గుంటూరు, అక్టోబరు 6: ఏపీలో నెలకొన్న రాజకీయ వాతావరణం ఎవరికి అంతు చిక్కడం లేదు. ఎన్నికల్లో ఎవరు ఎవరితో కలిసి పోటీ చేస్తారనే విషయంలో ఇంకా స్ఫష్టత రావడం లేదు. టీడీపీ`జనసేన కూటమిలో బీజేపీ ఉంటుందో లేదోననే విషయం ఇప్పట్లో తెలేలా లేదు.ఆంధ్రప్రదేశ్లో విపక్షాల మధ్య పొత్తుల చిక్కుముడి ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. టీడీపీతో కలిసి జనసేన వెళుతుందని పవన్ కళ్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో జనసేనతో మైత్రి విషయంలో ఎలా ముందుకు సాగాలనే దానిపై ఏపీ బీజేపీ నాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది. జనసేన విషయంలో ఎలాంటి వైఖరి అవలంబించాలనే దానిపై పార్టీ అధిష్టానం నుంచి స్పష్టత తీసుకోవాలని బీజేపీ కోర్ కమిటీ నిర్ణయించింది.తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టు అనంతరం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రకటనల గురించి మంగళవారం జరిగిన బీజేపీ ఏపీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో జనసేన`బీజేపీ పొత్తుపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు .సెప్టెంబర్ 14న ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ`జనసేన కలిసి ముందుకు వెళ్తాయని ప్రకటించారు. ఇప్పటికే బీజేపీ`జనసేన మధ్య పొత్తు ఉంది.. ఇప్పుడు టీడీపీ, జనసేనతో బీజేపీ కలిసి వస్తుందా? లేదా? అనే విషయాన్ని బీజేపీ వారే తేల్చుకోవాలని పవన్ పేర్కొన్నారు.. మరోవైపు బీజేపీ అధిష్టానమే పొత్తుల విషయం చూసుకుంటుందని బీజేపీ ఏపీ అధ్యక్షులు పురంధేశ్వరి చెబుతున్నారు.బీజేపీతో పొత్తులో ఉంటూనే టీడీపీతో కలిసి పోటీ చేస్తామని పవన్ ఎలా ప్రకటన చేస్తారనే అంశంపై బీజేపీలో అసహనం వ్యక్తం అవుతోంది.