విజయవాడ, జూన్ 10: వైఎస్ జగన్ ఈసారి ఎన్నికల్లో రాజకీయంగా ఇబ్బంది పడ్డారు. కేవలం పదకొండు స్థానాలకే పరిమితమయ్యారు. లోక్‌సభలో కేవలం నలుగురు సభ్యులే ఉండనునున్నారు. తిరుపతి, రాజంపేట, అరకు, కడప నుంచి మాత్రమే వైసీపీ అభ్యర్థులు గెలిచారు. దీంతో ఆయనపై ఉన్నకేసులతో ఇబ్బంది పడే అవకాశాలున్నాయని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు కీలకంగా ఉండటంతో కేసులపై మోదీ ప్రభుత్వంపై వత్తిడి తెచ్చే అవకాశం లేకపోలేదన్న అంచనాలు కూడా ఉన్నాయి. అయితే ఇదే సమయంలో కొంతలో కొంత జగన్ కు ఊరటనిచ్చే అంశం కూడా మరొక కోణంలో చూస్తే కనపడుతుంది.బీజేపీ ఇప్పుడు అరకొర మెజారిటీతో గట్టెక్కింది. కేవలం 240 స్థానాలకే పరిమితమయింది. మిత్రపక్షాల అవసరం ఎంత అవసరమో.. బయట నుంచి మద్దతిచ్చే పార్టీల అవసరం కూడా అంతే ఉంది. ఒడిశాలో నవీన్ పట్నాయక్ ను ఓడిరచి అక్కడ బీజేపీ అధికారంలోకి రావడంతో పాటు, నవీన్ పట్నాయక్ పై ప్రచారంలో మోదీ వ్యక్తిగత విమర్శలు చేయడంతో ఆయన వైపు నుంచి మద్దతు దొరికేది కష్టమేనని చెబుతున్నారు. ఇక ఇతర పార్టీల పై ఆధారపడక తప్పని పరిస్థితి. ముఖ్యంగా రాజ్యసభలో ఇతర పార్టీల అవసరం మోదీ ప్రభుత్వానికి ఎంతో ఉంది. అందులోనూ వైసీపీ రాజ్యసభలో ఎక్కువ స్థానాలున్నాయి. టీడీపీకి ఒక్క స్థానం కూడా పెద్దలసభలో లేకపోవడంతో వైసీపీ కీలకంగా మారనుంది. వైసీపీకి ఇప్పుడు రాజ్యసభలో పదకొండు మంది రాజ్యసభ సభ్యులున్నారు. దీంతో జగన్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికిప్పుడు ఎదురయ్యే ప్రమాదం అయితే ఏవిూ లేదు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే రాజ్యసభ పదవులు ఖాళీ అయ్యే పరిస్థితి లేదు. 2026 జూన్ నెలకు నాలుగు రాజ్యసభ పదవులు ఖాళీ అవుతున్నాయి. జూన్ 21వ తేదీకి వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు పరిమళ్ నత్వానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ పదవీ కాలం పూర్తవుతుంది. జూన్ 2026 నాటికి ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ స్థానాలన్నీ కూటమి ఖాతాల్లోనే పడతాయి. ఒక్క 2026 మాత్రమే కాదు మళ్లీ 2029 ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఏర్పడే ప్రతి ఒక్క రాజ్యసభ స్థానం కూటమి ఖాతాలోనే పడుతుంది. జూన్ 2028 నాటికి వైసీపీకి చెందిన మరో నాలుగు రాజ్యసభపదవులు ఖాళీ అవుతాయి. జూన్ 21 2028 నాటికి బీద మస్తాన్ రావు, నిరంజన్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య, విజయసాయిరెడ్డి పదవీ కాలం ముగుస్తుంది. మిగిలిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాధరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిల పదవీకాలం ఏప్రిల్ 1 30 వతేదీ వరకూ ఉంటుంది. అంటే 2021 తర్వాత కూడా ఏడుగురు రాజ్యసభ సభ్యులు వైసీపీకి ఉంటారు. ఒకరకంగా ఇది జగన్ కు షీల్డ్ అనే చెప్పాలి. తనపైకి దూకుడు తనాన్ని ప్రదర్శించేందుకు రాజ్యసభ స్థానాలను అడ్డుపెట్టుకునే వీలుంది. ఎందుకంటే టీడీపీకి రాజ్యసభలో ఒక్క స్థానం కూడా లేకపోవడంతో పెద్దల సభలో జగన్ సహకారం మోదీకి అవసరంగా మారడంతో కొన్ని ఇబ్బందులను తప్పించుకునే వీలుందని వైసీపీ నేతలు కొంత వరకూ ఊపిరి పీల్చుకుంటున్నారు.
మరో వైపు బీజేపీ గూటికి వైసీపీఎంపీలు..?
వైసీపీ ఎంపీలు బిజెపిలో చేరతారా? లోక్సభ సభ్యులతో పాటు రాజ్యసభ సభ్యులు జంప్ చేస్తారా? జగన్ పంపిస్తారా? లేకుంటే తమకు తాముగా వారు వెళ్ళిపోతారా? ఇప్పుడు ఇదే బలమైన చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో టిడిపి దారుణంగా ఓడిపోయింది. ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లిన చంద్రబాబు బిజెపి అగ్రనేతలను టార్గెట్ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రచారం కూడా చేశారు. కానీ ఆ ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబును ప్రజలు తిరస్కరించారు. జాతీయస్థాయిలో బిజెపి సొంతంగానే అధికారంలోకి వచ్చింది. దీంతో చంద్రబాబుకు తత్వం బోధపడిరది. ఇప్పుడు అదే పరిస్థితి జగన్ కు ఎదురయింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయం మూటగట్టుకున్నారు. కేవలం నాలుగు ఎంపీ స్థానాలకు పరిమితం అయ్యారు. దీంతో చంద్రబాబు మాదిరిగా జగన్ వ్యవహరిస్తారా? వైసీపీ ఎంపీలను బిజెపిలోకి పంపిస్తారా? అన్న చర్చ అయితే జరుగుతోంది.ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీకి 11 మంది ఎంపీలు ఉన్నారు.తెలుగుదేశం పార్టీకి ఎవరూ లేరు. అటు బిజెపికి సైతం ఆశించిన స్థాయిలో రాజ్యసభ సభ్యులు లేరు. మరోవైపు ఇండియా కూటమి పట్టు బిగిస్తోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు తప్పకుండా జగన్ ను వెంటాడుతారు. పాత కేసులను తిరగదోడుతారు. ఆ విషయం జగన్ కు తెలియంది కాదు. జగన్ తో పాటు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సైతం కేసులను ఎదుర్కొంటున్నారు. దీంతో జగన్ సూచనతో విజయసాయిరెడ్డి బిజెపిలో చేరినా ఆశ్చర్యపోనవసరం లేదన్న చర్చ నడుస్తోంది. ఒకవేళ జగన్ చెప్పకపోయినా విజయ్ సాయి రెడ్డి మాత్రం బిజెపిలోకి వెళ్లేందుకు శత విధాలా ప్రయత్నాలు చేస్తారని ప్రచారం జరుగుతోంది.తాజా ఎన్నికల్లో వైసీపీ నుంచి నలుగురు లోక్ సభ సభ్యులు ఎన్నికయ్యారు. కడప నుంచి వైయస్ అవినాష్ రెడ్డి, రాజంపేట నుంచి మిధున్ రెడ్డి, తిరుపతి నుంచి గురుమూర్తి, అరకు నుంచి డాక్టర్ గుమ్మ తనుజారాణి ఎంపీలుగా విజయం సాధించారు. అందులో తొలి ముగ్గురు జగన్ కు అత్యంత వీర విధేయులు. జగన్ గీసిన గీత దాటరు. కానీ డాక్టర్ తనూజారాణి గురించి పెద్దగా తెలియదు. అయితే అవసరాల రీత్యా ఈ ఎంపీలు జగన్ వద్ద ఉంటారన్న గ్యారెంటీ లేదు. ముఖ్యంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి. వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు. ఇప్పటివరకు వైసీపీ అధికారంలోకి ఉండడంతో ఆయనకు ఎటువంటి ఇబ్బందులు రాలేదు.. ఇప్పుడు టిడిపి అధికారంలోకి రావడంతో ఆయన్ను వెంటాడుతారు. అందుకే ఆయన బిజెపిలో చేరతారని టాక్ అప్పుడే ప్రారంభం అయ్యింది. కానీ చంద్రబాబు కేంద్రంలో కీలకంగా వ్యవహరించనుండడంతో.. ఆయన అనుమతి లేకుండా బిజెపి ఈ ఎంపీలను తీసుకుంటుందా? అన్నది ఒక అనుమానం.