విజయవాడ, సెప్టెంబర్ 3: విజయవాడకు వరదలు వచ్చాయి. సిటీ సగం మునిగింది. లక్షల మంది ఇబ్బంది పడ్డారు. ఇలాంటి సమయంలోనే అప్పటి వరకూ సమాజంలో ఉన్న అన్ని తేడాలు కనిపించకుండా పోతాయి. రెండు వర్గాలు మాత్రం ఎప్పటికీ పోవని నిరూపితమవుతుంది. ఆ రెండు వర్గాలు మానవత్వం ఉన్నవారు.. మానవత్వం లేని వారు. వరద బాధితులు కష్టాల్లో ఉన్నారని.. వారికి ఎంతో కొంత సాయం చేయాలని అనుకునేవారు కొందరైతే.. వారు కష్టాల్లో ఉన్నారు కాబట్టి వారి ఆతృతను అవకాశంగా తీసు?కుని దోచుకుందామనుకున్నవారు ఇంకొందరు. ఈ రెండు వర్గాలే విజయవాడలో గత రెండు , మూడు రోజులుగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. తోటి మనిషి కష్టాల్లో ఉంటే చేతనైనంత సాయం చేసి కాపాడుదామనుకునేవారికి మన సమాజంలో లోటు ఉండదు. విజయవాడ వరదల విషయంలో అదే నిరూపితమయింది. సింగ్ సహా అనేక ప్రాంతాల్లో వరద వచ్చినట్లుగా తేలడంతో వెంటనే… చాలా మంది స్పందించారు. అధికారులు, ప్రభుత్వం బాధ్యతగా స్పందిస్తుంది. అయినా కొంత మంది స్వచ్చంద సేవకు ముందుకు వచ్చారు. అనేక మంది సొంత డబ్బులతో సాయం చేశారు. ఆహారం పంచారు. మందులు పంపిణీ చేశారు. బుల్ డోజర్లు వంటివి తెచ్చారు. చివరికి సమాచార సాయం చేసిన వాళ్లు కూడా ఉన్నారు. ఇలాంటి వారితో మానవత్వం పరిమళించిందని అనుకున్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నారు.. వారందర్నీ కాపాడాలని.. వారి అవసరాలను తీర్చాలని అనుకున్నవారే కాదు.. వారి అవసరాన్ని, ఆందోళనను గుర్తించి క్యాష్ చేసుకున్న వారు కూడా ఉన్నారు. ప్రైవేటు బోట్లు పెట్టుకుని కొంత మంది.. నీరు లేనిప్రదేశానికి మనుషుల్ని తీసుకెళ్లి విడిచి పెట్టడానికి వేలకు వేలు వసూలు చేశారు. మందులు ఇర అవసరాల కోసం డబ్బులు గుంజిన వారున్నారు. ప్రభుత్వం అందించే సహాయ కార్యక్రమాలు అక్కడి వరకూ రావని భయపెట్టి దోచిన వాళ్లూ తక్కువేవిూ లేరు. ఇలాంటి వాళ్లు మరో వైపు మానవత్వం లేని వర్గంగా కనిపించారు. ఇది రెండో వర్గం. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయకపోయినా పర్వా లేదు కానీ.. ఇలా వారి కష్టాల్ని ఆసరా చేసుకుని దోచుకునే వాళ్లతోనే అసలు సమస్య. ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసినా అందర్నీ ఒకే సారి ఆదుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్ని ఆధారంగా చేసుకుని దోచుకునే వాళ్లు, పరిస్థితుల పట్ల భయం కలిగించి.. సొమ్ము చేసుకునే వాళ్లకూ కనిపిస్తూనే ఉంటారు. అందుకే విపత్తులు వచ్చినప్పుడు కుల, మత వర్గలేవిూ ఉండవు.. మానవత్వం ఉన్న వాళ్లు.. మానవత్వం లేని వాళ్లే కనిపిస్తారు. విజయవాడలో నాలగు రోజులుగా వాళ్లే కనిపిస్తున్నారు.