విజయవాడ, ఫిబ్రవరి 22: పొత్తులే కత్తులు అవుతున్నాయా? సీట్ల సర్దుబాటే.. తలపోటుగా మారుతోందా? టీడీపీ`జనసేన అభ్యర్థుల ప్రకటనలో ఆలస్యానికి కారణమేంటి? రెండు పార్టీల మధ్య అవగాహన కుదరిందని చెబుతున్న అగ్రనాయకత్వం.. అడుగు ముందుకు వేయలేకపోతోందెందుకు? అసలు టీడీపీ`జనసేన మధ్య పొత్తు.. పైకి కనిపించినంత సాఫీగా ఉందా? అంతర్గతంగా ఆపసోపాలు పడుతోందా? రెండు పార్టీల మధ్య బీజేపీ ఏమైనా చిచ్చుపెడుతోందా?పైకి పొత్తులు.. లోపల కత్తులు?? టీడీపీ`జనసేన కూటమి కథలో అసలు ట్విస్టు ఇదేనా..? పొత్తు ధర్మం పాటించాలంటూనే రెండు పార్టీలు ఎవరికి వారు తమ అభ్యర్థుల ప్రకటనపై కసరత్తు చేస్తుండటం.. ఒకే సీటుపై రెండు పార్టీలూ పట్టు వదలకుండా బెట్టు చేయడంపై అనేక సందేహాలు వ్యక్తమతున్నాయి. రెండు పార్టీల మధ్య పొత్తు పొడిచి 5 నెలలు అవుతున్నా.. ఇంతవరకు సీట్ల సర్దుబాటుపై స్పష్టత లేకపోవడంతో కార్యకర్తల్లో గందరగోళం కనిపిస్తోంది. ఎన్నికల్లో గెలవాలంటే పొత్తు తప్పనిసరి అంటూనే.. ఇరు పార్టీల్లోనూ నేతలు త్యాగాలు చేయలేమంటూ యూటర్న్‌ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.పొత్తు ఖాయమే.. ఇందులో ఎవరికీ అనుమానం లేదు.. కానీ ఇరు పార్టీల్లో క్షేత్రస్థాయిలో ఏదో గందరగోళం.. ఇంకేదో అయోమయం కనిపిస్తోంది. పొత్తు ధర్మం విస్మరించొద్దంటూనే ఇరు పార్టీలూ ఎవరికి వారు పోటీపై ప్రకటనలు చేస్తుండటం కూడా అనుమానాలకు తావిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌ పలుమార్లు చర్చించి.. సీట్ల సర్దుబాటుపై అవగాహన కుదిరిందని చెబుతున్నా.. ఇంతవరకు ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది? ఎవరికి ఏ సీటు కేటాయిస్తారన్న విషయంపై స్పష్టత ఇవ్వలేదు.జనసేనకు 25 సీట్లు కేటాయిస్తారని.. 23 సీట్లపై రెండు పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయని సంక్రాంతికి ముందు జరిగిన ప్రచారం నిజం కాదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. మరో 50`60 రోజుల్లో ఎన్నికలు జరుగుతాయనగా, ఇంకా జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే విషయంపై స్పష్టమైన అవగాహన లేకపోవడం, మధ్యలో బీజేపీతో కూడా పొత్తు ఉండే చాన్స్‌ ఉందనే ప్రచారంతో మొత్తం గందరగోళంగా మారుతోంది.చంద్రబాబు అరెస్టు సమయంలో.. టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎలాంటి షరతులు లేకుండా జనసేనాని పవన్‌ పొత్తు ప్రకటించారు. దీనిపై అప్పట్లో జనసేన నేతలు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. తాను నిర్ణయం తీసుకున్నానని.. ఎవరికి నచ్చినా.. నచ్చకపోయినా పాటించాల్సిందేనని కాస్త కటువుగానే హెచ్చరించారు పవన్‌. ఇదే సమయంలో పవన్‌కు తగ్గ గౌరవం ఇస్తామని టీడీపీ కూడా స్నేహగీతం ఆలపించింది. కానీ, గత కొద్దిరోజులుగా రెండు పార్టీల్లోని పరిణామాలు పరిశీలిస్తే.. ఎవరికి వారు పట్టు వీడక, బెట్టుదిగక సర్దుబాటును సర్దుపోటుగా మార్చేస్తున్నారనిపిస్తోంది.రాష్ట్రంలో 25 జిల్లాలు ఉండగా, జిల్లాకు ఒక నియోజకవర్గం చొప్పున జనసేనకు పాతిక సీట్లు కేటాయించడంపై టీడీపీకి ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతున్నారు. ఇదే సమయంలో నాలుగు నుంచి ఐదు ఎంపీ స్థానాలు కేటాయించే అవకాశం ఉందంటున్నారు. ఐతే జనసేన క్యాడర్‌ బలంగా ఉన్న మూడు నాలుగు జిల్లాల్లో ఎక్కువ సీట్లు ఆశిస్తుండటం.. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన నేతలు ఉండటంతో సీట్ల పంపకం.. పీటముడిగా మారుతోందంటున్నారు.ఉత్తరాంధ్రలో ఆరు జిల్లాలకు గాను విశాఖ, అనకాపల్లి జిల్లాలోనే ఎక్కువ సీట్లు ఆశిస్తోంది జనసేన. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఒక్క సీటు తీసుకోవడం లేదంటున్నారు. విజయనగరంలో ఒక స్థానం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో నాలుగు నుంచి ఐదు సీట్లు అడుగుతున్నట్లు చెబుతున్నారు. అదే విధంగా కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలో జనసేన 9 సీట్లు అడిగితే ఆరు సీట్లు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని ప్రచారం జరుగుతోంది.అదే విధంగా ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్‌, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో కూడా కొన్ని సీట్లు ఆశిస్తోంది జనసేన. ముఖ్యంగా విశాఖ, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అంబేద్కర్‌ కోనసీమ, ఏలూరు జిల్లాల్లోనే ఎక్కువ సీట్లు ఆశిస్తోంది. మిగిలిన చోట్ల ఒకటి రెండు సీట్లు కేటాయించినా సరిపెట్టుకోడానికి సిద్ధమవుతోంది జనసేనఅయితే జనసేనకు 25 స్థానాలు కేటాయించే విషయంలో టీడీపీకి అభ్యంతరం లేకపోయినా.. తమ పార్టీ పటిష్టంగా ఉన్న స్థానాలను వదులుకోవడంపై టీడీపీలో వ్యతిరేకత కనిపిస్తోంది. టీడీపీకి బలమైన నేతలు ఉన్న రాజమండ్రి రూరల్‌, పిఠాపురం, మండపేట, కొత్తపేట, అమలాపురం, కాకినాడ రూరల్‌, భీమిలి, అనకాపల్లి, గాజువాక, పెందుర్తి, ఏలూరు, ఉంగుటూరు నియోజకవర్గాలను జనసేన కోరుతుండటంతో ఏం చేయాలో తేల్చుకోలేకపోతోంది టీడీపీ. ఈ పరిస్థితుల్లో టీడీపీ సీనియర్‌ నేతలు బుచ్చయ్య చౌదరి, బండారు సత్యనారాయణమూర్తి, గంటా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు వర్మ, బండారు సత్యానందం, పిల్లి అనంతలక్ష్మి వంటివారు జనసేన పేరు చెబితేనే ఉలిక్కిపడుతున్నారు.మరోవైపు రాజోలు, రాజానగరంలో పోటీ చేస్తామని జనసేనాని ఇప్పటికే ప్రకటించగా, టీడీపీ స్వాగతించింది. ఇక పవన్‌ పోటీ చేసే భీమవరంపైనా టీడీపీ అసలు ఎలాంటి ఆశలు పెట్టుకోలేదు. కానీ, జనసేన కన్నా తమ పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలను వదులుకోడానికి మాత్రం పసుపు దండు సిద్ధపడటం లేదు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి జనసేనాని పవన్‌ ఓ అడుగు ముందుకేసి జిల్లాల్లో నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. విశాఖ, రాజమండ్రిల్లో ఇప్పటికే ఈ తరహా సమావేశాలు నిర్వహించగా, భీమవరంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నేతలతో భేటీ కానున్నారు.రెండు పార్టీల మధ్య జరిగిన చర్చలు, జనసేన ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తుంది అన్న విషయాలపై క్యాడర్‌కు స్పష్టత ఇస్తున్న పవన్‌.. బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడమే క్యాడర్‌ను టెన్షన్‌ పెడుతోంది. సీట్లపై క్లారిటీ వచ్చాక.. స్పష్టమైన ప్రకటన చేస్తే.. ఇరుపార్టీల్లో అపోహలు తొలగి.. మరింత జోరుగా పని చేసుకోవచ్చు కదా.. మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు కార్యకర్తలు. ఐతే బీజేపీతో పొత్తు ఉండే పరిస్థితి వల్లే.. ముందుగా ప్రకటన చేయలేకపోతున్నారంటున్నారు పరిశీలకులు. ఏదిఏమైనా ఎన్నికలు తరుముకొస్తుంటే.. రెండు పార్టీలు ఇంకా నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తుండటం.. పొత్తుపై అనవసర అపోహలు, అపార్థాలకు తావిస్తోందంటున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *