తిరుపతి, ఫిబ్రవరి 22 : ఆంధ్రప్రదేశ్‌ లోని నెల్లూరు జిల్లాలోని రెండు గ్రామాల్లో ఏవియన్‌ ఇన్‌ ఫ్లూయెంజా కలకలం రేపింది. ఈ రెండు ప్రాంతాల్లో 10 కిలోవిూటర్ల ప్రాంతానికి మూడు కిలోవిూటర్ల పరిధిలో మూడు రోజుల పాటు చికెన్‌ షాపులను పోలీసులు మూసివేశారు. వ్యాధి నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని నెల్లూరు జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ బి.మహేశ్వరుడు తెలిపారు. ఈ రెండు కేంద్రాల్లో మూడు నెలల పాటు కోళ్ల పెంపకంపై తాత్కాలిక నిషేధం ఉందని, ఆ తర్వాత 10 నుంచి 20 కోళ్ల పెంపకానికి అనుమతిస్తామని తెలిపారు.ఏవియన్‌ ఇన్ఫ్లుఎంజా, సాధారణంగా బర్డ్‌ ఫ్లూ అని పిలుస్తారు. ఇది వైరల్‌ ఇన్ఫెక్షన్‌. ప్రధానంగా పక్షులను ప్రభావితం చేస్తుంది కాని అప్పుడప్పుడు మనుషులకు, ఇతర జంతువులకు వ్యాపిస్తుంది. ఇది అడవి పక్షులలో సహజంగా సంభవించే ఇన్ఫ్లుఎంజా వైరస్‌ వల్ల వస్తుంది. జనాలకు వ్యాప్తి సాధారణంగా సోకిన పక్షులు లేదా వాటి విసర్జనలతో ప్రత్యక్ష సంబంధం ద్వారా వస్తుంది. జనాల్లో తేలికపాటి శ్వాసకోశ అనారోగ్యం మొదలుకొని న్యుమోనియాకు దారితీస్తుంది.ఒక్కొసారి చనిపోవచ్చు కూడా. ఇక మానవులలో ఏవియన్‌ ఇన్ఫ్లుఎంజా లక్షణాలు జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, కండరాల నొప్పులు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగి ఉండవచ్చు. ఇది ఆసుపత్రిలో చేరడం లేదా మరణానికి దారితీస్తుంది. సమస్యలను నివారించడానికి లక్షణాలను ముందుగా గుర్తించాలి. బర్డ్‌ ఫ్లూ నివారణ చర్యలలో పౌల్ట్రీ ఫారాలలో పరికరాలను క్రిమిసంహారక చేయడం. వ్యాప్తిని వెంటనే గుర్తించడానికి నిఘా అవసరం. బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి చేతులు కడుక్కోవడం. పౌల్ట్రీ కార్మికులకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యం
కొళ్ల పరిశ్రమపై తీవ్ర ప్రభావం
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏడాదికి 10 లక్షల ఫారం కోళ్లు,7 లక్షల పెరటి కోళ్లు పెంపకం జరుగుతుండగా.. ఏటా రూ. 800 కోట్ల మేర పౌల్ట్రీ బిజినెస్‌ జరుగుతోంది. ఏడాదికి 37, 089 మెట్రిక్‌ టన్నుల కోళ్లు, 10.73 లక్షల కోడిగుడ్లను హేచరీస్‌ సంస్థలు, రైతులు ఉత్పత్తి చేస్తున్నారు. సరాసరి రోజువారీగా రూ. 5 కోట్ల వ్యాపారం చేస్తున్నారు. తాజాగా.. బర్డ్‌ ఫ్లూ నేపథ్యంలో.. ఫౌల్ట్రీ వాహనాలను చెక్‌పోస్టుల దగ్గర అధికారులు నిలిపివేస్తుండటంతో.. రోజుకి రూ.5కోట్ల వ్యాపారం ఆగిపోతోందంటూ ఫౌల్ట్రీ రైతుల ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.మరోవైపు బర్డ్‌ ఫ్లూ నేపథ్యంలో చిత్తూరు జిల్లా యంత్రాంగం కూడా అలెర్ట్‌ అయ్యింది. చిత్తూరు జిల్లాలో 31 ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీంలను ఏర్పాటు చేసింది. జిల్లాలో పిపిఈ కిట్లు, క్రిమిసంహారక మందులు అందుబాటులో ఉంచింది. దాదాపు జిల్లాలో 8 వేల మంది రైతులు పౌల్ట్రీ రంగంపై ఆధారపడినట్లు చెబుతున్న అధికార యంత్రాంగం.. నెల్లూరు జిల్లా నుంచి కోళ్ల ఎగుమతులను నిషేధించింది. చికిత్స, టీకా లేని బర్డ్‌ ఫ్లూ ను కేవలం నివారించడం ఒక్కటే మార్గం అంటోంది.పశువైద్య సిబ్బంది ద్వారా జిల్లా యంత్రాంగం ప్రజల్లో బర్డ్‌ ఫ్లూ పై అవగాహన కల్పిస్తోంది. బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి చెందకుండా అలెర్ట్‌ గా ఉన్నామంటున్నారు చిత్తూరు జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ప్రభాకర్‌. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా బర్డ్‌ ఫ్లూ లేదని జిల్లా ప్రజలు భయపడాల్సిన పని లేదంటున్నారు. అయితే తగిన జాగ్రత్తలు తీసుకొని కోడి మాంసం కోడిగుడ్లు వినియోగించాలంటున్నారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *