విజయవాడ, ఫిబ్రవరి 22: ఏపీలో నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందని ఏపీసీసీ చీఫ్‌ షర్మిల మండిపడ్డారు. దగా డీఎస్సీ కాదు.. మెగా డీఎస్సీ నిర్వహించాలన్న డిమాండ్‌ తో కాంగ్రెస్‌ గురువారం తలపెట్టిన ‘ఛలో సెక్రటేరియట్‌’నిరసన కార్యక్రమంలో నేతలను అడ్డుకోవడంతో విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. షర్మిల సహా ఇతర నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ క్రమంలో ఆమె ఆంధ్ర రత్న భవన్‌ వద్దే బైఠాయించి నిరసన తెలుపుతూ.. ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డిగ్రీలు, పీజీలు చదివిన చాలా మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. దాదాపు 21 వేల మంది బిడ్డలు ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకున్నారని ఓ సర్వేలో తేలినట్లు షర్మిల చెప్పారు.ఉద్యోగాల భర్తీ పేరిట కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని షర్మిల మండిపడ్డారు. ‘5 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు 1.43 లక్షల ఉద్యోగాలు పెండిరగ్‌ లో పెట్టి దిగిపోయారు. ఆ తర్వాత జగనన్న 2.3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. 25 వేల టీచర్‌ పోస్టులు ఖాళీలు ఉంటే.. 7 వేల ఉద్యోగాలు ఎందుకు ఇస్తున్నారు.? 7 వేల ఉద్యోగాలూ ఇవ్వలేదని చంద్రబాబును నాడు విూరు అడగలేదా.? ఆ మాటలు ఇవాళ విూకు వర్తించవా.? నిరుద్యోగులపై విూకు దయ లేదా.? మెగా డీఎస్సీ కాకుండా దగా డీఎస్సీ ఇచ్చారు. పట్టపగలే పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు వారి కార్యకర్తలకు ఇచ్చారు. ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామన్న ఉద్యోగాలేవీ.?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.నిరుద్యోగులకు మద్దతుగా కాంగ్రెస్‌ పార్టీ నిరసన చేస్తే పాపమా..?
ఎన్‌ఎస్యూఐ నేతలను గత పది రోజులుగా ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. ఛలో సెక్రెటేరియట్‌ కు ఇన్ని ఆంక్షలు ఎందుకు..?, ఇక్కడ జగన్మోహన్‌ రెడ్డి గారి రాజ్యాంగం నడుస్తుందా..? జర్నలిస్టులను గొడ్డును బాదినట్టు బాదుతున్నారు. ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న మమ్మల్ని అడ్డుకోవడం ఎంత వరకు న్యాయం. గత రెండు రోజులుగా పోలీసులు హై అలర్ట్‌ లో ఉండి మమ్మల్ని నియంత్రిస్తున్నారు. పోలీసులను విూరు బంటుల్లా వాడుకుంటారా.? విూకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మేము ఆందోళన చేస్తే విూరు నియంత్రియాల్సిన అవసరం ఏముంది.?. జాబ్‌ నోటిఫికేషన్ల వరద పారిస్తామని చెప్పిన జగనన్న.. ఒక్క జాబ్‌ క్యాలెండర్‌ అయినా ఇచ్చారా..? ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. బాబు పోవాలి జాబ్‌ రావాలన్న నినాదం విూది కాదా.?’ అని ప్రభుత్వంపై షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు. వైఎస్‌ మెగా డీఎస్సీ వేసి ఉద్యోగాలు భర్తీ చేశారని.. ఆయనకు, జగనన్నకు చాలా తేడా ఉందని అన్నారు. 6 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పడానికి సిగ్గుండాలంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. నవరత్నాలు, జాతిరత్నాలు ఏమయ్యాయని నిలదీశారు. ఐదేళ్ల కాలంలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో వైట్‌ పేపర్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఎంత అడ్డుకున్నా ‘ఛలో సెక్రటేరియట్‌’ చేసి తీరుతామని స్పష్టం చేశారు.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *