గుంటూరు, ఫిబ్రవరి 28: ఏపీ హైకోర్టులో అమరావతి రైతులకు ఊరట లభించింది. రైతులకు ఇచ్చిన ప్లాట్లను రద్దు చేస్తూ జారీ చేసిన నోటీసులను హైకోర్టు కొట్టివేసింది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు గతంలో సీఆర్డీయే ప్లాట్లు ఇచ్చింది. ప్లాట్లను రద్దు చేస్తూ 862 మంది రైతులకు సీఆర్డీఏ, రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ప్లాట్ల రద్దు, సీఆర్‌డీఏ చట్టం, మాస్టర్‌ ప్లాన్‌కు విరుద్ధమని నోటీసులను సవాల్‌ చేస్తూ పలువురు రైతులు హైకోర్టుకు వెళ్లారు. అయితే సీఆర్డీఏ చట్టంలో మార్పులు చేశామని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ఆదినారాయణరావు, ఇంద్రనీల్‌ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం.. కమిషనర్‌, డిప్యూటీ తహసీల్దార్‌ ఇచ్చిన నోటీసులు చెల్లవని స్పష్టం చేసింది. ఈ క్రమంలో నోటీసులు, ప్రొసీడిరగ్స్‌ రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.గతంలో భూసవిూకరణ కింద రాజధాని కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతులకు అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్లాట్లు కేటాయించింది. వీటిని రద్దు చేస్తూ మొత్తం 862 మందికి సీఆర్డీయే కమిషనర్‌ నోటీసులు జారీ చేశారు. దీన్ని సవాల్‌ చేస్తూ సదరు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. సీఆర్డీయే చట్టం కింద భూసవిూకరణలో ఇచ్చిన ఫ్లాట్లను రద్దు చేయడంపై వాదనలు జరిగాయి. ఈ ప్లాట్ల రద్దు సీఆర్డీయే చట్టానికి విరుద్దమని న్యాయవాది ఇంద్రనీల్‌ బాబు వాదనలు వినిపించారు. అసలు సీఆర్డీయే మాస్టర్‌ ప్లాన్‌ కు విరుద్దంగా కమిషనర్‌ ఈ నోటీసులు జారీ చేశారని వాదించారు. ప్రభుత్వం మాత్రం సీఆర్డీయే చట్టంలో మార్పులు చేశామని, కాబట్టి ఈ నోటీసులు చెల్లుతాయని వాదించింది. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు .. సీఆర్డీయే కమిషనర్‌ రైతులకు ఫ్లాట్లు రద్దు చేస్తూ ఇచ్చిన నోటీసుల్ని రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. దీంతో రైతులకు భారీ ఊరట దక్కినట్లయింది. ఇప్పటికే రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఫ్లాట్ల కేటాయింపు సక్రమంగా లేకపోవడంతో పాటు వారికి కౌలు కూడా దక్కడం లేదు. రాజధానిగా అమరావతిని ప్రకటించినప్పుడు ఎందరో రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారు. కొందరు ఇవ్వడానికి విముఖత చూపారు. ప్రభుత్వం ల్యాండ్‌పూలింగ్‌ విధానాన్ని ప్రకటించింది. ప్రతిఫలంగా సదరు రైతులకు నిర్ణయించిన ధర ఇచ్చేందుకు చర్యలు తీసుకుంది. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే ల్యాండ్‌పూలింగ్‌ భూముల్లో అమరావతికి భూములిచ్చిన రైతులకు స్థలాల కేటాయింపు జరిగింది. ఇంతలో ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. రిజిస్ట్రేషన్‌ కాని ఆ స్థలాలను ఉపయోగించుకోవడానికి, అవసరాలకు అమ్ముకోవడానికి లేకుండా పోతోందంటూ, వాటిని మార్చి ఇవ్వాలని వైసీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి రైతులు సీఆర్డీఏ అధికారులను వేడుకొంటున్నారు. ఈ నాలుగున్నరేళ్లలో స్పందించని రాష్ట్రప్రభుత్వం, సీఆర్డీఏ ఉన్నట్టుండి ఇప్పుడు సదరు ప్లాట్లు రద్దుచేసుకోవాలని, వేరేచోట ప్లాట్లు కేటాయిస్తామని నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులు చట్ట విరుద్ధం కావడంతో కోర్టు కొట్టి వేసింది

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *