తిరుపతి, ఏప్రిల్‌ 17 (న్యూస్‌ పల్స్‌): ఉమ్మడి ఏపీలో జాక్‌ పాట్‌ సీఎం అంటే ముందుగా గుర్తొచ్చేది నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి. మూడుసార్లు ఎమ్మెల్యే.. ఆపై స్పీకర్‌ నుంచి ఏకంగా సీఎం అయ్యారు. వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి అకాల మరణంతో సీఎం పీఠంపై రోశయ్య కూర్చున్నారు. కానీ ఉమ్మడి ఏపీలో సామాజిక సవిూకరణలు చూసి కాంగ్రెస్‌ హై కమాండ్‌ కిరణ్‌ కుమార్‌ రెడ్డికి అవకాశం ఇచ్చింది. ఉమ్మడి ఏపీలో చివరి సీఎం కూడా ఆయనే. కానీ రాష్ట్ర విభజన, వైసీపీ ఆవిర్భావంతో కాంగ్రెస్‌ పార్టీ ప్రమాదంలో పడిరది. కిరణ్‌ రాజకీయ భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. చివరకు ఆయన బిజెపి గూటికి చేరాల్సి వచ్చింది. ప్రస్తుతం కిరణ్‌ రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వైసిపి సిట్టింగ్‌ ఎంపీ మిధున్‌ రెడ్డి నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు.గత పది సంవత్సరాలుగా రాజకీయంగా కిరణ్‌ తెరమరుగయ్యారు. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే తన చిరకాల ప్రత్యర్థిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిధున్‌ రెడ్డిని ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి రాజంపేట ఏమంత సేఫ్‌ జోన్‌ కాదు. ఇక్కడ బిజెపికి బలం అంతంత మాత్రమే. కేవలం టిడిపి బలంఫై ఆధార పడాల్సిందే. అటు తెలుగుదేశం పార్టీ సైతం గెలిచింది 25 సంవత్సరాల కిందటే. వైసీపీ ఆవిర్భావం నుంచి ఈ నియోజకవర్గ ఆ పార్టీకి పెట్టని కోటగా ఉంది. 2014లో కూటమి స్ట్రాంగ్‌ వేవ్‌ లో ఉన్నప్పుడు రాజంపేటలో కూటమి అభ్యర్థిగా పురందేశ్వరి పోటీ చేశారు. కానీ ఆమెపై మిధున్‌ రెడ్డి లక్ష డెబ్భై నాలుగు వేల ఓట్లతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో అయితే వైసిపికి రెండు లక్షల 68 వేల ఓట్ల మెజారిటీ దక్కింది. అటువంటి నియోజకవర్గం నుంచి కిరణ్‌ పోటీ చేయడం సాహసం అనే చెప్పాలి.రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లు వైసిపి చేతిలోనే ఉన్నాయి. అందులో పుంగనూరులో తన చిరకాల ప్రత్యర్థి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ పార్లమెంట్‌ స్థానానికి కూడా భారీ ఆధిక్యత వస్తుంది. మిగతా ఆరు నియోజకవర్గాల్లో సైతం వైసీపీ స్ట్రాంగ్‌ గా ఉంది. అయితే పూర్వాశ్రమంలో తనతో పాటు పనిచేసిన కాంగ్రెస్‌ నేతలు వైసీపీలోకి వెళ్లిపోయారు. వారి సహకారాన్ని కిరణ్‌ అర్ధిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కిరణ్‌ గెలవకూడదని పెద్దిరెడ్డి భావిస్తున్నారు. కానీ కిరణ్‌ మాత్రం గెలిచి కేంద్ర మంత్రి కావాలని అనుకుంటున్నారు. అందుకే ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. కిరణ్‌ హయాంలో రాజంపేట పార్లమెంట్‌ స్థానానికి పెద్ద ఎత్తున నిధులు వచ్చాయి. కాంగ్రెస్‌ నేతలకు అప్పట్లో స్వేచ్ఛ ఇచ్చారు. కిరణ్‌ కు మంచి పేరు కూడా ఉంది. అక్కడ పెద్దిరెడ్డి వ్యతిరేకులంతా ఏకమవుతున్నారు. కిరణ్‌ కు అండగా నిలబడుతున్నారు. అయితే రాజంపేట పార్లమెంట్‌ స్థానం వైసీపీకి మంచి బలమున్న సీటు. అక్కడ గాని కిరణ్‌ కుమార్‌ రెడ్డి గెలిస్తే కచ్చితంగా కేంద్రమంత్రి అవుతారు. అందుకే ఆయన సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మరి ఎంతవరకు సక్సెస్‌ అవుతారో చూడాలి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *