రాజమండ్రి, అక్టోబరు 2: చంద్రబాబు అరెస్టుతో టీడీపీ నాయకత్వ లేమి స్పష్టంగా కనిపిస్తుంది. పార్టీలో పరిస్థితులను చక్కదిద్దేందుకు భువనేశ్వరి బస్సు యాత్రకు సిద్ధమయ్యారు.టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు ఏపీ రాజకీయాలను మలుపు తిప్పింది. ఇన్నాళ్లు టీడీపీ వ్యవహారాలను ఒంటి చేత్తో చక్కబెట్టిన చంద్రబాబు జైలులో ఉండడంతో పార్టీలో పరిస్థితులు మారిపోయాయి. ఎంత మంది నేతలు ఉన్నా… ముందుండి నడిపే నాయకత్వ లేమి స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో టీడీపీ నేతలు… చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై భారం వేశారు. భువనేశ్వరి బస్సు యాత్రకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అక్టోబర్ మొదటి వారంలో బస్సు యాత్ర ప్రారంభం అవుతుందని సమాచారం. ఇప్పటికే పార్టీ సినియర్లు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ బస్సు యాత్ర, సభలు ఏర్పాటుచేసేందుకు నిర్ణయించారు. బస్సు యాత్రకు ‘మేలుకో తెలుగోడా’ అనే పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వారం రోజుల పాటు బస్సు యాత్ర సాగనుంది.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్‌తో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా దిల్లీలోనే ఉంటున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ న్యాయపరంగా కేసులను ఎలా ఎదుర్కొవాలనే దానిపై సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చలు చేస్తున్నారు. ఈ నెల 30న యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభించాలని లోకేశ్ భావించినా.. సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3కు వాయిదా పడటంతో…తన పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తే న్యాయవాదులతో చర్చలు జరపడం వీలు కాదనే భావనతో లోకేశ్ పాదయాత్రను వాయిదా వేసుకున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా సీఐడీ లోకేశ్ నోటీసులు ఇచ్చింది. అక్టోబర్ 4న విచారణకు హాజరవ్వాలని సీఐడీ సూచించింది. చంద్రబాబు జైల్లో ఉండటం, లోకేశ్ దిల్లీకే పరిమితం అవ్వడంతో టీడీపీకి నాయకత్వలేమి స్పష్టంగా కనిపిస్తుంది. ఢీలాపడిపోయిన టీడీపీ శ్రేణులను మళ్లీ యాక్టివ్ చేసేందుకు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి రంగంలోకి దిగుతున్నారు. చంద్రబాబు బయటకు వచ్చేంత వరకు టీడీపీని ఆమె నడిపించనున్నారు. ఇందుకోసం నారా భువనేశ్వరి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నారు.చంద్రబాబును అరెస్టును బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా టీడీపీ ప్రణాళికలు చేస్తుంది. బస్సు యాత్రతో టీడీపీలో పరిస్థితులను చక్కదిద్దేందుకు భువనేశ్వరి ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ ఆందోళనలు, ర్యాలీలలో పాల్గొంటున్న భువనేశ్వరి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా బస్సు యాత్ర ద్వారా వైసీపీ ప్రభుత్వంపై భువనేశ్వరి విమర్శల దాడికి సిద్ధమవుతున్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున చంద్రబాబు అరెస్టుకు నిరసనగా భువనేశ్వరి నిరహార దీక్ష చేపట్టారు.