హైదరాబాదు జూన్‌ 7: చట్టాలు ప్రజలకు ఉపయోగపడాలి. ఆ విధంగా వాటిని అమలు చేసే వ్యక్తులు క్రియాత్మకంగా వ్యవహరించాలి. లేకపోతే ఆ చట్టము లక్ష్యం నెరవేరదు. అది నిర్వీర్యం అవుతుంది. పౌరులకు ఆచరణయోగ్యమైన సమాచార హక్కు కల్పించి, తద్వారా ప్రతి అధికార యంత్రాంగము దగ్గర ఉన్న సమాచారాన్ని పౌరులకు అందుబాటులోకి తెచ్చేందుకు, పౌరులకు ఉన్న సమాచార హక్కును చట్టబద్ధం చేసి, ప్రతి ప్రభుత్వం యంత్రాంగములో పారదర్శకత, జవాబుదారీ తనము తీసుకురావడం ఈ చట్టం ఉద్దేశ్యము అని వికారాబాద్‌ జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ సాయి చౌదరి అన్నారు. సమాచార హక్కు చట్టంలోని 7(6) ప్రకారము అభ్యర్థన అందిన 30 రోజుల్లోగా దరఖాస్తుదారు కోరిన సమాచారాన్ని ఇవ్వడంలో విఫలమైనప్పుడు ఫీజుతో నిమిత్తం లేకుండా ఆ సమాచారాన్ని ఉచితంగా ప్రజా సమాచార అధికారి అందించాల్సి ఉంటుంది. ఆ ఫీజు సహేతుకంగా ఉండాలి. దారిద్య రేఖకు దిగువన ఉన్నవారి నుంచి ఎలాంటి ఫీజు వసూలు చేయకూడదు అని సాయి చౌదరి తెలిపారు. అంతేకాదు సెక్షన్‌ 7(3) ప్రకారం సమాచారం అందించడానికి ఎక్కువ మొత్తం వసూలు చేయాలని నిర్ణయించినప్పుడు ఆ విషయాన్ని దరఖాస్తుదారునికి తెలియజేయాలి. ఆ ఫీజును మరొకసారి పరిశీలన చేయమని కోరే హక్కు దరఖాస్తుదారునికి ఉందని, అందుకున్న కాలపరిమితిని, అనుసరించాల్సిన పద్ధతులను, అప్పీలును ఎవరి ముందు దాఖలుచేయాలో ఆ వివరాలను కూడా తెలియజేయాలి. సెక్షన్‌ 7(9) ప్రకారం కోరిన సమాచారాన్ని దరఖాస్తుదారుడు అడిగిన రూపంలోనే అందించాలి. ఆ విధంగా కాకుండా వేరే విధంగా కూడా సమాచారాన్ని ఇచ్చే అధికారము ప్రజా సమాచార అధికారి ఉంటుంది. వనరులు ఎక్కువ ఖర్చయ్యే సందర్భంలో ఆ విషయాన్ని తెలియజేస్తూ, తక్కువ ఖర్చు అయ్యే విధంగా మరో రూపంలో ఇచ్చే అవకాశం ప్రజా సమాచార అధికారికి ఉంటుంది. ఈ చర్యలేవి తీసుకోకుండా కొన్ని వేల రూపాయల్లో, కొన్ని లక్షల రూపాయలు డబ్బు చెల్లించాలని చెప్పడం సమాచారాన్ని కోరుతున్న వ్యక్తులను నిరుత్సాహపరచడమే అవుతుంది. మరో విధంగా చెప్పాలంటే బెదిరించడం అవుతుంది. సంబంధంలేని సమాచారం ఇవ్వకుండా సంబంధించిన సమాచారం ఇస్తే అంత మొత్తం అవసరం ఉండదు. దరఖాస్తులు జాగ్రత్తగా గమనించి అవసరమైన సమాచారాన్ని ఇవ్వడానికి ప్రయత్నించవచ్చు. కానీ ఆ అధికారులు ఉద్దేశం మరో విధంగా ఉన్నప్పుడు ఇలాంటి చర్యలనే వాళ్ళు తీసుకుంటారు. ఇలాంటి చర్యలు ఎండగట్టాలంటే సమాచార హక్కు చట్టం గురించి పూర్తి అవగాహన ఉండాలి. చట్టంలోని నిబంధనలను అర్థం చేసుకుంటే ప్రజా సమాచార అధికారులు తీసుకునే ఎలాంటి చర్యలనైనా అధిగమించే పరిస్థితి ఏర్పడుతుంది. సమాచారాన్ని ఎవరైనా కోరవచ్చు. ఎందుకు కోరుతున్నారో కారణం కూడా తెలియజేయాల్సిన అవసరం లేదు. దారిద్యరేఖకు దిగువన ఉన్న వ్యక్తులు సమాచారం పొందటానికి ఎలాంటి చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ విషయములను అర్థం చేసుకుంటే అన్ని ఆటంకాలను అధిగమించే అవకాశం ఉంటుంది అని వికారాబాద్‌ జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ సాయి చౌదరి వివరించారు. ప్రజలు ప్రభుత్వ చర్యల్లో పాల్గొనడం వల్ల ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ఎన్నికలు అప్పుడు మాత్రమే కాదు, రోజు వారి ప్రభుత్వ కార్యకలాపాల్లో పౌరులు పాల్గొనాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పాలసీలు, స్కీముల అమలు సక్రమంగా జరుగుతున్నవా అనే విషయం పరిశీలించాలి. ఇవి చేయాలంటే చట్టం పట్ల అవగాహన ఉండాలి. ఆ ప్రయత్నం అందరూ చేయాలి అని సాయి చౌదరి అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *