తిరుపతి, ఏప్రిల్‌ 1: వైసిపి సినీ పరిశ్రమకు దూరం పెట్టడానికి కారణం ఏంటి? ఆ వర్గం నుంచి ఒకరికి టికెట్‌ ఇవ్వకపోవడం దేనికి సంకేతం? సినీ పరిశ్రమ పవన్‌ వెంట వెళ్తుంది అన్న అనుమానమా? లేకుంటే వారు నెగ్గలేరన్నభయమా? ఏపీ పొలిటికల్‌ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. గతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులకు టికెట్లు దక్కేవి. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం పెద్దగా వారిని పరిగణలోకి తీసుకోలేదు. ఏ పార్టీ కూడా సినీనటులను బరిలో దింపలేదు. వైసీపీ నుంచి రోజా, టిడిపి నుంచి బాలకృష్ణ, జనసేన నుంచి పవన్‌ తప్పించి సినీ పరిశ్రమకు చెందిన ఒక్క వ్యక్తి పేరు కూడా ఎక్కడా కనిపించడం లేదు. గత ఎన్నికల్లో సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు వైసీపీకి అండగా నిలబడ్డారు. ఆ పార్టీ తరఫున ప్రచారం కూడా చేశారు. ఇప్పుడు ఆ హడావిడి కూడా లేదు. కనీసం ఎక్కడా స్పందించడం లేదు కూడా. దీంతో ఇది ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.గతంలో సినీ పరిశ్రమకు చెందిన వారిలో ఎక్కువమంది రాజకీయాల్లో కొనసాగే వారు. దాసరి నారాయణరావు, డి రామానాయుడు, సూపర్‌ స్టార్‌ కృష్ణ కుటుంబం, మురళీమోహన్‌, అంబికా కృష్ణ, కోట శ్రీనివాసరావు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది రాజకీయాల్లో సైతం ఎంట్రీ ఇచ్చారు. కొందరు ఎంపీలుగా గెలుపొంది కేంద్ర మంత్రులు కూడా అయ్యారు. అయితే ఎందుకో ఇప్పుడు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. రాష్ట్ర విభజన ఒక కారణం అయితే.. సినిమా యాక్టర్లకు పార్టీలు ప్రాధాన్యం ఇవ్వడం తగ్గించేశాయి. ఈ కారణంగానే సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు రాజకీయాల వైపు రావడం తగ్గించేశారు.సినీ పరిశ్రమకు చెందిన పవన్‌ కళ్యాణ్‌ ఏపీ రాజకీయాల్లో ఉన్నారు. ఒక పార్టీకి అధినేతగా కొనసాగుతున్నారు. దీంతో చాలామంది ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతున్న..పవన్‌ మాత్రం ప్రోత్సహించడం లేదన్న విమర్శ ఉంది. గత ఎన్నికల్లో జనసేన ఉన్న చాలా మంది సినీ పరిశ్రమ వ్యక్తులు వైసీపీకి సపోర్ట్‌ చేశారు. మోహన్‌ బాబు, అలీ, పోసాని కృష్ణ మురళి, 30 ఇయర్స్‌ ఇండస్ట్రీ పృథ్వి, విజయ్‌ చందర్‌, భానుచందర్‌ ఇలా చాలామంది వైసీపీకి బాహటంగానే మద్దతు తెలిపారు. ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. అయితే అప్పట్లో తెలంగాణలో కెసిఆర్‌ అధికారంలో ఉండడం, సినీ పరిశ్రమ హైదరాబాదులో కొనసాగుతుండడం వంటి కారణాలతోవారంతా వైసీపీ వైపు ఆసక్తి చూపారు.ఈ ఎన్నికల్లో మాత్రం అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఎన్నికలు వస్తే సినీ గ్లామర్‌ తో హంగామా నడవాలి. కానీ ఈ ఎన్నికల్లో అటువంటిదేవిూ కనిపించడం లేదు. ఏపీ రాజకీయాలంటేనే సినీ పరిశ్రమ వ్యక్తులు ఆసక్తి చూపడం లేదు. అయితే కొందరు తెర వెనుక మాత్రం సాయం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *