అనే బ్లాక్ హోల్ ని తన ప్రక్కన కూర్చో పెట్టుకున్నారా? ఈ నాదెండ్ల మనోహర్ అనే బ్లాక్ హోల్ పార్టీలో ఎవ్వరినీ ఎదగనీయడం లేదా? పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఇవ్వడం లేదా? అంటే అవుననే అంటున్నారు పార్టీ వీడిన నేతలు.నాదెండ్ల మనోహర్‌ను పార్టీవీడిన నేతలు టార్గెట్ చేయడం పట్ల రాజకీయంగా ఆసక్తికర చర్చ జరుగుతుంది. నాదెండ్ల మనోహర్‌ను కావాలనే టార్గెట్ చేశారా అనే చర్చ జరుగుతుంది. అందరికీ నాదెండ్ల మనోహర్ మాత్రమే ఎందుకు టార్గెట్ అయ్యారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒకవేళ నాదెండ్ల మనోహర్ పేరు చెప్పి ఎవరైనా ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నారా అనేది జనసేన పార్టీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు జనసేన పార్టీని వీడిన నేతలు సామాన్యులేవిూ కాదు. గత ఎన్నికల్లో మంచి ఓట్ల సాధించిన వారు. అంతేకాదు జనసేన పార్టీని గడప గడపకు తీసుకెళ్లిన నేతలు. ఇలాంటి నేతలను పార్టీ కోల్పోవడం ఒక విధంగా మైనస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే వీడిన వారంతా నాదెండ్ల మనోహర్‌ను టార్గెట్ చేయడం వెనుక లోగుట్టును కూడా అధినేత పవన్ కల్యాణ్ చేధించాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో వచ్చే ఎన్నికల నాటికి మరింత ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. పవన్ కల్యాణ్ తనకు అత్యంత ఇష్టమైన రాజకీయ నాయకుడిగా నాదెండ్ల మనోహర్‌ను ప్రకటించారు. పార్టీలో నాదెండ్ల మనోహర్ కంటే తనకు ఎక్కువ ఎవరూ కాదని ప్రకటించేశారు. నాదెండ్ల మనోహర్‌ను విమర్శిస్తే తనను విమర్శించినట్లేనని బహిరంగ ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో జనసేన పార్టీ నుంచి పలువురు ఇతర పార్టీలలోకి జంప్ అయ్యారు. అయితే పార్టీ వీడిన ప్రతీ ఒక్కరూ చేస్తున్న ఆరోపణలు నాదెండ్ల మనోహర్‌పైనే. పవన్ కల్యాణ్ లక్ష్యాలకు విరుద్ధంగా నాదెండ్ల మనోహర్ వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. జనసేన పార్టీ నుంచి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు సైతం వైసీపీకి అనుబంధంగా మారినప్పుడు నాదెండ్ల మనోహర్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. అప్పటి నుంచి మె?దలైన విమర్శలు నేడు కేతంరెడ్డి వినోద్ రెడ్డి వరకు అంతా నాదెండ్లనే టార్గెట్ చేస్తున్నారు. ఈ విమర్శలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.ఎన్నికలు సవిూపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ సవిూకరణాలు మారిపోతున్నాయి. తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు ప్రకటించిన అనంతరం ముగ్గురు కీలక నేతలు జనసేనకు రాజీనామా చేశారు. పిఠాపురం మాజీ ఇన్‌చార్జి మాకినీడు శేషుకుమారి, రాజానగరం మాజీ ఇన్‌చార్జి మేడా గురుదత్త ప్రసాద్, నెల్లూరు జిల్లాకు చెందిన కీలక నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి సైతం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. నాదెండ్ల మనోహర్ వ్యవహారశైలితోనే తాము పార్టీ వీడుతున్నట్లు ప్రకటనలు చేస్తున్నారు. జనసేన పార్టీ బలోపేతం కోసం తాను ఎంతో కృషి చేశానని అలాంటి తనను పక్కన పెట్టి నాదెండ్ల మనోహర్ మరో ఇన్‌చార్జిని నియమించారని మాకినీడు శేషుకుమారి ఆరోపించారు. జనసేన పార్టీ బలోపేతం అవుతున్న తరుణంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. నాదెండ్ల మనోహర్ నిర్ణయం పార్టికి చేటు తెస్తుందే తప్ప మంచి జరగదంటూ జనసేనను వీడిన శేషుకుమారి ఆరోపించిన సంగతి తెలిసిందే.