ప్రయివేటు షాపులే ఉండేలా ఎక్సైజ్ శాఖ కొత్త పాలసీ
అమరావతి: ఆంద్రప్రదేశ్ లో ప్రభుత్వమద్యం దుకాణాల కు గుడ్‌బై చెప్పడానికి సిద్ధం అయ్యింది. గత వైసీపీ సర్కార్ హయాం నుంచి అమలవుతున్న మద్యం పాలసీ ముగింపు దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ తర్వాత రాష్ట్రంలో ఎక్కడా సర్కారీ మద్యం షాపులు కనిపించవు. పూర్తిగా ప్రయివేటు షాపులే ఉండేలా ఎక్సైజ్ శాఖ కొత్త పాలసీని రూపొందిస్తోంది. ఈ మేరకు ఆరు రాష్ట్రాల్లో మద్యం పాలసీని అధ్యయనం చేసి అధికారులు ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు. 2019 అక్టోబరు 1 నుంచి వైసీపీ సర్కారు ప్రభుత్వ మద్యం షాపుల పాలసీని అమల్లోకి తెచ్చింది. అప్పటివరకూ 4,380 షాపులు ఉంటే వాటిని 3,500కు కుదించి ప్రభుత్వ దుకాణాలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మరోసారి షాపుల సంఖ్యను 2,934కు కుదించారు. ఇవికాకుండా టూరిజం కేంద్రాల్లో షాపుల పేరుతో మొత్తం 3,392కు పెంచారు. 2023లో తెలంగాణ లిక్కర్ పాలసీ ప్రకటించినప్పుడు దరఖాస్తు ఫీజు కింద రూ.2,628 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ రూపంలో కనీసం రూ.2వేల కోట్ల వరకూ వస్తుందని అంచనా వేస్తున్నారు. కొత్త పాలసీలో దరఖాస్తు ఫీజురూ.2లక్షలు (నాన్`రిఫండబుల్) గా నిర్ణయించారు. అయితే మొత్తం దుకాణాల్లో 10శాతం అంటే దాదాపు 300 వరకూ గీత కార్మికులకు కేటాయించాలి. కొత్త పాలసీని పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే ప్రభుత్వం తీసుకురానుంది. దరఖాస్తుల నుంచి లాటరీ వరకూ పూర్తిగా ఆన్లైన్ ప్రక్రియ ద్వారానే చేపట్టనున్నారు. ఏక్కువ ధరకు లైసెన్స్‌లు పొందినవారు మధ్యలోనే షాపును వదిలేస్తే అది ఆదాయ నష్టంతో పాటు, ఇతర అంశాలపైనా ప్రభావం చూపుతుందని, అందువల్ల లాటరీ విధానంలో ఎంపిక చేయడమే ఉత్తమమని భావిస్తున్నారు. గతంలో ప్రైవేటు షాపు పక్కనే మద్యం సేవించేందుకు పర్మిట్ రూమ్ ఉండేది. ప్రభుత్వ షాపుల విధానంలో వాటిని తొలగించారు. దానివల్ల మందుబాబులు రోడ్లపైనే మద్యం తాగే దానిని అరికట్టేందుకు రూమ్‌లకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. ఇక ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని వారం, పది రోజుల్లో ప్రకటించనుంది.