నాలుగో సారి మంత్రి పెద్దిరెడ్డి సత్తా చాటుకుంటారా ?
ఉత్కంఠ గా మారిన పుంగనూరు రాజకీయ సవిూకరణాలు.
పుంగనూరు:పుంగనూరు నియోజకవర్గం అంటే రాష్ట్రంలోనే ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పాత్రను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని చెప్పుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల బరిలో వైకాపా తరపున రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తెలుగుదేశం పార్టీ తరఫున చల్లా రామచంద్రారెడ్డి, బీసీవై పార్టీ తరఫున ఆ పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్‌ లు నేటి వరకు బరిలో ఉన్నారు.
చివరకు వీరి పేర్లే ఖరారు అయితే అందరి పేర్లలోనూ రామచంద్ర ఉండడంతో ఈసారి ఏ రామచంద్రుడు విజయ శంఖం పూరిస్తాడో అని ప్రజలలో చర్చలు మొదలయ్యాయి. పుంగనూరు నియోజకవర్గం అంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేది.మాజీ ఎంపీ దివంగత నేత నూతన కాల్వ రామకృష్ణారెడ్డి ఓటమి ఎరుగని నాయకుడిగా, పుంగనూరు నుంచి పలుసార్లు ఎమ్మెల్యేగా, ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎంపీగా తెలుగుదేశం జెండా ఎగురవేశారు.
సదుం, పులిచెర్ల, రొంపిచర్ల మండలాలు పుంగనూరులో కలవడంతో ప్రస్తుత రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీలేరు నియోజకవర్గం వదిలి పుంగనూరు నుంచి బరిలో దిగారు. 2009 వ సంవత్సరం నుండి తెలుగుదేశంకు కంచుకోటలా ఉన్న పుంగనూరులో తన ఎదురులేని నాయకత్వ పఠిమతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మూడుసార్లు హ్యాట్రిక్‌ విజయం సాధించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున 84083 ఓట్లు, 2014 వైకాపా తరుపున 1,04587 ఓట్లు, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 1,07431 ఓట్లు సాధించి ప్రతిపక్ష అభ్యర్థులపై భారీ మెజారిటీతో పుంగనూరును వైయస్సార్‌ పార్టీ కంచుకోటగా మార్చేశారు.
ఇక ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ (2009) నుంచి గత మూడు పర్యాయాలు ఓటమి చెందింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు 2009 అసెంబ్లీ ఎన్నికల్లో 43356 ఓట్లు, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 72856 ఓట్లు, 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 63876 ఓట్లు సాధించింది. పుంగనూరులో అభ్యర్థి ఎవరైనా తెలుగుదేశం పార్టీకి 60 వేలకు పైగా ఓటు బ్యాంకు గ్యారెంటీ అని నిరూపించడానికి ఇది సంకేతం. ప్రస్తుతం పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా చల్లా రామచంద్రారెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు, గతంలో (1989) పీలేరు అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై పోటీ చేసిన అనుభవం, తండ్రి దివంగత మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ రెడ్డి వారసత్వం అనుచరగణం రాజకీయ పరంగా చల్లా బాబుకు కలిసొచ్చే అంశం. ప్రస్తుతం చల్లా రామచంద్రారెడ్డి ఎన్నికల మహాసంగ్రామానికి ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారనేది ఇన్చార్జి చల్లా బాబు నాయకత్వానికి పెద్ద సవాల్‌ గా మారనుంది. జనసేన మద్దతు జన సైనికుల సహకారం చల్లాబాబుకు ప్లస్‌ పాయింట్‌ కానుందా అనేది వేచిచూడాలి.
ఇక భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యువ నాయకుడు బోడే రామచంద్ర యాదవ్‌ పుంగనూరు నియోజకవర్గంలో తనదైన ముద్ర వేయాలని పావులు కదుపుతున్నారు. ఈయన గత 2019 అసెంబ్లీ ఎన్నికలో జనసేన తరఫున బరిలో దిగి 16,452 ఓట్లు సాధించారు. రాజకీయ అనుభవం లేకున్నా అంతుచిక్కని వ్యూహాలతో ప్రత్యర్థి నాయకులకు రాజకీయ సవాళ్లు విసురుతుంటారు. అధికార పక్షం నాయకులతో ప్రత్యక్ష యుద్ధమే చేస్తున్నారు. ఈసారి పుంగనూరు నుంచి బీసీవై పార్టీ అభ్యర్థిగా ఆయన బరిలో దిగనున్నారు. బోడే రామచంద్ర యాదవ్‌ కు ఢల్లీి స్థాయిలో, జాతీయ నేతలతో, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మంచి సంబంధాలు ఉండడం, యాదవ సామాజిక వర్గం, వై ప్లస్‌ కేటగిరి భద్రత కలిగి ఉండడం బోడె రామచంద్ర యాదవ్‌ కు కలిసొచ్చే అంశాలు. పుంగనూరు నియోజకవర్గంలో రామచంద్ర యాదవ్‌ ను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేరుగా ఢీకొట్టలేకపోతున్నారని, రామచంద్ర యాదవ్‌ తలపెట్టే అన్ని కార్యక్రమాలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన అధికార బలంతో, పోలీసును అడ్డుపెట్టుకుని తాను తలపట్టే కార్యక్రమాలకు అడ్డుకట్ట వేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇది నేటి వరకు పుంగనూరులో ముగ్గురు రామచంద్రుల రాజకీయ చిత్రం.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *