లక్నో ఏప్రిల్‌ 22: అసెంబ్లీ, పార్లమెంట్‌లో అడుగు పెట్టాలనే లక్ష్యంతో చాలా మంది ఎన్నికల్లో పోటీ చేస్తుంటారు. ఈ ఎన్నికల్లో కొందరు గెలుస్తుంటారు.. మరికొందరు ఓటమి పాలవుతుంటారు. ఓడిపోయిన వారు ఎలాంటి కుంగుబాటుకు గురికాకుండా మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుంటారు. ఓ 79 ఏండ్ల వ్యక్తి కూడా 98 సార్లు వివిధ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఏ ఒక్క ఎన్నికలో కూడా గెలవలేదు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో 99వ సారి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ అతని నామినేషన్‌ తిరస్కరణకు గురైంది.
వివరాల్లోకి వెళ్తే.. హస్నూరామ్‌ అంబేద్కరీ(79).. ఆగ్రా జిల్లాలోని ఖేరాగర్హ్‌లో జన్మించారు. 1985లో తొలిసారిగా ఖేరాగర్హ్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బీఎస్పీ అభ్యర్థిపై పోటీ చేశారు అంబేద్కరీ. ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు ఫతేపూర్‌ సిక్రి స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల్లో పోటీ చేయడం ఆయనకు ఇది 99వ సారి. ఇప్పుడు తాను గెలవనని తెలుసు. కానీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. చివరకు నామినేషన్‌ తిరస్కరణకు గురైంది అని అంబేద్కరి తెలిపారు.
1985 నుంచి ఇప్పటి వరకు గ్రామ్‌ ప్రదాన్‌, అసెంబ్లీ, గ్రామపంచాయతీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినట్లు అంబేద్కరీ తెలిపారు. గతంలో రాష్ట్రపతి ఎన్నికకు కూడా పోటీ చేశానని, కానీ తన నామినేషన్‌ తిరస్కరణకు గురైందని పేర్కొన్నారు.ఆగ్రా తహసీల్‌ ఆఫీసులో అంబేద్కరీ ప్రభుత్వ ఉద్యోగిగా పని చేశారు. 1984 ఎన్నికల్లో బీఎస్పీ టికెట్‌ ఇస్తానని చెప్పడంతో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. కానీ చివరకు ఖేరాగర్హ్‌ టికెట్‌ బీఎస్పీ అతనికి కేటాయించలేదు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. నీ భార్య కూడా నీకు ఓటేయదు అని అన్నారట. కానీ ఆ ఎన్నికల్లో అంబేద్కరీ మూడోస్థానంలో నిలిచారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *