ప్రకాశం బ్యారేజీని పడవలు ఢీకొట్టిన ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాం
` విచారణలో ఒక్కో అంశం బయటకు వస్తోంది
` అందరికీ అన్నం పెట్టే అన్నదాతలకు నష్టం కలిగించాలనుకునే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు..
` మా ప్రభుత్వం నిర్మాణం పరంగా దృష్టిసారిస్తుంటే ప్రతిపక్షం విధ్వంసం దిశగా ముందుకెళ్తోంది
` ఘటనపై ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా ఉన్నారు
` కౌంటర్ వెయిట్ల పునరుద్ధరణ పనులను రెండు రోజుల్లో పూర్తిచేస్తాం
` విూడియాతో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు
ప్రకాశం బ్యారేజీని అయిదు పడవలు ఢీకొన్న ఘటనపై ముమ్మర దర్యాప్తు జరుగుతోందని..అందరికీ అన్నంపెట్టే అన్నదాతలకు నష్టం చేకూర్చడానికి ప్రయత్నించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హెచ్చరించారు. మంగళవారం మంత్రి ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో విూడియాతో మాట్లాడారు. 1854 నుంచి 1952 వరకు దాదాపు 100 సంవత్సరాల పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలకు బ్యారేజీ సేవలందించిందని.. 1952 లో వచ్చిన వరదలకు బ్యారేజీ దెబ్బతినడంతో ప్రభుత్వం పునర్నిర్మాణం చేసి మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరును పెట్టడం జరిగిందన్నారు. ఆపై 1957 నుంచి దాదాపు 13.8 లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షలాది ప్రజలకు తాగునీరు ప్రకాశం బ్యారేజీ ద్వారా అందుతున్నాయి. ఈ బ్యారేజీ ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలకు వరప్రదాయనిగా నిర్విరామంగా సేవలందిస్తోంది. ఆ విధంగా పాత ఆనకట్ట వంద సంవత్సరాలు, కొత్త ఆనకట్టకు దాదాపు 70 సంవత్సరాల చరిత్ర ఉంది. అంటే దాదాపు 170 సంవత్సరాల ఘన చరిత్ర ప్రకాశం బ్యారేజీ కి ఉంది. 11,42,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చిన కీలక పరిస్థితిలో ఐదు పడవలు ప్రకాశం బ్యారేజీని ఢీకొనడం వెనుక కుట్ర కోణం ఉందనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. ఘటనపై వాస్తవాలను వెలికి తీసేందుకు దర్యాప్తు సంస్థలు ముమ్మర విచారణ సాగిస్తున్నాయి.
ఒక్కొక్కటి 40`50 టన్నుల బరువున్న ఐదు పడవలు అధిక వరద వస్తున్న సమయంలో ప్రకాశం బ్యారేజీకి చెందిన 67, 69, 70 గేట్లను దాటుకొని కౌంటర్ వెయిట్ ని బలంగా ఢీకొట్టడం జరిగింది. అదృష్టవశాత్తు బ్యారేజీకి సంబంధించిన ప్రధాన కట్టడానికి గానీ గేట్లకుగానీ ఎలాంటి నష్టం వాటిల్లకుండా బోట్లు కౌంటర్ వెయిట్ ను ఢీకొన్నాయి. నిజంగా గేట్లను గాని ప్రధాన కట్టడాన్ని గాని ఢీకొని ఉంటే ఐదారు జిల్లాలకు ఎంత నష్టం జరిగేదో ఊహించడానికి కష్టంగా ఉంది. ఈ మొత్తం ఘటనపై దర్యాప్తు చేయాలని ఇరిగేషన్ శాఖ నుంచి పోలీస్ శాఖకు ఫిర్యాదు చేయడం జరిగింది. దర్యాప్తు చాలా వేగంగా జరుగుతోంది. ఈ మొత్తం ఘటన పలు అనుమానాలకు తావిస్తోందని.. రైతులు, రైతు సంఘాలు అంటున్నాయి. ఇలాంటి అధిక బరువు కలిగిన బోట్లను సాధారణంగా నది ఒడ్డున లంగర్ వేసి ఉంచుతారు. ఒక్కో బోటు విలువ రూ. 40`50 లక్షలు ఉంటే.. అంతటి విలువైన 3 బోట్లను ఒకే ప్లాస్టిక్ తాడుతో కట్టడం చాలా అనుమానాలకు తావిస్తోంది. ఇంతటి విలువైన పడవలను జాగ్రత్త చేసుకోకుండా ఉద్దేశపూర్వకంగానే ఇలా బ్యారేజీని ఢీకొట్టేలా చేశారా అనే అనుమానాలు పెద్దఎత్తున వస్తున్నాయి. మొత్తం ఐదు పడవల్లో ఒక పడవ గేట్ల మధ్య నుంచి కిందకు వెళ్లిపోగా మూడు పడవలను గుర్తించడం జరిగింది. మరో పడవ ఆచూకీ తెలుసుకుంటున్నాం. గుర్తించిన మూడు పడవలకు యజమాని ఒకరే కావడం అనుమానానికి దారితీస్తోంది. ఈ పడవల యజమాని అయిన ఉషాద్రి.. కోమటి రామ్మోహన్ కు అనుచరుడిగా ఉన్నారు. ఈ రామ్మోహన్ తలశిల రఘురాంతో బంధుత్వం ఉండటం అనుమానాలకు తావిస్తోంది. గత ప్రభుత్వ అండదండలతో నందిగం సురేష్ వీరంతా సిండికేట్ గా ఏర్పడి డ్రెడ్జింగ్ ద్వారా ఇసుకను అక్రమంగా లూటీ చేశారు. పడవలకు వైఎస్ఆర్ సీపీ రంగులు కూడా ఉండడం.. ఈ బోట్లు అధికారిక పార్టీకి సంబంధించినవి అని చెప్పేలా రంగులు వేసుకున్న పరిస్థితి కనిపించింది. ఇలా దర్యాప్తులో ఒక్కో విషయం బయటకు వస్తోంది.
బోట్లను లంగరు వేసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలని స్థానికులు చెప్పినా సరే నిర్లక్ష్యం చేశారంటే వారి మనసులో వేరే తప్పుడు భావన ఉందని దర్యాప్తులో కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మూడు బోట్లు అంతకుముందు గుంటూరు జిల్లా ఉద్ధండరాయునిపాలెం వైపు ఉండేవి.. ఈ వరదకు కొన్ని రోజుల ముందే వాటిని ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి వైపు తీసుకొచ్చి ప్లాస్టిక్ వైరుతో కట్టి ఉంచినట్లు తెలుస్తోంది. అంటే ఉద్దేశపూర్వకంగానే వరద వేగానికి కొట్టుకొచ్చేలా ఉంచారా అనే అనుమానం వస్తోంది. ప్రకాశం బ్యారేజీకి నష్టం కలిగించి ప్రభుత్వానికి చెడ్డపేరు కలిగించాలనే ఆలోచన వారిలో ఉందా అనే అనుమానం వస్తోంది. వైఎస్ఆర్ సీపీకి మొదటి నుంచి కూడా కుర్చీ కోసం, పదవుల కోసం బరితెగించే మనస్తత్వం ఉంది. రైతు ఆరుగాలం శ్రమించి కష్టపడి పంట పండిస్తే ఆ పంటకు సైతం నిప్పు
పెట్టిన చరిత్ర వారిది. తప్పులు చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టకుండా కఠిన చర్యలు తప్పవు.ప్రస్తుతం అనుభవజ్ఞులైన కన్నయ్య నాయుడు గారి నేతృత్వంలో కౌంటర్ వెయిట్లను ఐరన్ దిమ్మలతో ఏర్పాటు చేయడం జరుగుతుంది.
రెండు రోజుల్లోగా పనుల పూర్తికి కృషిచేస్తున్నాం. ఏ చిన్న రిస్కు కూడా తీసుకోకుండా ఈ పనులు చేపడుతున్నాం. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వరద ప్రవాహం వెళ్తుండగానే తుంగభద్ర డ్యామ్ గేటును బిగించిన పని కన్నయ్యనాయుడు నేతృత్వంలో జరిగింది. వరద ప్రవాహానికి గేటు కొట్టుకుపోతే రైతుల కళ్ళల్లో నీళ్లు చూశాను.. మళ్లీ తిరిగి గేటు అమర్చిన తర్వాత అదే రైతుల కళ్ళల్లో ఆనందం చూసానని ఆరోజు కన్నయ్య నాయుడు చెప్పారు. అందుకే ఆయన సూచనలు సలహాలతో ప్రకాశం బ్యారేజీ విషయంలో కూడా ముందుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి సూచించారు. ఎక్కడా చిన్న పొరపాటుకు తావు లేకుండా ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ రెండు రోజుల్లో పనుల పూర్తికి కృషి చేయడం జరుగుతుంది. రాజకీయపరంగా కాకుండా ప్రకాశం బ్యారేజీ భద్రత పరంగా ఘటనపై ముమ్మర దర్యాప్తు చేస్తున్నట్లు మంత్రి రామానాయుడు తెలిపారు.