విశాఖపట్టణం, ఏప్రిల్ 16: 2014 ఎన్నికలు గుర్తున్నాయి కదూ. ఆ ఎన్నికల్లో వైయస్ విజయమ్మ విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె.. బిజెపి అభ్యర్థి కంభంపాటి హరిబాబు చేతిలో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 63 స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. అయితే రాష్ట్రంలో ఓడిపోయాం అనేదానికంటే.. విశాఖలో విజయమ్మ ఓటమిని వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోయాయి.అయితే ఆ ఎన్నికల్లో విజయమ్మ ఓటమికి అనేక అంశాలు పనిచేశాయి. ముఖ్యంగా కడప సంస్కృతి అన్న నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది.విశాఖ ఎంపీ స్థానం నుంచి ఎక్కువసార్లు కమ్మ సామాజిక వర్గం వారే ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. సుదీర్ఘకాలం గీతం కాలేజీల అధినేత ఎం వివిఎస్ సత్యనారాయణ, కంభంపాటి హరిబాబు, పురందేశ్వరి, ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ ఎంవీబీ సత్యనారాయణ.. వీరంతా కమ్మ సామాజిక వర్గం వారే. గత ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు భరత్. ఈ ఎన్నికల్లో కూడా మరోసారి పోటీ చేస్తున్నారు. ఈయన కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే. అటు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సుబ్బిరామిరెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఎంపీలుగా ఎన్నికయ్యారు. అదే ఆలోచనతో జగన్ తన తల్లి విజయమ్మను విశాఖ పార్లమెంట్ స్థానానికి నిలబెట్టారు. కానీ ఆమెపై జరిగిన విష ప్రచారంతో ఓడిపోయారు.కడప అంటేనే ఫ్యాక్షన్ సంస్కృతి ఉంటుందన్నది మిగతా ప్రాంతాల్లో ఒక అపవాదు. 2014 ఎన్నికల్లో విజయమ్మ పోటీ చేసే సమయంలో కడప ఫ్యాక్షనిజం విశాఖ రాబోతుందని టిడిపి తో పాటు అనుకూల విూడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఇది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. విజయమ్మ ఓటమికి కారణమైంది. గత ఎన్నికల్లో కూడా రాష్ట్రవ్యాప్తంగా జగన్ ప్రభంజనం వీచినా.. విశాఖ నగర ప్రజలు మాత్రం వైసీపీని తిరస్కరించారు. జగన్ విశాఖ రాజధానిని ప్రకటించిన అక్కడ ప్రజలు పెద్దగా స్వాగతించలేదు. దీనికి ముమ్మాటికీ కడప సంస్కృతి అన్న నినాదం ప్రజల్లోకి వెళ్లడమే కారణం.అయితే కడప సంస్కృతి అన్న నినాదం తెరపైకి తెచ్చే ఛాన్స్ వైసీపీకి వచ్చినా.. వినియోగించుకోవడం లేదు. ప్రస్తుతం అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా సీఎం రమేష్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా ఈ సీటు బిజెపికి కేటాయించగా.. ఆ పార్టీ సీఎం రమేష్ పేరును ఖరారు చేసింది. సీఎం రమేష్ సొంత జిల్లా కడప. గతంలో విజయమ్మ పై చేసిన ప్రచారం.. సీఎం రమేష్ పై కూడా చేయవచ్చు. కానీ ఇప్పటికే విశాఖ రాజధాని అంశం, ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా వైవి సుబ్బారెడ్డి ఉండడం, విశాఖలో రాయలసీమ నేతల ప్రాబల్యం పెరగడం వంటి కారణాలతో వైసిపి వెనక్కి తగ్గుతోంది. సీఎం రమేష్ పై కడప సంస్కృతి అన్న ముద్రవేస్తే.. తిరిగి అది వైసీపీకి ఇబ్బంది పెడుతుందని వారికి తెలుసు. అందుకే సీఎం రమేష్ విషయంలో కలుగచేసుకోవడం లేదు.