విజయవాడ, అక్టోబరు 7:ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎన్నికల బాండ్స్ చుట్టూ తిరుగుతున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో 27 కోట్ల రూపాయలు, ఎన్నికల బాండ్ల రూపంలో తెలుగుదేశం పార్టీ ఖాతాల్లోకి వచ్చాయని సీఐడీ ఆరోపిస్తోంది. దీన్నే సాక్ష్యంగా కోర్టులో ప్రవేశ పెడుతోంది. చంద్రబాబు బెయిల్ పిటిషన్ సందర్భంగా వాదించిన సీఐడీ తరఫు లాయర్లు ఎన్నికల బాండ్స్‌ను తెరపైకి తీసుకొచ్చారు. దీంతో వివాదం సరికొత్త మలుపు తిరిగినట్టు కనిపిస్తోంది.రాజకీయ పార్టీకి రూ.20 వేలకు మించి నగదు రూపంలో విరాళం ఇచ్చినట్లైతే, అలాంటి వివరాలన్నింటినీ కేంద్ర ఎన్నికల సంఘానికి, ఆదాయపు పన్ను శాఖకు, సదరు పార్టీ తెలియజేస్తుంది. అవి ఎన్నికల కమిషన్ వెబ్ సైట్‌లో అందరికీ అందుబాటులో ఉంటాయి. ఏప్రిల్ 2023లో ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ నుంచి తెలుగుదేశం పార్టీ నిధుల వివరాలను సీఐడీ అధికారికంగా డౌన్ లోడ్ చేసింది. అందులోనే ఎవరు ఏ రోజు ఎంత మొత్తంలో విరాళాలిచ్చారో స్పష్టంగా ఉంది. వాటిపై ఆరు నెలల పరిశోధన చేసిన సీఐడీ, ఎలాంటి అవకతవకలు లేకున్నా బురద జల్లడమే లక్ష్యంగా పెద్ద ఎత్తున నిధులు వచ్చాయని టీడీపీ ఆరోపిస్తోంది. అక్రమ కేసులకు ముడిపెట్టడం, దర్యాప్తు సంస్థలు ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు తలొగ్గి చట్ట వ్యతిరేకంగా పని చేస్తున్నాయని టీడీపీ నేతలు విమర్శించారు. 2018`19లో టీడీపీ ఖాతాకు రూ.27 కోట్లు ఎలక్షన్ బాండ్ల రూపంలో వచ్చాయని సీఐడీ చెబుతోంది. అదే సంవత్సరంలో అవే ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వైసీపీ ఖాతాకు రూ.99.84 కోట్లు, 2019`20లో రూ.74.35 కోట్లు, 2020`21లో రూ.96.25 కోట్లు, 2021`22లో రూ.60 కోట్లు వచ్చాయని వివరిస్తోంది. ఈ విరాళాలిచ్చిన వ్యక్తులు, సంస్థల పేర్లు సాక్షి పేపర్లో ప్రచురించే దమ్మూధైర్యం జగన్ మోహన్ రెడ్డికి ఉందా ? అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. 6 నెలల క్రితం ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ నుంచి సేకరించినట్లు సిఐడి పంచనామా నివేదిక చెబుతోంది. ఆరు నెలల పరిశోధన తర్వాత ఎలాంటి ఆధారాలు దొరక్క ఇప్పుడు కోర్టు ముందు పెద్ద మొత్తంలో నగదు వచ్చిందని అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ మండిపడుతోంది. దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. వాటికి ఎన్నికల సమయంలో భారీగా నిధులు అవసరం ఉంటుంది. అందుకే విరాళాల సేకరణకు ప్రధాన రాజకీయ పార్టీలు బాండ్లను జారీ చేస్తుంటాయి. ఎన్నికల బాండ్లు ఒక ప్రామిసరీ నోట్ లాంటివి. ఇవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లభ్యం అవుతాయి. వ్యక్తులు, కంపెనీలు వీటిని కొనుగోలు చేయవచ్చు. అలా కొనుగోలు చేసిన వాటిని నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వొచ్చు. రాజకీయ పార్టీలు తమకు వచ్చిన బాండ్లను నగదుగా మార్చుకొని పార్టీ కార్యక్రమాల కోసం వినియోగించుకుంటాయి. 2021`22లో వాటికి వచ్చిన మొత్తం రూ.3289.34 కోట్లుగా ఉంది. అందులో దాదాపు 55శాతం పైగా నిధులు ఎన్నికల బాండ్ల నుంచి సమకూరాయి. రూ.1000, 10,000, 1,00,000, 10,00,000, 1,00,00,000 డినామినేషన్లలో ఈ బాండ్ల అమ్మకం ఉంటుంది. సాధారణంగా ఈ బాండ్లు జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబర్ నెలల్లో 10 రోజుల పాటు అందుబాటులో ఉంటాయి. అదే సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం అదనంగా 30 రోజులు అనుమతినిస్తుంది. విదేశాల్లో రాజకీయ పార్టీలు ఎలాంటి విరాళాలు స్వీకరించకూడదనే పరిమితి కూడా ఉంది. రాజకీయ పార్టీల విరాళాల విషయంలో పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో బీజేపీ సర్కార్ 2018లో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఎలక్టోరల్ బాండ్స్ పథకాన్ని పార్లమెంటులో మనీ బిల్లుగా ఆమోదించింది. దీని ద్వారా రాజకీయ పార్టీలకు కోట్లాది రూపాయలు సమకూరినప్పటికీ అవి ఎవరు ఇచ్చారనే విషయం మాత్రం బయట పెట్టాల్సిన అవసరం లేదు. ఈ డబ్బుకు ఆదాయపు పన్ను మినహాయింపు కూడా ఉంటుంది.దేశంలో మూడు వేలకుపైగా రాజకీయ పార్టీలున్నాయి. అవన్నీ కూడా ఎన్నికల బాండ్లు పొందలేవు. ఎందుకంటే అవి కచ్చితంగా ఇటీవలి కాలంలో జరిగిన సాధారణ లేక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఉండాలి. అందులో కనీసం 1 శాతం ఓట్లు పొంది ఉండాలి. రిప్రెజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 సెక్షన్ 29 ఎ ప్రకారం పార్టీ రిజిస్టర్ అయి ఉండాలి. అన్ని అర్హతలు కలిగిన రాజకీయ పార్టీ విరాళంగా పొందిన ఎన్నికల బాండును డిపాజిట్ చేస్తే దానికి సంబంధించిన నగదు అదే రోజు పార్టీ ఖాతాలోకి వెళుతుంది. 2018 నుంచి ఈ పథకం అమలులో ఉంది. 2022 జులై నాటికి ఎస్బీఐలో కొనుగోలు చేసిన మొత్తం ఎన్నికల బాండ్ల విలువ 10వేల కోట్లు దాటింది.