ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ ఐ ఆర్) అంటే ఏమిటి ?
ఎఫ్ ఐ ఆర్ పట్ల ప్రతి పౌరునికి అవగాహన అవసరం
ఎఫ్‌ఐఆర్ తో రక్షణ చర్యలు, పోలీసులకు అందే మొదటి సమాచారం…
హైదరాబాదు మార్చ్ 14: పోలీస్ స్టేషన్ అంటే మనుషులలో అంతర్గత భయం. అందుకే ఏ సంఘటన జరిగినా ఫిర్యాదు చేయాలంటేనే భయపడుతుంటారు. ప్రజలు. ఎఫ్‌ఐఆర్ గురించి తెలుసుకుంటే మనకు అవసరమైన సందర్భాలలో ఎటువంటి భయాందోళనలు లేకుండా రక్షణ హక్కులను వినియోగించుకోవచ్చు. ఇతరులనుంచి ఎటువంటి హాని, ముప్పు లేకుండా జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు, మన హక్కులకు భంగం కలిగినప్పుడు, మన ఆస్తులు ధ్వంసం అయిన సంఘటనలో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. ఇది పౌరునిగా ప్రతి వ్యక్తి బాధ్యత. అయితే అత్యవసరమైన ఈ విషయంలో చదువు లేని వారితో పాటు, చదువుకున్న వారు కూడా సరైన అవగాహన కొరవడిన కారణంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించాలంటే భయపడుతున్నారు. అసలు ఎఫ్‌ఐఆర్ అంటే ఏమిటి…? ఇది మనకు ఎలా రక్షణ కల్పిస్తుంది అనే విషయాలపై అవగాహన పొందేందుకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ మెంబర్ సాయి చౌదరి తో ప్రత్యేక కథనం
ఎఫ్‌ఐఆర్ అంటే…
ఎఫ్ ఐ ఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. నేరానికి సంబంధించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు రాసుకునే సమాచార పత్రాన్ని ఎఫ్‌ఐఆర్ అంటారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 154 కింద దీనిని నమోదు చేస్తారు. సంఘటన జరిగిన తరువాత పోలీసులకు అందే మొదటి సమాచారం ఇందులో నమోదయి ఉంటుంది.
ఎఫ్‌ఐఆర్ ఎక్కడ నమోదు చేయాలి…
సంఘటన జరిగిన ప్రదేశం ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో అక్కడే ఫిర్యాదు చేయాలి. ఒకవేళ ఫిర్యాదు చేయదలుచుకున్న వారికి సంఘటన ఏ ప్రదేశంలో జరిగిందో సరైన సమాచారం లేకపోతే అందుబాటులోఉన్న ఏ పోలీస్ స్టేషన్లో నైనా ఫిర్యాదు చేయవచ్చు. నమోదు చేసిన కేసును ఏ ప్రాంతానికి చెందుతుందో ఆ ప్రాంతానికి బదిలీ చేసే బాధ్యత పోలీసులదే అని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సభ్యుడు సాయి చౌదరి పేర్కొన్నారు.
ఎవరు ఫైల్ చేయవచ్చు…
సంఘటన వల్ల నష్టపోయిన బాధితులు నేరం ఎలా జరిగింది. ఎవరు చేశారు, నేరం చేయడానికి కారణాలు, తదితర సమాచారం తెలిపిన వ్యక్తులు, ఇలాంటి సందర్భాలలో సమాచారం ఎలా తెలిసిందో పేర్కొంటూ ఫిర్యాదుదారులు ఎఫ్‌ఐఆర్ పై సంతకం చేయాల్సి ఉంటుంది.
ఎఫ్‌ఐఆర్ చేసే విధానము…
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (నేరా శిక్షాస్మృతి) 1973 లోని సెక్షన్ 154 కింద ఎఫ్‌ఐఆర్ ను నమోదు చేస్తారు. ఫిర్యాదుదారుడు మౌఖికంగా ఇచ్చిన సమాచారాన్ని పోలీసులు తప్పనిసరిగా రాసుకోవాల్సి వస్తుంది. ఆ తరువాత ఏం రాసుకున్నారో తప్పనిసరిగా ఫిర్యాదుదారునికి చదివి వినిపించిన తరువాత అతని వద్ద సంతకం తీసుకోవాలి. చదివి వినిపించమని అడిగే హక్కు ఫిర్యాదుదారునికి ఉంది. పూర్తిస్థాయిలో సంతృప్తి చెందిన తర్వాతే సంతకం చేయాలి. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తరువాత దాని నఖలును పొందవచ్చు. దీనికోసం ఎలాంటి రుసుము లేదు అని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ మెంబర్ సాయి చౌదరి అన్నారు
నేరం జరిగిన తర్వాత ఎంతకాలంలో ఫిర్యాదు చేయాలి…
ఎఫ్‌ఐఆర్ ను నమోదు చేయడానికి కాల పరిమితి అంటూ లేదు. కానీ ఫిర్యాదు ఆలస్యమైన కొద్దీ కేసులో సాక్ష్యాధారాలు బలహీనపడే అవకాశం ఉంటుంది. వీలైనంత త్వరగా నేరం జరిగిన గంటలో ఫిర్యాదు చేస్తే పోలీసులకు తగిన సాక్ష్యాధారాలు లభించి నిందితులకు శిక్ష పడే అవకాశం ఉంటుంది.
ఫిర్యాదు రాతపూర్వకంగానే ఉండాలా…
ఫిర్యాదు రాతపూర్వకంగా కానీ, మౌఖికంగా కానీ ఉండవచ్చు. ఫోన్ ద్వారా అందించిన సమాచారాన్ని కూడా ఎఫ్‌ఐఆర్ గా పరిగణించవచ్చు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 154 ప్రకారం ఎఫ్‌ఐఆర్ రాతపూర్వకంగానే ఉండాలన్న నిబంధన లేదు. మౌఖికంగా చెప్పిన సమాచారాన్ని పోలీసులు రాసుకోవాలి. తరువాత సమాచారం అందించిన వ్యక్తికి చదివి వినిపించి సంతకం తీసుకోవాలి. రాతపూర్వకంగానే ఫిర్యాదు చేయాలనే అధికారం పోలీసులకు లేదు. భారతీయ శిక్షాస్మృతిలో నేరాలకు సంబంధించి సెక్షన్లు తెలిస్తే పేర్కొనవచ్చు. ఒకవేళ మంచి ఆర్థిక స్తోమత ఉన్నవారైతే ఫిర్యాదుకు ముందు లాయర్ ను సంప్రదించటం మంచిది. ఫిర్యాదు చేసినప్పుడు కచ్చితంగా నఖలును తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఫిర్యాదు చేసే సమయంలో తప్పనిసరిగా చట్టపరమైన భాషనే వాడాలని నిబంధన కూడా లేదు. మన వాడుక భాషలో కూడా రాయవచ్చు అని మాజీ లోక్‌అదాలత్ బెంచ్ మెంబర్ సాయి చౌదరి పేర్కొన్నారు.
ఎఫ్ ఐ ఆర్ నమోదు తర్వాత…
ఎఫ్‌ఐఆర్ నమోదు తర్వాత పోలీసులు కేసుకు సంబంధించిన పరిశోధన మొదలు పెడతారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తొమ్మిది రోజుల్లోపు చార్జిషీటును నింపాలి. ఆరు నెలలలోపు విచారణ ప్రారంభించాలి. ఆరు నెలల లోపు కేసులో పరిశోధన మందకొడిగా సాగుతుందనిపిస్తే జిల్లా కోర్టులో కేసు వేయవచ్చు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ఆరు నెలలకు కూడా చార్జిషీటును తయారు చేయకపోతే డిప్యూటీ సూపరింటెండెంట్, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ)తోపాటు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికు కూడా రాతపూర్వకంగా విన్నవించుకోవచ్చు. ఒకసారి ఎఫ్‌ఐఆర్ నమోదైన తరువాత దానిని మార్చేందుకు వీలుండదు. ఎఫ్‌ఐఆర్ ని మార్చే అధికారం కేవలం కోర్టుకు మాత్రమే ఉంది అని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ మెంబర్ సాయి చౌదరి అన్నారు.
ఫిర్యాదును తీసుకునేందుకు నిరాకరిస్తే…
ఫిర్యాదును తీసుకునేందుకు నిరాకరించిన అధికారిపై ఫిర్యాదును జిల్లా ఎస్పీకి పంపాలి. దీని వెంట తామ పోలీస్ స్టేషన్ లో చేయదలుచుకున్న ఫిర్యాదు కాఫీని కూడా జత చేయాలి. ఇలా పంపేటప్పుడు కొరియర్లో కాకుండా రిజిస్టర్ పోస్టులో పంపితే ఫిర్యాదు అందిన తరువాత విూకు ఎకనాలెడ్జ్మెంట్ కార్డు అందుతుంది. బాధితులు పై స్థాయిలోని పోలీసు అధికారులను కలిసి విూరు చేసిన ఫిర్యాదును వారి దృష్టికి తీసుకురావచ్చు. ఉన్నతాధికారులు విూ ఫిర్యాదు సరి అయినదిగా భావిస్తే స్వయంగా విచారణ జరపడం కాని, ఇందుకోసం ప్రత్యేక పోలీసు అధికారిని నియమించడం కానీ చేస్తారు. జరిగిన నేరం ఏ కోర్టు పరిధిలోకి వస్తుందో ఆ కోర్టులో కూడా వ్యక్తిగతంగా ఫిర్యాదును నమోదు చేయవచ్చు. పోలీసులు విూ ఫిర్యాదు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మానవ హక్కుల సంఘం రాష్ట్ర శాఖకు, జాతీయ శాఖకు కూడా ఫిర్యాదు చేసే వీలుంది. నేర శిక్షాస్మృతిలోని 161 ప్రకారము బాధితుని స్టేట్ మెంట్ ను పోలీసులు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. నేరానికి సంబంధించిన అన్ని కేసుల్లోనూ ఈ స్టేట్ మెంట్ ను రికార్డు చేసుకుని రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత కేసులో పరిశోధన జరపక పోవడానికి గల కారణాలను కచ్చితంగా తెలియజేయాలి అని సాయి చౌదరి తెలిపారు.
ఎఫ్‌ఐఆర్ మార్చవచ్చా…
చార్జి షీట్ ను నింపకముందు ఏ సమయంలోనైనా ఎఫ్‌ఐఆర్ ను మార్చేందుకు వీలుంటుంది. కేసులో తీవ్రతను తగ్గించే వీలులేదు, కానీ కేసును మరింత బలంగా చేయడానికి సెక్షన్లను చేర్చే వీలుంటుందని సాయి చౌదరి తెలిపారు.
తప్పుడు సమాచారం ఇస్తే శిక్ష తప్పదు…
ఎవరైనా ఫిర్యాదుదారుడు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలితే భారతీయ శిక్షాస్మృతి 1860 ప్రకారం సెక్షన్ 203 ప్రకారం శిక్షార్హుడు. నేరానికి సంబంధించిన సమాచారం దాచటం, ఆధారాలను నాశనం చేయడం వంటి చర్యలు ఈ శిక్షకు వర్తిస్తాయి. ఇలా చేసిన వారిని దోషులుగా గుర్తించి వీరిపై కేసు నమోదు చేస్తారు. నేరానికి సంబంధించి అసంపూర్ణమైన సమాచారం ఇవ్వకూడదని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సభ్యుడు సాయి చౌదరి పేర్కొన్నారు.
ఉండాల్సిన వివరాలు…
ఫిర్యాదుదారుని పేరు, చిరునామా, బాధితుల సమాచారము ఫిర్యాదు చేయడానికి విూకున్న హోదా లేదా అధికారం, సంఘటనకు సంబంధించిన సమయము, రోజు, స్థలము లాంటి వివరాలు, నేరం ఎలా జరిగింది, ఎందుకు చేశారు లాంటి పక్కా సమాచారం ఉండాలి. నేరంలో పాల్గొన్న వ్యక్తుల సమాచారం తెలిస్తే వ్యక్తుల పేర్లు, లేకపోతే వారిని గుర్తించేందుకు అవసరమైన పోలికలు, దొంగతనం లాంటి కేసుల్లో పోయిన వస్తువుల విలువ, ఇతర వివరాలు, నేరస్తులు వదిలిన వస్తువులు, దొంగతనం వంటి సంఘటనలో పోయిన వస్తువుల వివరాలు, వాటి విలువ, సంఘటనలో గాయపడితే చికిత్స పొందుతున్న ఆసుపత్రి పేరు, మెడికల్ సర్టిఫికెట్ జతచేయాలని మాజీ లోక్‌అదాలత్ బెంచ్ మెంబర్ సాయి చౌదరి అన్నారు.
కాగ్నిజబుల్ ఆఫెన్స్ అంటే…
కేసు తీవ్రతను బట్టి పోలీసులు వారెంట్ లేకుండా ఎవరినైనా అరెస్టు చేయవచ్చు. కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండానే ఇటువంటి కేసుల్లో పోలీసులు సొంత పరిశోధన ప్రారంభించవచ్చు. ఉదాహరణకు ఇంటిని కూల్చివేయడం, దొంగతనం, డెకాయిటి, మోసం, హత్యయత్నం, హత్య, క్రిమినల్ ఆఫ్ ట్రస్ట్ మొదలైనవని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సభ్యుడు సాయి చౌదరి తెలిపారు.