సిద్దిపేట ఫిబ్రవరి 28 ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ కలిగిన వ్యక్తులు సైతం గుండెపోటు, గుండె స్తంభించిపోవడం (కార్డియాక్‌ అరెస్టు) వంటి సమస్యలకు గురై మరణించడం చూస్తుంటాం. నిత్యం వ్యాయామం చేస్తూ., పౌష్టికాహారము తీసుకుంటూ ఫిట్నెస్‌ తో ఉండేవారు సైతం గుండె సమస్యల బారిన పడుతుంటారు. ఇలాంటి సందర్భాలలో కుటుంబ సభ్యులు లేదా చుట్టుపక్కల వారు అవగాహనతో మెలిగి… సిపిఆర్‌ చేస్తే ప్రాణాపాయ పరిస్థితులను అధిగమించవచ్చని అని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్‌ లిల్లీ మేరి అన్నారు.
ఏఈడి అందుబాటులో ఉంచుకోవాలి:
విదేశాలలో జిమ్ములు, పెద్ద పెద్ద రెస్టారెంట్లు, హోటల్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో ‘ఆటోమేటెడ్‌ ఎక్స్టర్నల్‌ డీఫి బ్రిలేటర్‌’ (ంఇఆ) అనే చిన్నపాటి పరికరాలు అందుబాటులో ఉంటాయి. వీటి ద్వారా గుండెపోటు, కార్డియాక్‌ అరెస్ట్‌, ఇతర గుండె సమస్యలకు గురైన వ్యక్తులకు ఏఈడి ద్వారా షాక్‌ ఇస్తారు. ఇలా చేస్తే వెంటనే గుండెపోటు, కార్డియాక్‌ అరెస్టు నుండి కోలుకునే అవకాశం 60 నుంచి 65% వరకు ఉంటుంది అని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్‌ లిల్లీ మేరి అన్నారు.
కార్డియాక్‌ అరెస్టు లక్షణాలు:
తల తిరగటం, అలసటగా అనిపించడం, గుండెల్లో దడ, చాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, స్పృహ కోల్పోవడం.
సిపిఆర్‌ ఇలా…
గుండెపోటుకు గురైన లేదా ఆకస్మాత్తుగా కుప్పకూలి గుండె ఆగిపోయిన (కార్డియాక్‌ అరెస్టు అయిన) వ్యక్తికి కార్డియో పల్మనరీ రిసస్‌ సిటేషన్‌ (సిపిఆర్‌) చేయడం ద్వారా గుండెను మళ్లీ స్పందించేలా చేయవచ్చు. వ్యక్తి స్పృహ తప్పి పడిపోయిన మూడు నాలుగు నిమిషాలలో సిపిఆర్‌ చేయడం వల్ల ప్రాణాపాయము నుండి బయటపడటానికి 60 నుంచి 70 శాతం వరకు అవకాశం ఉందని సాయి చౌదరి చెప్పారు. సిపిఆర్‌ ప్రక్రియలో భాగముగా గుండె విూద చేతులతో లయబద్ధంగా వెంట వెంటనే తగినంత ఒత్తిడితో నొక్కాలి. తరువాత గుండె కండరాలన్నింటినీ ఉత్తేజితం చేసి మెదడుకు అవసరమైన రక్తము మళ్లీ అందేలా చేయవచ్చు. ఓ వైపు సిపిఆర్‌ చేస్తూనే 108కు ఫోన్‌ చేసి ఆంబులెన్స్‌ ను రప్పించి ప్రాథమిక చికిత్స అందిస్తూ ఆసుపత్రికి తరలిస్తే బాధితులు బతకడానికి అవకాశాలు ఉంటాయి అని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్‌ లిల్లీ మేరి పేర్కొన్నారు.
వైద్య పరీక్షలు చేయించుకోవాలి..
40 ఏళ్ల వయసు దాటిన ప్రతి ఒక్కరూ బీపీ, షుగర్‌ వంటి పరీక్షలతో పాటు కొలెస్ట్రాల్‌, గుండె పనితీరుకు సంబంధించిన పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. కుటుంబములో పూర్వీకులు ఎక్కువగా గుండెపోటుతో మరణించిన దాఖలాలు ఉంటే అలాంటివారు జాగ్రత్త పడాలి. రెండేళ్లకొకసారి ఈసీజీ, ఎకో, థ్రెడ్‌ మిల్‌ లేదా స్ట్రెస్‌ టెస్టులు చేయించుకోవాలి. కఠిన వ్యాయామాలు చేసే వారికి గుండె రక్తనాళాలల గోడలలో చీలిక ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది గుండెపోటు లాంటి ప్రమాదానికి దారి తీయవచ్చు. దీనిని డిఫెక్షన్‌ అంటారు. కొవ్వు కణాలతో ఏర్పడిన ‘ఫ్లాక్‌’ పైన పగుళ్ళు ఏర్పడటం వల్ల రక్తము గడ్డ కట్టి, అది రక్త ప్రవాహానికి అడ్డంకిగా మారి గుండెపోటుకు కారణం కావచ్చు. ప్రోటీన్‌`సి, ప్రోటీన్‌`ఎస్‌, యాంటీ త్రాబిన్‌`3 తగ్గటం వంటి లోపాలు ఉన్నవారిలో ఈ తత్వము ఉంటుంది. అలాగే హోమో సిస్టిన్‌ అనే జీవ రసాయనం రక్తంలో ఎక్కువగా ఉన్న వారిలోనూ క్లాట్‌ ఏర్పడే గుణము ఎక్కువ అని డాక్టర్‌ లిల్లీ మేరి పేర్కొన్నారు.
కఠిన వ్యాయామాలు వద్దు…
కొన్ని సందర్భాలలో గుండెలయ తప్పటం వల్ల రక్త ప్రసరణ క్రమం తప్పుతుంది. ఒక్కోసారి రక్త ప్రసరణ పూర్తిగా ఆగిపోతుంది. ఇది ఆకస్మిక గుండె మరణానికి దారితీస్తుంది. సాధారణంగా వెంట్రిక్యులర్‌ ఫైబ్రిలేషన్‌ కారణముగా కార్డియాక్‌ అరెస్టు సంభవిస్తుంది. ఎగువ గదులలో (కర్ణిక)ని అరిద్మియా వల్ల కూడా గుండె కొట్టుకోవడం ఒక్కోసారి ఆగిపోతుంది. సినోట్రియల్‌ నోడ్‌ సరైన విద్యుత్‌ ప్రేరణలను పంపనప్పుడు కర్ణికలో దడ ప్రారంభమవుతుంది. ఫలితముగా జఠరికలు శరీరానికి సమర్థవంతముగా రక్తాన్ని పంపవు. 40 సంవత్సరములు పైబడిన వారు ఎవరైనా సరే కఠిన వ్యాయామాలకు దూరముగా ఉండాలి. ఈ వయసులో ఉన్న వారు జిమ్ములకు వెళ్లి వ్యాయామాలు మొదలుపెట్టే ముందు వైద్య పరీక్షలు చేయించుకోవాలి. లేదంటే కఠిన వ్యాయామాలు చేసినప్పుడు అప్పటికే లోపల ఉన్న సమస్యలు జఠిలమై కార్డియాక్‌ అరెస్టు కావడానికి ఆస్కారం ఉందని అని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్‌ లిల్లీ మేరి తెలిపారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *