నెల్లూరు, సెప్టెంబర్‌ 11: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఉద్యోగులు రోజులో మూడు సార్లు కచ్చితంగా బయోమెట్రిక్‌ హాజరు నమోదు చేయాలని ఆదేశించింది. ప్రతి రోజూ ఉదయం 10.30 గంటలకు ముందు, మధ్యాహ్నం 3 గం.లకు, సాయంత్రం 5 గంటల తర్వాత హాజరు వేయాలని జీవో జారీ చేసింది. అయితే గత ప్రభుత్వ హయాంలోనే ఈ నిబంధన ఉండగా, బయోమెట్రిక్‌ విధానం సరిగ్గా అమలు కావడంలేదన్న ఆరోపణలతో…తాజాగా ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి రోజుకు మూడుసార్లు హాజరు కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు హాజరు ప్రక్రియను పర్యవేక్షించనున్నారు.గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ముందుగా ఆగస్టు 31వ వరకు బదిలీలకు అవకాశం కల్పించగా… పెన్షన్ల పంపిణీ, వర్షాల నేపథ్యంలో బదిలీల ప్రక్రియను సెప్టెంబర్‌ 15వ వరకు పొడిగించారు. బదిలీలు కోరుకునే ఉద్యోగులు తమ వివరాలతో ఆన్‌లైన్‌ లో గ్రామ, వార్డు సచివాలయాల శాఖ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సచివాలయాల శాఖపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో అవసరాన్ని మించి ఉద్యోగులు ఉన్నారని ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. దీంతో అదనపు ఉద్యోగులను వివిధ శాఖల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో 1,26,000 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.ఒక్కో సచివాలయంలో 11 మంది సిబ్బంది ఉన్నట్లు గుర్తించిన కూటమి ప్రభుత్వం…వీరిలో కొంత మందికి సరైన విధులు లేవని అభిప్రాయపడిరది. అటువంటి వారిని మండల, డివిజన్‌ స్థాయిలోని ప్రభుత్వ ఆఫీసుల్లో నియమించాలనే ఆలోచన చేస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా గ్రామ సచివాలయాల్లోని ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లను ఇరిగేషన్‌ శాఖలో ఏఈలుగా సర్దుబాటు చేసింది. దాదాపుగా 660 మందిని ఏఈలుగా నియమించాలని ఇటీవల జలవనరులు శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ను ప్రభుత్వం ఆదేశించింది. పనిలేకుండా ఉన్న వారిని మిగతా శాఖల్లో సర్దుబాటుచేసి, సిబ్బంది సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *