బూతులు మాట్లాడే రాజకీయ నాయకులకు పోలింగ్‌ బూత్‌లో బుద్ధి చెప్పాలి
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపు
విశాఖపట్నం, ఫిబ్రవరి 19:: బూతులు మాట్లాడే రాజకీయ నాయకులకు పోలింగ్‌ బూత్‌లో బుద్ధి చెప్పాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. సోమవారం విూడియాతో మాట్లాడుతూ… ఎస్‌ఎఫ్‌ఎస్‌ స్కూల్‌ గోల్డెన్‌ జూబ్లీ వేడుకల ముగింపు కార్యక్రమంలో వెంకయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్‌లలో కొంతమంది అపహాస్య పనులు చేస్తున్నారని… వాటిని చూడకుండా ప్రశాంతంగా ఉండాలన్నారు. రాజకీయ నాయకులు స్థాయి మరచి చౌకబారు మాటలు మాట్లాడకూడదని హితవుపలికారు. ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులు బూతులు మాట్లాడుతున్నారని… ఇటువంటి వారికి పోలింగ్‌ బూత్‌లో సమాధానం చెప్పాలన్నారు. చదువు ఎంత ముఖ్యమో సంస్కారం కూడా అంతే ముఖ్యమన్నారు. మాతృభాషను ఎవరూ మర్చిపోకూడదని ఆయన తెలిపారు.
మాతృభాష కళ్ళు లాంటిదని… పరాయి భాష కళ్లద్దాలు వంటిదని చెప్పుకొచ్చారు. విలువలతో కూడిన విద్య ఉంటే విలువలతో కూడిన పౌరునిగా తయారవుతారన్నారు. నేడు విలువలతో కూడిన విద్య తగ్గుతుందని.. ఇది మంచిది కాదన్నారు. విలువలతో కూడిన విద్యను అందించడానికి అందరూ కృషి చేయాలని కోరారు. దేశంలో ఉన్న మేధాశక్తి వలన మరల ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తోందన్నారు. భగవంతుడు ఏం కావాలని అడిగితే మళ్ళీ విద్యార్థి దశకు తీసుకువెళ్లాలని కోరుకుంటానన్నారు. దేశ వారసత్వాన్ని కాపాడుకోవాలని సూచించారు. గూగుల్‌ గురువుని మించింది కాదని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *