విజయవాడ, మార్చి 11 : కాంగ్రెస్‌ పార్టీకి దక్షిణాదిలో సూపర్‌ స్టార్‌ అంటూ ఎవరైనా ఉన్నారంటే అది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాత్రమే. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన రేవంత్‌ రెడ్డికే ఇటు ప్రజలలో, అటు పార్టీ అధిష్ఠానం దృష్టిలో కూడా మంచి మార్కులు పడ్డాయి. ఆయనకు తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలను అధిష్ఠానం అప్పగించిన తరువాత పార్టీలో ఒక్కసారిగా అసమ్మతి భగ్గుమని లేచింది. పార్టీ సీనియర్లంతా తమతమ విభేదాలను పక్కన పెట్టి మరీ ఐక్యంగా రేవంత్‌ ను వ్యతిరేకించారు. రాజీనామాల హెచ్చరికలకు కూడా వెనుకాడలేదు. అయితే నెమ్మది నెమ్మదిగా రేవంత్‌ తన కలుపుగోరు తీరుతో సీనియర్లందరినీ కలుపుకుని ముందుకు సాగారు. అదే సమయంలో అప్పటి అధికార బీఆర్‌ఎస్‌ పై విమర్శల దూకుడును మరో రేంజ్‌ కు తీసుకు వెళ్లారు. అప్పటి వరకూ ఎన్నిక ఏదైనా కాంగ్రెస్‌ ఓటమి ఖాయం అన్నట్లుగా ఉండే పరిస్థితి మారింది. డీలా పడిన కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్‌ పెరిగింది. రేవంత్‌ పని తీరు చూసిన తరువాత పార్టీలో విజయంపై ఆశ మొలకెత్తింది. దీంతో పార్టీలో అసమ్మతి రాగాలు సద్దుమణిగాయి. ఒకసారి టీపీసీసీ అధ్యక్షుడిగా కుదురుకున్న తరువాత రేవంత్‌ అప్పటి అధికార బీఆర్‌ఎస్‌ అవినీతిని ఎండగట్టడంపై దృష్టి పెట్టారు. అప్పటి వరకూ కేసీఆర్‌ వాగ్ధాటి ముందు కాంగ్రెస్‌ నేతలు తేలిపోతున్నారా అనిపించే పరిస్థితి మారింది. కేసీఆర్‌ కు దీటుగా రేవంత్‌ తన వాక్పటిమతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు.ఒక సారి పార్టీ విజయం సాధిస్తుందన్న నమ్మకం కలిగిన తరువాత సీనియర్‌ నేతలంతా తమ గొంతు సవరించుకుని రేవంత్‌ తో కలిసి నడిచారు. ఎవరినీ నొప్పించకుండా, అలాగని ఎక్కడా తగ్గకుండా టీపీసీసీ చీఫ్‌ గా రాష్ట్ర పార్టీని ఏకతాటిపైకి తీసుకురావడంలో సక్సెస్‌ అయిన రేవంత్‌ రెడ్డి, ఆ తరువాత ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా తనదైన ముద్ర వేశారు. మొహమాటాలకు తావివ్వకుండా కచ్చితంగా గెలుపు గుర్రం అయితేనే రంగంలోకి దింపాలన్న కండిషన్‌ తో అధిష్ఠానాన్ని కన్విన్స్‌ చేయగలిగారు. దీంతో విపక్షంలో ఉండి కూడా అసెంబ్లీ ఎన్నికలలో అభ్యర్థుల ఎంపిక విషయంలో పెద్దగా సమస్యలు లేకుండానే కాంగ్రెస్‌ కసరత్తు పూర్తి చేసింది. ఇక ఆ తరువాతి నుంచి ఎన్నికల ప్రచార బాధ్యతలన్నీ దాదాపు ఒంటి చేత్తో రేవంత్‌ మోశారు. సీనియర్లంతా తమతమ నియోజకవర్గాల్లో గెలవడంపైనే దృష్టినంతా కేంద్రీకరించే పరిస్థితుల్లో ఉండే రేవంత్‌ ఒక్కడే సుడిగాలిలా రాష్ట్రమంతా చుట్టేశారు.సరే కాంగ్రెస్‌ విజయం తరువాత ముఖ్యమంత్రిగా రేవంత్‌ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు రెండు రోజుల పాటు హై డ్రామా నడిచినా, ఉత్తమ్‌, భట్టి మేం రేసులో బలంగా ఉన్నామంటూ ముందుకు వచ్చినా రేవంత్‌ మాత్రం ఎక్కడా సంయమనం కోల్పోకుండా నిబ్బరంగా ఉన్నారు. అధిష్ఠానం చివరకు రేవంత్‌ ను సీఎంగా ఎంపిక చేసింది. ఇక కేబినెట్‌ కూర్పు నుంచి ప్రతి విషయంలోనూ రేవంత్‌ సమష్టి బాధ్యతను విస్మరించలేదు. సీఎం పదవి కోసం తనతో పోటీ పడిన వారికి కీలక మంత్రిపదవులు కట్టబెట్టడం ద్వారా టీం కాంగ్రెస్‌ స్ఫూర్తిని పార్టీ క్యాడర్‌ లోనూ, నాయకులలోనూ నింపడంలో సఫలీకృతులయ్యారు. అటు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు విషయంలోనూ తనదైన మార్క్‌ చూపి ప్రజలలోనూ మంచి మార్కులు కొట్టేశారు. అత్యంత ప్రతికూల పరిస్థితులను సానుకూలంగా మార్చుకుని తెలంగాణలో కాంగ్రెస్‌ నే రేవంత్‌ అధికారంలోకి తీసుకువచ్చిన తీరు ఆయన ప్రత్యర్థులను సైతం అచ్చెరువందేలా చేసింది. దీంతో సహజంగానే రేవంత్‌ నాయకత్వ సమర్ధతపై అధిష్ఠానం నమ్మకం పెరిగింది. దీంతో త్వరలో జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో కూడా రేవంత్‌ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని భావిస్తోంది. అందుకే ఏపీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలతో పాటే జరగనున్నాయి. అంటే ఒక వైపు తెలంగాణ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక లోక్‌ సభ స్థానాలలో గెలుచుకునేలా పార్టీని నడిపిస్తూ, ప్రచార బాధ్యతలు మోస్తూ, అదే సమయంలో ఏపీలో కూడా విస్తృతంగా ప్రచారం చేయాల్సిన గురుతర బాధ్యతను పార్టీ హై కమాండ్‌ రేవంత్‌ భుజస్కంధాలపై పెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీ ఎన్నికలలో కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ రేవంత్‌ రెడ్డే అని అధిష్ఠానం చెప్పకనే చెప్పింది.తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం వెనుక రేవంత్‌ స్పీడ్‌, అందరినీ కలుపుకుపోయే తత్వం, ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసే వాగ్ధాటి కీలకం అని భావిస్తున్న అధిష్ఠానం ఇప్పుడు ఏపీలో పార్టీని ఎన్నికల యుద్ధంలో ముందుండి నడిపించాల్సిన బాధ్యతను కూడా రేవంత్‌ కు కట్టబెట్టింది. అధిష్ఠానం నిర్ణయంతో ఏపీ కాంగ్రెస్‌ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత తొలి సారిగా మార్చి15 న ఏపీలో పర్యటించనున్నారు. ఆ రోజు విశాఖపట్నంలో కాంగ్రెస్‌ నిర్వహించనున్న బహిరంగ సభకు రేవంత్‌ రెడ్డి హాజరై ప్రసంగించనున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *